WTC: న్యూ సీజన్.. అంతా మార్చేసిన ఐసీసీ

by  |
WTC: న్యూ సీజన్.. అంతా మార్చేసిన ఐసీసీ
X

దిశ, స్పోర్ట్స్: ఐసీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డబ్ల్యూటీసీ 2019-21 ఛాంపియన్‌గా న్యూజీలాండ్ కప్ ఎగరేసుకొని పోయింది. టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి సారిగా నిర్వహించిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ 2019లో ప్రారంభమైన దగ్గర నుంచి చాలా ఆటంగకాలు ఏర్పడ్డాయి. చివరకు ఫైనల్ మ్యాచ్‌ కూడా వర్షం, వెలుతురు కారణంగా ఆటంకాల మధ్యే సాగింది. ఎలాగైతేనేమి ఐసీసీ తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను ముగించింది. ప్రతీ రెండేళ్లకు ఒకసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ నిర్వహించాలని 2018లోనే ఐసీసీ నిర్ణయించింది. ఈ మేరకు 2031 వరకు ఐసీసీ డబ్ల్యూటీసీ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. గతంలో లాగానే ప్రతీ రెండేళ్ల పాటు నిర్వహించే ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లను డబ్ల్యూటీసీ కింద పరిగణించనున్నారు. అయితే గత సైకిల్‌లో కరోనా కారణంగా మధ్యలో అర్దాంతరంగా పాయింట్ల కేటాయింపు పద్ధతిని మార్చేశారు. దీనిపై పలు విమర్శలు కూడా వచ్చాయి. దీంతో రాబోయే 2021-23 డబ్ల్యూటీసీ సీజన్‌లో కొత్త పాయింట్ల పద్ధతిని ప్రవేశ పెట్టారు. అయితే ఎలాంటి ఆటంకాలు వచ్చినా ఈ పాయింట్ల కేటాయింపులో మాత్రం మార్పులు ఉండవని ఐసీసీ స్పష్టం చేసింది.

పాయింట్ల పద్ధతి ఇలా..

డబ్ల్యూటీసీ 2021-23 సీజన్‌లో పాయింట్ల పద్ధతిలో కొన్ని మార్పులు చేశారు. గతంలో ఉన్న పాయింట్ల పద్ధతిని కరోనా కారణంగా మధ్యలో మార్చేసి… కేవలం విజయాల శాతం ఆధారంగా టాప్ 2 జట్లను ఫైనల్‌కు ఎంపిక చేశారు. అయితే ఈ సారి పాయింట్లు గతంలో కేటాయించినట్లుగానే పంపిణీ చేస్తారు. కానీ ఏదైనా కారణాల వల్ల సిరీస్, మ్యాచ్‌లు రద్దయితే పాయింట్ల విధానంలో మార్పులు ఉండవని ఐసీసీ ప్రకటించింది. ఇకపై ప్రతీ మ్యాచ్‌కు 12 పాయింట్లు కేటాయిస్తారు. గెలిస్తే ఆ పాయింట్లు మొత్తం ఆ జట్టుకే వెళ్లిపోతాయి. డ్రా అయితే చెరి 4 పాయింట్లు, టై అయితే చెరి 6 పాయింట్లు పంచుతారు. సిరీస్‌తో సంబంధం లేకుండా కేవలం మ్యాచ్‌ల ఆధారంగానే పాయింట్లు ఉంటాయి. కాకపోతే డబ్ల్యూటీసీ 2వ సీజన్‌లో ప్రతీ జట్టు స్వదేశంలో 3, విదేశాల్లో 3 సిరీస్‌లు తప్పకుండా ఆడాల్సి ఉంటుంది. ఒక సిరీస్‌లో ఎన్ని మ్యాచ్‌లు ఆడాలనేది ఆయా క్రికెట్ బోర్డులు నిర్ణయించుకుంటాయి. అయితే ఏకైక టెస్టులకు మాత్రం చోటు ఉండదని ఐసీసీ చెప్పింది. మరోవైపు కొత్తగా టెస్టు సిరీస్ హోదా పొందిన ఆఫ్గానిస్తాన్, ఐర్లాండ్ జట్లు ఈ సీజన్‌లో ఫైనల్ ఆడటానికి అర్హత ఉండదని సమాచారం. ఇక స్లో ఓవర్ రేట్‌కు పాయింట్ల కోత కూడా ఉంటుంది. నిర్దారించిన సమయానికి సరిపడా ఓవర్లు వేయకపోతే.. ఎన్ని ఓవర్లు తక్కువ వేస్తే అన్ని పాయింట్లు కోత పెడతామని ఐసీసీ స్పష్టం చేసింది. త్వరలోనే జరుగనున్న ఐసీసీ ఎగ్జిక్యూటీమ్ సమావేశంలో ఈ నిబంధనలను ఆమోదించనున్నారు.

ఇండియాతోనే ప్రారంభం..

అరంగేట్రం డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఓడిపోయిన టీమ్ ఇండియా ఆడబోతున్న సిరీస్‌తోనే తర్వాతి సీజన్ ప్రారంభం కానున్నది. ఆగస్టు 4 నుంచి టీమ్ ఇండియా ఐదు టెస్టుల సిరీస్ ఇంగ్లాండ్‌తో ఆడనున్నది. అప్పటి నుంచే డబ్ల్యూటీసీ రెండవ సీజన్ ప్రారంభం కానున్నట్లు ఐసీసీ స్పష్టం చేసింది. భారత క్రికెట్ జట్టు ఆ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తలపడనున్నది. దీనిలో భాగంగా 4 టెస్టులు జరుగనున్నాయి. న్యూజీలాండ్, దక్షిణాఫ్రికా కూడా ఇండియాతో టెస్టు సిరీస్ ఆడనున్నది. మొత్తంగా చూసుకుంటూ ఈ రెండేళ్లలో ఇంగ్లాండ్ 21 టెస్టులు, ఇండియా 19, ఆస్ట్రేలియా 18, దక్షిణాఫ్రికా 15, న్యూజీలాండ్ , వెస్టిండీస్, శ్రీలంక 13 టెస్టులు ఆడనున్నాయి. పాకిస్తాన్ 14 టెస్టులు ఆడనుండగా.. ఇండియాతో ఆడేది ఉన్నదా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. ఈ రెండుళ్లలో 5 టెస్టుల సిరీస్‌లు జరిగేవి రెండు మాత్రమే. ఇండియా- ఇంగ్లాండ్ మధ్య జరుగనున్న టెస్టు సిరీస్‌తో పాటు యాషెస్‌లో 5 టెస్టులు జరుగనున్నాయి.



Next Story

Most Viewed