శాఖల సమన్వయలోపం – భూకబ్జాదారులకు వరం

by  |
శాఖల సమన్వయలోపం – భూకబ్జాదారులకు వరం
X

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం భూకబ్జాదారులకు వరంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తేలని పంచాయితీ వారికి మరింతగా కలిసొచ్చింది. రెవిన్యూ అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టినట్లయింది. కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని గాజులరామారంలో వంద ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లు తహసీల్దారు గుర్తించారు. అయితే ఈ భూమిపై హక్కు తెలంగాణ ప్రభుత్వానిదా లేక ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానిదా అనేదానిపై రెవిన్యూ అధికారులకే స్పష్టత లేకపోవడంతో చాలాకాలం మౌనంగానే ఉండిపోయారు.

సమైక్య రాష్ట్రంలో కేటాయింపు జరిగిన ఈ భూమిపై ఇప్పుడు నియంత్రణాధికారం తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ఉందా లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ఉందా అనేది కూడా తేలలేదు. ఇదే కబ్జాదారులకు వరమైంది. కబ్జాదారులు ఇండ్లు, షెడ్‌లు నిర్మించుకోడానికి వెసులుబాటు కల్పించింది. ఈ భూమిపై సర్వ హక్కులూ తమకే ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ భావించి చివరకు రంగంలోకి దిగింది. తెలంగాణ భూభాగంలో ఉన్న ప్రాంతం కావడంతో తెలంగాణ పోలీసుల సాయంతో కబ్జాదారులు నిర్మించిన షెడ్లను నేలమట్టం చేసింది. ఆ రాష్ట్రం నుంచి లేఖ రావడంతో కబ్జాకు గురైనట్లు తెలంగాణ ప్రభుత్వానికి అర్థమైంది. మొత్తానికి కబ్జాదారుల నుంచి ఈ స్థలాన్ని రక్షించగలిగినా ఇకపై ఈ స్థలంపై హక్కులు ఏ రాష్ట్రానికి అనేది మాత్రం సస్పెన్స్‌గానే ఉంది.

సర్కారు భూములను పదిలంగా కాపాడుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నా కబ్జాదారులు మాత్రం రెచ్చిపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గాజులరామారంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌కు 271.39 ఎకరాల స్థలం కేటాయించబడింది. ఇందులో 33.11 ఎకరాలు (సర్వే నెం. 308) ఒక్కో ఎకరానికి రూ. 40 లక్షల చొప్పున ప్రభుత్వ ఈక్విటీతో కేటాయింపు జరిగింది (జీవో నెం.1100/2007). మిగిలిన 238.28 ఎకరాలను 99 సంవత్సరాలకు ప్రభుత్వం లీజుకిచ్చింది. దీనికి కూడా ఎకరానికి రూ. 40 లక్షల చొప్పున ప్రభుత్వం కేటాయించింది. అయితే ఏ అవసరం కోసం ఈ భూమిని కేటాయించిందో ఆ ప్రకారం ఏపీఎస్ఎఫ్‌సి కార్యాచరణ ప్రారంభించకపోవడంతో ఏడేళ్ళ కాలాన్ని పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం 2015 అక్టోబర్‌లో తిరిగి ఈ భూమిని తీసుకుంటున్నట్లు జీవో (నెం. 195) జారీ చేసింది.

నిజానికి జీవో జారీ చేసిన తర్వాత ఆ భూమిని పంచనామా చేసి ఏపీఎస్ఎఫ్‌సీ నుంచి తెలంగాణ రెవిన్యూ శాఖ స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. కానీ రెవిన్యూ అధికారులు మాత్రం జీవోతోనే సరిపెట్టుకున్నారు తప్ప పంచనామా జరపలేదు. దీంతో ఇలా స్వాధీనం చేసుకునే జీవో చెల్లుబాటుకాదని గ్రహించిన ఏపీ ప్రభుత్వం అప్పటి ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారించిన ధర్మాసనం ఈ భూములపై స్టేటస్ కో ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తొమ్మిదవ షెడ్యూలులో ఉన్న ఈ సంస్థకు సంబంధించిన స్థిర, చరాస్తుల పంపిణీకి స్పష్టమైన నిర్వచనం ఉంది. కానీ దీన్ని అన్వయించుకోవడంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భిన్నాభిప్రాయం ఉంది. చివరకు ఇది కేంద్ర హోంశాఖ దగ్గరకు చేరినా ఫలితం మాత్రం శూన్యం. ఎవరి వాదన వారిది అన్నట్లుగానే మిగిలిపోయింది.

ఏపీఎస్ఎఫ్‌సికి కేటాయించిన 271 ఎకరాల భూమిలో 2015 నాటికే సుమారు వంద ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లు అప్పటి కుత్బుల్లాపూర్ తహసీల్దారు నివేదిక తయారుచేశారు. దాన్ని ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేసిన తర్వాత కూడా అది నిజమేనని తేలింది. అప్పటి రెవిన్యూ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ సైతం 2015 అక్టోబర్ 29వ తేదీన జారీ చేసిన జీవోలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. మూడింట ఒక వంతు భూమి కబ్జాకు గురైందని, ఏపీఎస్ఎఫ్‌సీ ఈ స్థలానికి భద్రత కల్పించలేకపోయినందున కబ్జాకు గురైందని పేర్కొన్నారు. అందువల్ల ఈ స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం శ్రేయస్కరమని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. వైఎస్సార్ హయాంలో జారీ చేసిన జీవోను రద్దు చేయాల్సిందిగా సూచించారు. కానీ కథ అక్కడితోనే ఆగిపోయింది. కబ్జాల నుంచి రక్షించడానికి ఈ నాలుగేళ్ళలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమీ లేవు.

ఆ కబ్జా స్థలంలో ఇప్పుడు నిర్మాణాలు జరుగుతున్నట్లు గ్రహించిన తహసీల్దారు తెలంగాణ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ స్థలమే అని భావించి ఆ సంస్థ అధికారులకు సమాచారం ఇచ్చారు. కానీ, ఈ స్థలం తమది కాదని ఆ అధికారులు చెప్పడంతో విధిలేక ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అధికారులకు తెలియజేశారు. దీంతో ఆ రాష్ట్ర అధికారులు స్పందించి కబ్జాలను తొలిగించడానికి నడుం బిగించింది. భద్రత కోసం తెలంగాణ పోలీసులను ఆశ్రయించింది. ఈ నెల 25వ తేదీన ఏపీఎస్ఎఫ్‌సి సీనియర్ మేనేజర్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌కు లేఖ రాశారు. దీంతో పోలీసు భద్రత నడుమ ఆ కట్టడాలను కూల్చివేసే ప్రక్రియ మొదలైంది.

వాస్తవానికి ఈ స్థలాన్ని ఏపీఎస్ఎఫ్‌సీకి చెందినదే అయినా కబ్జాల నుంచి కాపాడుకోడానికి స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలంగాణ రెవిన్యూశాఖ జీవో జారీ చేసింది. కానీ నిబంధనల ప్రకారం పంచనామా చేయలేదు. ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కలిసొచ్చింది. హైకోర్టులో తెలంగాణ వాదన వీగిపోవడానికి కారణమైంది. మొత్తానికి హైకోర్టు నుంచి స్టేటస్ కో రావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉపశమనం కలిగింది. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకూ దీనిపైన కౌంటర్ పిటిషన్ దాఖలు చేయలేదు. మరోవైపు కేంద్ర హోంశాఖపై ఒత్తిడి తెచ్చి పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణకే ఈ స్థలం దక్కుతుందన్న ఉత్తర్వును కూడా పొందలేకపోయింది. తెలంగాణ రాష్ట్ర ఫైనాన్షియల్ కార్పొరేషన్‌కు సైతం ఈ స్థలం గురించి స్పష్టమైన సమాచారం లేకుండా పోయింది.

ఒకవైపు రెవిన్యూశాఖ పంచనామా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మరోవైపు తెలంగాణ ఎస్ఎఫ్‌సి సైతం ఈ స్థలం గురించి పట్టించుకోలేదు. అందువల్లనే కబ్జా గురించి తహసీల్దారు చెప్పినా ‘ఇది మా స్థలం కాదు’ అనే సమాధానమే వచ్చింది. వీటిని మించి తెలంగాణ ప్రభుత్వం ఈ స్థలంలో జరుగుతున్న కబ్జాలను నిలువరించే ప్రయత్నం చేయలేదు. దానికి తోడు ఈ స్థలంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్తే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకుండా మౌనం వహించింది. పరోక్షంగా కబ్జాదారులకు ఈ లొసుగులే వరంగా మారాయి. ఇప్పటికైనా ఈ స్థలంలో కబ్జాలు జరగకుండా చూసే బాధ్యత ఎవరిదనేది మాత్రం సస్పెన్స్‌గానే మిగిలిపోయింది.

ఈ వంద ఎకరాల మేర కబ్జా చేసిందెవరు అనేది మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. తహసీల్దారు ఐదేళ్ళుగా చెప్తున్నా ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరించింది. రెవిన్యూశాఖ నిర్వాకం, నిర్లక్ష్యం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక రకాల కథలు చెప్పారు. ఇప్పుడు వంద ఎకరాల్లో అదే జరిగింది. ఇకనైనా రెవిన్యూశాఖ కళ్ళు తెరిచేనా?


Next Story

Most Viewed