50 ఏళ్లు దాటినవారికి వ్యాక్సిన్ ఎలా..?

by  |
50 ఏళ్లు దాటినవారికి వ్యాక్సిన్ ఎలా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత 50 ఏళ్లు దాటినవారికి ఇవ్వడమెలా అనేదానిపై ఇప్పటికింకా స్పష్టత రాలేదు. కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ సైతం నిర్ణయం తీసుకోలేదు. దీంతో నిర్దిష్టమైన మార్గదర్శకాలు కూడా రూపొందలేదు. కేంద్ర వైద్యారోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ గురువారం ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల వైద్యారోగ్య మంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్రాల వైద్య మంత్రులంతా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అయితే కేంద్రం ఇప్పటికింకా స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో ఓటర్ల జాబితా ఆధారంగా యాభై ఏళ్ల వయసు పైబడినవారి పేర్లను వెతికి ‘కొవిన్’ సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేయాల్సిన బాధ్యత చివరకు మండల, గ్రామ స్థాయిలో ఉన్న వైద్యారోగ్య శాఖ సిబ్బంది నెత్తిన పడింది.

ఫ్రంట్ లైన్ వారియర్లుగా..

హెల్త్ కేర్ వర్కర్ల పేర్లన్నీ ఇప్పటికే ‘కొవిన్’లోకి ఎక్కినందున ఇక ఫ్రంట్‌లైన్ వారియర్లుగా ఉన్న పోలీసు, రెవెన్యూ, పారిశుధ్య సిబ్బంది పేర్లు అప్‌లోడ్ కావాల్సి ఉంది. ఆయా విభాగాధిపతులు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. అయితే తొలి దశలోనే వీరందరికీ వ్యాక్సిన్ ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాల్సిందిగా కేంద్ర మంత్రికి రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. అందరూ కరోనా సేవలో పాల్గొన్నందున్న ముందు వెనక తేడాలొస్తే వివక్ష అనే అభిప్రాయం కలుగుతుందని, అందువల్ల వీరందరిదీ ఒకే కేటగిరీ అనే అర్థంలో సమాన ప్రాధాన్యతతో వ్యాక్సిన్ అందించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.

ఓటర్ల జాబితానే ప్రమాణికం..

యాభై ఏళ్లు పైబడిన వృద్ధులను గుర్తించడం, వారి పేర్లను ‘కొవిన్’లో అప్‌లోడ్ చేయడం, వ్యాక్సిన్ అందించడం వైద్యారోగ్య సిబ్బందికి సవాలుగా మారింది. ఇప్పటివరకు వారిని గుర్తించకపోవడంతో ఇక ఓటర్ల జాబితాయే ప్రామాణికం కానుంది. ఇదే విషయాన్ని గురువారం వీడియో కాన్ఫరెన్సులో కేంద్ర మంత్రి దృష్టికి వివిధ రాష్ట్రాల వైద్య మంత్రులు తీసుకెళ్లారు. చివరకు మండల, గ్రామస్థాయిలో ఉన్న వైద్యారోగ్య సిబ్బంది ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకుని యాభై ఏళ్ల వయసు దాటినవారందరి వివరాలను నమోదు చేసే బాధ్యతను తీసుకోవాలన్న నిర్ణయం జరిగింది.

రూ. 480 కోట్లు కేటాయించిన కేంద్రం..

వ్యాక్సినేషన్‌ ప్రక్రియను దేశమంతా ఏకకాలంలో కొనసాగించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ‘కొవిన్’ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చినందున అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన నెట్‌వర్క్ నిర్వహణకు కేంద్రం అన్ని రాష్ట్రాలకూ కలిపి రూ. 480 కోట్లను కేటాయించింది. ఇందులో తెలంగాణ వాటాగా రూ. 14 కోట్లు అందనున్నాయి.



Next Story

Most Viewed