తెలుగువారికి పట్టని 'ఆంధ్రాబ్యాంకు'!

by  |
తెలుగువారికి పట్టని ఆంధ్రాబ్యాంకు!
X

దిశ, వెబ్‌డెస్క్: గతేడాది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయడం కోసం విలీన ప్రక్రియను ఇంకాస్త వేగవంతం చేస్తున్నామనే ప్రకటన చేశారు. ఇందులో భాగంగా పది బ్యాంకులను కలిపేసి నాలుగు పెద్ద బ్యాంకులుగా మార్చబోతున్నట్లు ప్రకటించారు. అలా విలీనం చేయబోతున్న పది బ్యాంకుల్లో తెలుగువారి బ్యాంకు, ఆంధ్రప్రదేశ్‌లో పురుడు పోసుకుని, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ శాఖలను కలిగి తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన ఆంధ్రాబ్యాంకు కూడా ఉంది. తెలుగు వారి బ్యాంకును కార్పొరేషన్ బ్యాంకుతో కలిపి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 తర్వాత తెలుగువారి సొంత బ్యాంకు అయిన ఆంధ్రాబ్యాంకు చరిత్రగర్భంలో కలిసిపోనుంది.


చరిత్ర:

కృష్ణా జిల్లాలోని అప్పటి బందరు, ఇప్పటి మచిలీపట్నం ప్రధాన కేంద్రంగా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంధ్రాబ్యాంకును స్థాపించారు. 1923లో లక్ష రూపాయల మూలధనంతో మొదలైన ఈ బ్యాంకు నవంబర్ 20న రిజిస్టర్ అయ్యి, నవంబర్ 28 నుంచి బందరు కేంద్రంగా కార్యకలాపాలను ప్రారంభించింది.

1980 ప్రాంతంలో అప్పటి ప్రధాని, ఐరన్ లేడీ ఇందిరాగాంధీ హయాంలో రెండుసార్లు బ్యాంకుల జాతీయికరణ ప్రక్రియ నిర్వహించారు. నిర్ధిష్ట మూలధనం ప్రామాణికంగా తొలివిడత ప్రక్రియ మొదలుపెట్టారు. ఆ సమయంలో ఆంధ్రాబ్యాంకు తొలివిడతలోనే నేషనలైజేషన్ అవ్వాల్సింది కానీ అప్పటి పరిస్థితుల్లో ఆంధ్రాబ్యాంకు వారు మూలధనాన్ని తగ్గించి జాతీయీకరణ నుంచి తప్పించారు. అయితే, ఇందిరాగాంధీ రెండో విడతలో ఆంధ్రాబ్యాంకును జాతీయం చేశారు. ఆ విధంగా ఆంధ్రాబ్యాంకు 1980, ఏప్రిల్ 15న నేషనలైజ్డ్ బ్యాంకుగా మారింది. 1980లో ఆంధ్రాబ్యాంకుతోపాటు మరో 13 బ్యాంకులను కూడా జాతీయం చేశారు. జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇందిరా గాంధీ బ్యాంకుల నేషనలైజేషన్ తర్వాత జాతీయీకరణ జరిగిన బ్యాంకులన్నీ పూర్వ నామాలతోనే మనుగడ సాగించాయి.
ఆంధ్రాబ్యాంకును జాతీయం చేసిన సమయంలో మొత్తం 974 పూర్తిస్థాయి శాఖలను, 40 క్లస్టర్ బ్రాంచ్‌లను, 76 ఎక్స్‌టెన్షన్ కౌంటర్లను కలిగి ఉండేది. ప్రస్తుతం.. 2018 గణాంకాల ప్రకారం ఆంధ్రాబ్యాంకుకు 2,904 శాఖలున్నాయి. ఇందులో 21,740 మంది సిబ్బంది ఉన్నారు.

లోగో ప్రత్యేకత :

అప్పట్లో ఆంధ్రాబ్యాంకు లోగో ఎంతోమందిని ఆకర్షించింది. లోగోలో ఉండే ఇన్ఫినిటీ చిహ్నం వినియోగదారుల కోసం ఎంతటి పనిచేయడానికైనా సిద్ధమని, ఎంత దూరం వెళ్లడానికైనా వెనుకాడేదిలేదనే సందేశాన్ని సూచించేలా డిజైన్ చేశారు. గొలుసు లాంటి రూపం సంస్థ ఐక్యతను సూచిస్తుందని, లోగోకు వాడిన నీలం, ఎరుపు రంగులు దృఢత్వాన్ని, చైతన్యాన్ని సూచిస్తాయని ఆంధ్రాబ్యాంకు రికార్డుల్లోనూ, వెబ్‌సైట్‌లోనూ పేర్కొన్నారు.

విలీనం దేనికి:

భారత ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా ముందుకెళ్తునామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 1980లో జరిగిన బ్యాంకుల జాతీయీకరణ కన్నా ముందు భారత ఆర్థిక వ్యవస్థను పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలే నియంత్రించేవి. ఆ సమయంలో డిపాజిటర్లకు ఎటువంటి రక్షణా ఉండేది కాదు. ఆ తర్వాత 1991లో చేపట్టిన పరిణామాల్లో బ్యాంకింగ్ రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచింది. వినియోగదారులకు, పెట్టుబడిదారులకు గొప్ప భరోసాను, విశ్వసనీయతను కల్పించాయి. ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన ఈ బ్యాంకుల విలీనాల ప్రధాన లక్ష్యం మొండి బకాయిలు అధికంగా ఉన్న బ్యాంకులను బెటర్ పర్ఫార్మెన్స్ ఉన్న బ్యాంకులతో విలీనం చేయడం ద్వారా నిరర్ధక ఆస్తులను తగ్గించడం.

1969లో 14 అతిపెద్ద వాణిజ్య బ్యాంకులను భారత ప్రభుత్వం జాతీయీకరణ చేసింది. అప్పుడు జరిగిన పరిణామాలకు వ్యవసాయం, చిన్న పరిశ్రమలు, ఎగుమతులు, పారిశ్రామికీకరణలకు ఊతమివ్వడానికనీ, బలహీన వర్గాలకు అవసరమైన బలాన్ని ఇచ్చేందుకనీ అప్పటి ప్రభుత్వ ప్రకటించింది. ఆ తర్వాత 1980లో ఆంధ్రాబ్యాంకు సహా 13 బ్యాంకులను విలీన చేసినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థలోనే అత్యంత ప్రధానమైన, విధాన నిర్ణయమిదేనని ఆర్థిక విశ్లేషకులు భావించేవారు.

చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఇన్ని బ్యాంకులను విలీన చేయడం ద్వారా ఎలాంటి పరిణామాలుండబోతున్నాయి? విలీన ఫలితాలెలా ఉంటాయి? తెలుగు ప్రజల సొంత బ్యాంకు ఇక కనుమరుగుకానుందా? బ్యాంకు ఖాతాదారులు పడే ఇబ్బందులకు ప్రభుత్వం ఇచ్చే భరోసా ఏంటి? రెండు వేరు వేరు బ్యాంకుల విధివిధానాలను ఆయా బ్యాంకు ఉద్యోగులు ఎలా అధిగమిస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానాలను తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!

Tags: Andhrabank, Bank Merger, PSU Bank Merger, Merger Of PSB Banks, Public Sector Banks, Merger Of Union Bank With Andhra Bank



Next Story

Most Viewed