'భారత్‌లో అధిక పన్నులే లగ్జరీ కార్ల వృద్ధికి ఆటంకం'

by  |
భారత్‌లో అధిక పన్నులే లగ్జరీ కార్ల వృద్ధికి ఆటంకం
X

దిశ, వెబ్‌డెస్క్: అధిక పన్ను వల్ల భారత్‌లో లగ్జరీ కార్ల విభాగం వృద్ధి సన్నగిల్లుతోందని, దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం సుంకాలను తగ్గించాలని దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా వెల్లడించింది. ఒక ఏడాదిలో లగ్జరీ కార్ల అమ్మకాలు మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో 2 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. గత దశాబ్దం కాలంగా ఈ ధోరణి ఇలాగే ఉందని కంపెనీ అభిప్రాయపడింది. ‘దేశంలో లగ్జరీ వాహనాల విభాగం వృద్ధి లేకపోవడంతో ఇక్కడ తమ సామర్థ్యాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోతున్నాం.

భారీ పన్నుల వల్ల ఈ విభాగం కొన్నేళ్లుగా నెమ్మదిస్తోంది. ‘లగ్జరీ వాహనాలపై సుంకాలను తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 28 శాతం జీఎస్టీ కాకుండా దీనిపైన సెస్ కూడా ఉంటుంది. అంతేకాకుండా కొన్ని రాష్ట్రల్లో అధిక రిజిస్ట్రేషన్ ధర, పెరుగుతున్న ఇంధన ధరలు కూడా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి సెస్‌ను తొలగించగలిగి, రిజిస్ట్రేషన్ ఖర్చులను దేశవ్యాప్తంగా ఒకే విధంగా నిర్ణయించగలిగితే దేశీయ లగ్జరీ కార్ల విభాగానికి సహాయంగా ఉంటుందని’ ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ థిల్లాన్ అన్నారు. లగ్జరీ వాహనాలు ప్రస్తుతం సెడాన్‌లపై 20 శాతం, ఎస్‌యూవీలపై 22 శాతం అదనపు సెస్‌తో పాటు అదనంగా 28 శాతం జీఎస్టీతో మొత్తం పన్నులు 50 శాతానికి చేరుకున్నాయి. వినియోగదారులకు లగ్జరీ కార్ల ధరల గురించి అవగాహన ఉంది. ఇతర దేశాలతో వారు సరిపోల్చగలరు. ఈ వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం జోక్యం అవసరమని ఆయన వివరించారు. కాగా, ఆడి ఇండియా దేశీయ మార్కెట్లో మొత్తం ఎనిమిది మోడళ్లను విక్రయిస్తోంది. తాజాగా ఈ ఏడాది నవంబర్‌లో తన కొత్త క్యూ5 ఎస్‌యూవీని విడుదల చేయనున్నట్టు వెల్లడించింది.


Next Story

Most Viewed