వాలని కనురెప్ప! నిద్రలేమితో నగర వాసుల నరకం

by  |
వాలని కనురెప్ప! నిద్రలేమితో నగర వాసుల నరకం
X

దిశ, శేరిలింగంపల్లి: కనురెప్ప వాలనంటుంది.. పడుకున్నా నిద్ర పట్టని పరిస్థితి.. అర్ధరాత్రి దాటిన కనుకుతీయని వైనం.. ఇటీవల నగర వాసులను వేధిస్తోన్న సమస్య.. కరోనా తర్వాత నగరవాసులను కలవరపెడుతున్న ప్రాబ్లమ్.. ఎంతో మంది పనిఒత్తిడి, ఆర్థిక ఇబ్బందుల కారణంగా సరిగ్గా నిద్రపోవడం లేదు. మారిన ఆహారపు అలవాట్లు, జీవన శైలి నిద్రలేమికి కారణమని వైద్యులు పేర్కొంటున్నారు. యువకుల నుంచి వయోవృద్ధుల వరకూ ఈ సమస్యతోనే బాధపడుతున్నారు. నిద్రలేమి సమస్య దీర్ఘకాలంలో మానసిక రుగ్మతలకు దారితీసే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఉరుకుల పరుగుల జీవితంలోఉదయం లేచింది మొదలు అర్ధరాత్రి వరకు ఏదో ఒకపని. వారంవారం మారే ఉద్యోగుల షిఫ్ట్‌లు, పగలు రాత్రి తేడాలేకుండా పనులు, వ్యాయామానికి సమయం లేకపోవడం, వేలాపాలాలేకుండా ఆహారంతో నిద్రలేమి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తద్వారా మానసిక రుగ్మతలకు దారితీస్తున్నాయి. దీనికి తోడు అర్ధరాత్రి వరకూ టీవీలు చూడడం, స్మార్ట్‌ఫోన్లతో కుస్తీలు పట్ట డం, వీకెండ్ పార్టీల్లో మునిగితేలుతుండటం యూత్ కు అలవాటుగా మారిపోయింది. ఇక పెద్దవారికి కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఆందోళన, కుంగుబాటు, ఉద్యోగాల్లో కుదు పులు నిద్రలేమికి కారణమని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

కరోనా టెన్షన్స్..

కరోనా ఎఫెక్ట్ కాస్త తగ్గినా మనుషుల జీవితాలు మాత్రం కరోనాకు ముందు ఆ తర్వా త అని వేర్వేరుగా చూడాల్సి వస్తుంది. లాక్‌డౌన్‌ ముందు ప్రణాళికతో సాగిన జీవితాలు ఆత ర్వాత తారుమారయ్యాయి. కరోనాతో అందరిలోనూ భవిష్యత్తుపై ఆందోళన అధికమైంది. దీంతో మానసికంగా కుంగిపోతూ నిద్రలేమికి గురవుతున్నారు. కరోనా తర్వాత వచ్చే రుగ్మత ల్లో నిద్రలేమి ప్రధానంగా కనిపిస్తోందంటున్నారు వైద్యులు.

ఎన్నో అనర్థాలు..

నిద్రలేమి సమస్యతో ఎన్నో అనర్థాలు జరిగే అవకాశం ఉంది. మానసిక రుగ్మతలతో కంటి సమస్యలు, శరీర అలసట, ఆందో ళన, ఊబకాయం, లావు పెరగడం, వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు అంటున్నారు. దీర్ఘకాలికంగా ఇదే సమస్య పునరావృతం అవుతుంటే ఆరోగ్యం పూర్తిగా పాడవుతుందని, ఇది మరణానికి కూడా దారితీసే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. ఎక్కువమంది నిద్రమాత్రాలను వేసుకుంటున్నారు. కొందరు వైద్యుల సూచన లేకుండా నిద్రమాత్రలు వాడడం మంచిది కాదని సైకియాట్రిస్ట్ లు చెబుతున్నారు.

ఇలా చేస్తే హాయిగా నిద్రపోవచ్చు..

నిద్ర పట్టాలంటే ముందు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఏకబిగిన ఏడు గంటలు నిద్రపోతే ఆరోగ్యంగా ఉండచ్చు. పడుకునేందుకు రెండు గంటల ముందు భోజనం ముగించుకోవాలి. పడక గదిలో టీవీలు, ల్యా ప్‌ ట్యాప్‌లు, సెల్ ఫోన్స్ వంటివి ఉంచక పోవడమే మంచిది. పడక గదిలో లైట్స్ ఆర్పివేసి ఉండచడమే బెటర్. సాయంత్రం పూట కాఫీ, టీలు తాగడం వల్ల నిద్రకు దూరమయ్యే ప్రమాదం ఉంది. హాయిగా నిద్రపోవాలంటే మానసిక ప్రశాంతత, ఒత్తిడి తగ్గించుకోవడం, శారీరక వ్యాయామం, రాత్రి వేళ 7-9 గంటల మధ్యలో నిద్రకు ఉపక్రమించటం వంటి అలవాట్లతో సమస్యను అధిగమించవచ్చు అని డాక్టర్లు సూచిస్తున్నారు.

నిద్రలేమితో జాగ్రత్త..

నిద్రలేమి సమస్య ఈ మధ్య కాలంలో చాలామందిలో కనిపిస్తోంది. భయం, ఆం దో ళనలు ఇతరత్రా కారణాలతో నిద్రలేమి ఏర్పడుతుంది. నిద్రలో నాలుగు రకాలు ఉంటాయి. కొంద రు పడుకున్న కాసేపటికే గురకపెట్టి నిద్ర పోతుంటారు. మరికొందరు చాలాసేపటి వర కు నిద్రపోరు. మామూలుగా 90 నిమిషాల తర్వాత ఘాడ నిద్రలోకి జారుకుంటారు. ఇలా హాయిగా నిద్రపోతేనే ఆరోగ్యంగా ఉంటారు. లేదంటే దీర్ఘకాలికంగా ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రతీ ఒక్కరు కొంత సమయాన్ని నిద్రకు కేటాయించాలి. అప్పుడే మెదడు బాగా పనిచేస్తుంది, శరీరం అలసట నుండి ఉపశమనం పొందుతుంది.

– డాక్టర్ పీ శ్రీనివాస్, ఎండీ, ఎంపీహెచ్, న్యూరో సైకియాట్రిస్ట్


Next Story

Most Viewed