నర్సుల రూపు రేఖలు మార్చిన కరోనా!

by  |
నర్సుల రూపు రేఖలు మార్చిన కరోనా!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏడాది నుంచి కరోనా ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇక తగ్గుతుందని అనుకునేలోపే మళ్లీ సెకండ్ వేవ్‌తో గుబులు రేపుతోంది. అదే సమయంలో కరోనా పురుడుపోసుకున్న నాటి నుంచి ఇప్పటివరకు ‘వైద్య సిబ్బంది’ మాత్రం ఆ మహమ్మారితో పోరాటం చేస్తూనే ఉన్నారు. విధి నిర్వహణలో కొందరు డాక్టర్లు కరోనాకు బలైపోయారు. మరికొంతమంది మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నారు. డాక్టర్ల కంటే ఎక్కువగా ‘నర్సులు’ బాధితుల సేవలో నిమగ్నమయ్యారు. ఈ కారణంగానే ఎంతోమంది నర్సులు శారీరక, మానసిక ఒత్తిళ్లకు లోనవుతున్నారు. హెల్త్ కేర్ వర్కర్క్‌ను పాండమిక్ ఎలా ప్రభావితం చేసిందో మీరే చూడండి అంటూ ఓ నర్సు తను గతంలో దిగిన ఫొటోను, ప్రస్తుత ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటో స్ఫూర్తితో మరెంతోమంది హెల్త్ వర్కర్క్ తమను పాండమిక్ ప్రభావం చేసిన తీరును తెలియజేస్తున్నారు.

కరోనా రాకుండా ఉండాలంటే మనం మాస్క్ ధరించి, కాస్త సోషల్ డిస్టెన్స్ పాటిస్తే చాలు. కానీ 100లో 90 మంది మాస్క్ పెట్టుకోవడానికి నిరాకరిస్తున్నారు. అదేదో బరువుగా, అసౌకర్యంగా ఫీలవుతున్నారు. కానీ వైద్య సిబ్బంది మాత్రం విధి నిర్వహణలో తప్పనిసరిగా పీపీఈ కిట్లు, మాస్క్‌లు, గ్లౌజులు ధరించడంతో పాటు నిత్యం శానిటైజేషన్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పటికీ కరోనా వచ్చి ఏడాది గడిచిపోయింది. ఆనాటి నుంచి ఇప్పటివరకు వైద్య సిబ్బందికి సెలవులు లేవు, పండగలు లేవు. విధి నిర్వహణకు మించి వైద్య సిబ్బంది ఆస్పత్రుల్లోనే గడుపుతూ నిత్యం పీపీఈ కిట్లు ధరించడంతో వాళ్ల రూపురేఖలు మారిపోతున్నాయి. గతంలో ఓ డాక్టర్ కూడా తన చేతులు ఎలా మారిపోయాయో చూపుతూ ఓ ఫొటో పోస్ట్ చేయగా, అది చూసిన వారంతా భావోద్వేగానికి గురయ్యారు. ఇదే క్రమంలో అమెరికాలోని టెనెస్సీకి చెందిన క్యాథరిన్ అనే నర్సు పాండమిక్‌కు ముందు, ఆ తర్వాత తన రూపం ఎలా మారిందో తెలుపుతూ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మొదటి ఫొటోలో ఎంతో నవ్వుతూ ఉన్న క్యాథరిన్, పీపీఈ కిట్లు ధరించడంతో ముఖం మీద మచ్చలతో, కందిపోయి గుర్తు పట్టలేనంతగా మారిపోయింది.

https://twitter.com/kathryniveyy/status/1330846061720711170?s=20

‘పీపీఈ ధరించడం వల్ల కనిపించే ఫిజికల్ ఎఫెక్ట్ ఇది. మేము చాలా డీహైడ్రేట్ అయిపోతాం. ఎందుకంటే అన్నీ ధరించడం వల్ల చెమట రూపంలో బాడీలోని మినరల్స్, విటమిన్స్ అన్నీ కోల్పోతాం. బ్రేక్ రూమ్‌లోకి వెళ్లేంతవరకు తాగలేం. అప్పటివరకు దాహంతోనే ఉండాలి. కరోనాకు ట్రీట్మెంట్ ఇప్పటివరకు లేదు. కావున కరోనాతో అప్రమత్తంగా ఉండండి. ఈ వైరస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకుంటే, మీ కుటుంబ సభ్యులను కాపాడుకున్నట్లే’ అని క్యాథరిన్ అంటోంది.

క్యాథరిన్ స్ఫూర్తితో.. సారా, మఖియాలా, లిస్, ఎల్ ఎరిన్ ఇలా వివిధ దేశాల నర్సులు తమ గత ఫొటోలను, పాండమిక్ విధుల్లోని ఫొటోలను పంచుకుంటున్నారు. ఆ నర్సుల ముఖాలన్నీ కూడా మాస్క్ మరకలతో పాటు కందిపోయి ఎర్రగా మారిపోయాయి. ఆ ఫొటోలు చూస్తుంటే వారు ఎంత బాధను అనుభవిస్తున్నారో, ఎంతటి అంకితభావంతో తమ వృత్తిని కొనసాగిస్తున్నారో అర్థమవుతోంది.


Next Story

Most Viewed