పంటలకు ‘రుణ’మేది..?

by  |
పంటలకు ‘రుణ’మేది..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: యాసంగికి పెట్టుబడి కష్టాలు మొదలయ్యాయి. వానాకాలంలో పంటల సాగు పెరిగినా అక్టోబర్​ వరకూ కురిసిన వానలతో పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. చేతికి వచ్చిన పంట దక్కకుండా పోయింది. ఉత్పత్తులను అమ్ముకునేందుకు కూడా అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా రైతులకు ఫలితం లేకుపోయింది. సన్నధాన్యం ఎక్కువగా సాగు చేసినా మద్దతు ధరపై ఇంకా గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో కల్లాల నుంచే వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోళ్లు చేస్తున్నారు. రైతుల పేరుతో మద్దతు ధరకు విక్రయ కేంద్రాల్లో అమ్ముతున్నారు. ప్రస్తుతం ఈ కష్టాల నుంచి గట్టెక్కతున్న రైతులకు ఇప్పుడు యాసంగి పెట్టుబడి భారంగా మారింది. వరదలతో జరిగిన నష్టంతో ఈసారి చేతిలో చిల్లిగవ్వ లేకుండా చేసింది. దిగుబడి వచ్చినా వానాకాలం పెట్టుబడికి తెచ్చిన అప్పులకే సరిపోతున్నాయి. ఇక పంట పెట్టుబడి కోసం రుణాలిచ్చే బ్యాంకులు ఈసారి కొన్ని జిల్లాల్లో ఖాతా కూడా తెరువడం లేదు. ఒకవేళ అప్పులిచ్చినా వడ్డీలకే వాల్చుకుంటున్నారు. తిరుగు కాగితాలతో రుణాలిచ్చినట్టు చేస్తున్నా రైతుల చేతికి రూపాయి రావడం లేదు. మరోవైపు ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో వడ్డీలు పెరిగిపోతున్నాయి.

రుణానికి సవాలక్ష సమస్యలు

పంట రుణాలివ్వడంలో బ్యాంకర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గత వానాకాలం కూడా నిర్దేశించిన లక్ష్యంలో కేవలం 66 శాతమే లోన్లు ఇచ్చారు. వానాకాలం సీజన్​లో రూ. 31,936 కోట్ల పంట రుణాలివ్వాలని టార్గెట్ ఉండగా, 20.41 లక్షల మంది రైతులకు రూ. 21,144.64 కోట్ల రుణాలిచ్చారు. దీంతో వానాకాలం సీజన్లో కూడా రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించారు. దీంతో పంటలను వారికే అమ్ముకునేలా ఒప్పందం చేసుకుని పెట్టుబడికి అప్పులిచ్చారు. ఈ యాసంగి సీజన్లో బ్యాంకర్ల ఆంక్షలు మరింత పెరిగాయి. పట్టా పుస్తకాలు, పహానీలు, ఎన్​ఓసీ లెటర్ల కోసం రైతులను తిప్పుతున్నారు.

ఏటేటా ఇంతేనా..?

రాష్ట్రంలో బ్యాంకులు రైతులను గాలికి వదిలేశాయి. పంట రుణాల మంజూరు చేయలేదు. రైతులను బ్యాంకుల చుట్టూ తిప్పించుకుంటున్నారు. పాత బకాయిలున్నాయని, రుణ మాఫీ నిధులు రాలేదని, వడ్డీ పెండింగ్‌ ఉందని, పావలా వడ్డీ రాలేదని… ఇలా రకరకాల సాకులు చెప్పి రుణాలు ఇవ్వకుండా కాలం దొర్లిస్తున్నారు. దేశమంతా వ్యవసాయ రుణ పరపతి పెరుగుతుంటే తెలంగాణలో మాత్రం తగ్గుతోందని గతంలో పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదికలో కూడా ప్రకటించారు. మూడున్నరేండ్ల క్రితం రూ.47 వేల కోట్లు వ్యవసాయ రుణాలుగా అందించిన బ్యాంకులు… 2018- 19 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.27 వేల కోట్లు పంపిణీ చేశాయి. ఒక్క సంవత్సరంలో చిన్న, సన్నకారు రైతులకు ఇచ్చే రుణం ఏకంగా రూ. 20 వేల కోట్లు తగ్గిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ ఏడాది వ్యవసాయ రుణ ప్రణాళికలో వ్యవసాయానికి మొత్తం రూ. 75,141 కోట్ల రుణాలిచ్చేందుకు నిర్దేశించారు. దీనిలో వానాకాలం, యాసంగిలో పంట రుణాల కోసం రూ. 53,222.51 కోట్లు ఇవ్వాల్సి ఉంది. వానాకాలంలో రూ. 31,936 కోట్లు, యాసంగిలో రూ. 21,286 కోట్ల పంట రుణాలివ్వాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం కరోనా విపత్తు వేళ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా గతంలో నిర్ణయించిన స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌పై 10 శాతం అదనపు రుణం ఇవ్వాలని బ్యాంకర్లను ఆదేశించారు. ఈ లెక్క ప్రకారం రైతులకు అంతా కలిపి వానాకాలం లోనే రూ. 33,713 కోట్లు రైతులకు పంపిణీ చేయాల్సి ఉంది. యాసంగిలో మరో రెండు వేల కోట్లు అదనంగా రుణాలుగా ఇవ్వాల్సి ఉంది. కానీ బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవటంతో రైతులు ప్రైవేటు అప్పులు చేయక తప్పటం లేదు.

గతేడాది ఘోరం..

రాష్ట్రంలో 59 లక్షల మంది రైతులుంటే గడిచిన యాసంగి సీజన్‌లో కేవలం 16 లక్షల మంది రైతులకే బ్యాంకర్లు పంట రుణాలు ఇచ్చారు. ఎస్‌ఎల్‌బీసీ నిర్ణయం ప్రకారం రూ.19,496కోట్ల పంట రుణాలను గడిచిన యాసంగిలో ఇవ్వాలి. కీలకమైన నాలుగు నెలల్లో(అక్టోబర్‌- 2019 నుంచి ఫిబ్రవరి-2020) కేవలం రూ.7,628 కోట్లు(39 శాతం) పంపిణీ చేశారు. ఈ ఏడాది వానాకాలంలో 66.21 శాతం మాత్రమే రుణాలిచ్చారు. తాజాగా యాసంగిలో రూ. 21,287కోట్ల రుణానికి శనివారం నాటికి రూ. 2314 కోట్లు ఇచ్చారు. వీటిలో చాలా మేరకు రెన్యూవల్స్ ఎక్కువగా ఉన్నాయి.

బ్యాంకులకు రాకండి..

రైతులను బ్యాంకుల దగ్గరకు రానీయడం లేదు. ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో వడ్డీ పెరుగుతోంది. రూ. లక్షలోపు అప్పులున్న రైతుల రుణాలు నాలుగు విడుతల్లో మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం రూ. 6వేల కోట్లను బడ్జెట్లో పెడుతున్నట్లు చెప్పింది. కానీ ఒక విడుతలో రూ. 25 వేల మాఫీని విడుదల చేశారు. ఇక మళ్లీ రుణమాఫీ మాటే లేదు. ఈ నేపథ్యంలో రైతులు కూడా ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందనే ధైర్యంతో వడ్డీలు చెల్లించలేదు. ఫలితంగా రైతుల పంట రుణాలపై వడ్డీ పేరుకుపోయింది. దీంతో బ్యాంకులు వడ్డీ చెల్లించాలని నిబంధనలను విధిస్తున్నారు. ఈ యాసంగిలో వడ్డీలు చెల్లించే రైతులకు రుణాలిస్తామంటూ మెలిక పెడుతున్నారు. పాత వడ్డీలను చెల్లించేందుకు కొత్త రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కొన్నిచోట్ల బ్యాంకర్లు పంట రుణాల పేరుతో అప్పు ఇస్తున్నా… అవి పాత వడ్డీకే సరిపోతున్నాయి. దీంతో నాలుగైదు వేలు రైతుల చేతుల్లో పెట్టి పంపుతున్నారు.

ధరణితో మరో బ్రేక్..

ప్రస్తుతం రైతులకు అదును సమయం. విత్తనాలు కొనుగోలు చేసి, ఎవుసానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పెట్టుబడులకు తిరుగాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. బ్యాంకుల్లో కొత్త నిబంధనలు మరింత భారమవుతున్నాయి. ధరణి పోర్టల్ నుంచి కొత్త పాసుపుస్తకాలు, పహానీల కోసం రైతులు కష్టాలు పడుతున్నారు. వాస్తవంగా ధరణిలో చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కొన్నిచోట్ల సర్వే నెంబర్ల ఇబ్బందులున్నాయి. పేర్లు సరైన విధంగా నమోదు కావడం లేదు. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో ఇవ్వాలంటూ మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగాల్సి వస్తోంది. అటు ఎన్​ఓసీ కూడా రావడం కష్టంగా మారింది.

సంవత్సరం పంట రుణాల లక్ష్యం రుణం ఇచ్చింది (రూ. కోట్లల్లో)

2014‌‌–15 18,717 17,019
2015–16 27,800 2‌‌0,585
2016–17 29,101 26,282
2017–18 39,752 31,414
2018–19 42,494 33,751
2019–20 48,470 38,151
2020–21 (వానాకాలం) 31,936 21,144
యాసంగి 21,287 2314.0


Next Story

Most Viewed