‘నీలి’తిమింగలంతో పర్యావరణ సమతుల్యం

by  |
‘నీలి’తిమింగలంతో పర్యావరణ సమతుల్యం
X

దిశ, వెబ్‌డెస్క్: విశ్వంలో అతిపెద్ద జంతువు ఏది అనగానే అందరూ చెప్పే సమాధానం నీలి తిమింగలం. ఇంత భారీగా ఉండే ఈ జంతువు సముద్రం అడుగున తిరుగుతూ గాలి కోసం ఉపరితలం మీదకి వస్తూ ఉంటుంది. గుంపులుగా ఉండే చిన్న చిన్న చేపలను ఆహారంగా తిని జీవించే ఈ తిమింగలాల గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇటీవల తెలిశాయి. సముద్రంలో ఊరికే టైంపాస్‌కు తిరుగుతున్నాయని అందుకే వాటిని పట్టుకొచ్చి నూనెలు, మాంసం కోసం ప్రాసెసింగ్ చేసి లాభాలు గడిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవి టైంపాస్‌కు తిరగడం లేదు. సముద్రంలో కార్బన్‌ను స్థిరీకరిస్తున్నాయి. వీటి భారీకాయాల్లో ఉన్న కార్బన్ వల్ల సముద్ర జీవావరణం సమతుల్యంగా మారుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్రపు అడుగున ఉంటూ మొత్తం భూమ్మీద ఉష్ణోగ్రత స్థాయిని ఇవి ప్రభావితం చేయగలుగుతున్నాయి.

జనావాసాల ప్రాంతాల్లో కర్బన చక్రాన్ని సమతుల్యం చేయడానికి మనుషులు ఉన్నారు. మరి మహాసముద్రాల పరిస్థితి ఏంటి? అందుకే ఈ పనిని నీలితిమింగలాలు చేస్తున్నాయి. తిమింగలం చనిపోయినపుడు దాని శరీరం సముద్రపు అడుగును చేరుకుని అక్కడే కుళ్లిపోతుంది. అప్పుడు దాని భారీ శరీరంలోని కార్బన్ అడుగున జీవిస్తున్న జీవులకు ఉపయోగపడుతుంది. అలాగే తిమింగలం బతికి ఉన్నపుడు అది గాలి కోసం, మల విసర్జన కోసం ఉపరితలం మీదకి వస్తుంది. అప్పుడు ఉపరితలం మీద ఉన్న కర్బన చక్రం సమతుల్యం అవుతుంది. అంతేగాకుండా పెద్దమొత్తంలో విడుదలయ్యే వీటి మలం, ఉపరితలం మీద పెరిగే ఫైటోప్లాంకటన్‌ల ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫైటోప్లాంకటన్‌ల వల్లనే అంతో ఇంతో గ్లోబల్ వార్మింగ్ తగ్గుముఖం పడుతోందని సైంటిస్టుల అభిప్రాయం. అంటే పరోక్షంగా ఈ క్రెడిట్ తిమింగలాలకు దక్కాల్సిందేనన్నమాట.

అలాగే తిమింగలాల శరీరాలు ఒడ్డుకు కొట్టుకుని వస్తుండటం మనం చూస్తూనే ఉంటాం. అంత భారీకాయాన్ని చూడటానికి జనాలు కూడా ఎగబడతారు. అయితే కొన్నిసార్లు అలా కొట్టుకువచ్చిన శరీరాల్లో కార్బన్ స్థాయి విపరీతంగా పెరిగి అది పేలిపోయే అవకాశం కూడా ఉంటుంది. కానీ, ఎప్పుడైతే తిమింగలాలను మాంసం కోసం, నూనెల కోసం వేటాడటం మొదలుపెట్టారో అప్పట్నుంచి వీటి సంఖ్య తగ్గుతూ వస్తోంది. క్రీ.పూ.1,000 నుంచే తిమింగలాలను వేటాడటం మానవుడు ప్రారంభించాడు. ఇక అప్పట్నుంచి చూసుకుంటే 66 శాతానికి తిమింగలాల సంఖ్య పడిపోయిందని ది సైన్స్ రిపోర్ట్ చెబుతోంది.

ఇక పారిశ్రామిక అవసరాల కోసం తిమింగలాల వేటను ప్రారంభించాక అవి అంతరించిపోయే స్థాయికి చేరినట్లు 2010లో జరిగిన ఓ అధ్యయనం చెబుతోంది. దీని వల్ల సముద్రంలో చనిపోయి అట్టడుగు భాగంలో కర్బన స్థాపన చేయాల్సిన తిమింగలాలన్నీ తీరప్రాంతంలో మాంసంగా మారుతున్నాయి. దీంతో సముద్ర అడుగు భాగం, ఉపరితలం ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు వస్తున్నాయి. ఈ హెచ్చుతగ్గుల కారణంగా పైటోఫ్లాంకటన్ లాంటి మొక్కల ఎదుగుదలకు ఆటంకం ఏర్పడుతోంది. తద్వారా వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయి తీవ్రంగా పెరుగుతోందని మైన్ యూనివర్సిటీకి చెందిన మెరైన్ సైంటిస్ట్ ఆండ్రూ పెర్షింగ్ వెల్లడించారు. అంతేగాకుండా తిమింగలాల సంఖ్య తగ్గడం వల్ల సముద్రపు ఆహారపు గొలుసులో తీవ్రమైన తేడాలు సంభవిస్తున్నాయని ఆండ్రూ వివరించారు. దీనికి పరిష్కారాన్నీ ఆయన సూచించారు.

ఈ సమస్యను పరిష్కరించాలంటే తిమింగలాల సంఖ్యను గతంలో ఉన్న స్థాయికి తీసుకురావడం తప్ప వేరే పరిష్కారం లేదని ఆండ్రూ అన్నారు. ఓ వైపు తిమింగలాల సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తూ మరో వైపు ఫైటోప్లాంకటన్ వృద్ధికి కృషి చేయాలని అప్పుడే జీవావరణం సమతుల్యం అవుతుందని చెప్పారు. ఇందుకోసం ఐరన్ ఫెర్టిలైజేషన్ అనే జియోఇంజినీరింగ్ విధానాన్ని ఆయన ప్రతిపాదించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తిమింగలాలు చేసే పనిని భర్తీ చేయాలంటే పెద్ద మొత్తంలో ఐరన్ ఫెర్టిలైజేషన్ చేసి, తద్వారా అట్టడగు సముద్ర జీవులతో పాటు, ఉపరితలం మీద ఫైటోప్లాంకటన్ మొక్కలను కాపాడటం కొద్దిగా పెద్ద పనే. కాబట్టి తిమింగలాల వేట మీద పరిమితులు విధించడం, ప్లాస్టిక్‌ను సముద్రంలో పడేయకుండా నిషేధించడం లాంటి తాత్కాలిక ఉపశమన చర్యలను తీసుకుంటే మంచిది.



Next Story