నడకతోనే దీర్ఘాయుష్షు.. లాన్సెట్ అధ్యయనం వెల్లడి

by Yella Dhawani Reddy |

నేటి ఆధునిక జీవన శైలిలో మనిషి శారీరక శ్రమకు సమయం ఇవ్వటం లేదు. ఫలితంగా చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.

నడకతోనే దీర్ఘాయుష్షు.. లాన్సెట్ అధ్యయనం వెల్లడి
X

దిశ, వెబ్ డెస్క్: నేటి ఆధునిక జీవన శైలిలో మనిషి శారీరక శ్రమకు సమయం ఇవ్వటం లేదు. ఫలితంగా చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పెద్ద పెద్ద వ్యాయామాలు చేయకపోయినప్పటికీ, ప్రతి రోజు వాకింగ్ అనేది తప్పనిసరి చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. వాకింగ్ చేయడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. డైలీ వాకింగ్ చేయడం వల్ల ఏకాగ్రత అనేది పెరుగుతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. హార్ట్​ హెల్త్ బాగుంటుంది. రాత్రి చక్కగా నిద్రపడుతుంది. అలాగే ఆయుష్షు కూడా పెరుగుతుందని తాజాగా లాన్సెట్ అధ్యయనం (The Lancet Public Health ) స్పష్టం చేసింది.

రోజుకు 7,000 అడుగులు నడవడం వల్ల ఆయుర్దాయం గణనీయంగా పెరుగుతుందని ఈ అధ్యయనం పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 1.6 లక్షల మందిపై నిర్వహించిన 57 అధ్యయనాల విశ్లేషణలో ఈ విషయాన్ని వెల్లడించారు. సాధారణంగా రోజుకు కనీసం 2 వేల అడుగులు వేసే వ్యక్తులతో పోలిస్తే, రోజుకు 7 వేల అడుగులు వేసే వారిలో మరణముప్పు 47 శాతం తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఈ అధ్యయనం ప్రకారం, రోజుకు 7,000 అడుగులు నడవడం వల్ల గుండె జబ్బుల రిస్క్ 25%, టైప్-2 డయాబెటిస్ రిస్క్ 14%, డిమెన్షియా రిస్క్ 38%, డిప్రెషన్ రిస్క్ 22%, క్యాన్సర్ రిస్క్ 6%, పడిపోయే రిస్క్ 28% తగ్గుతాయి. 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గలవారికి 6,000–8,000 అడుగులు, 60 ఏళ్లలోపు వారికి 8,000–10,000 అడుగులు నడవడం మంచిది.

ఇక ఫిట్‌నెస్ ట్రాకర్లు లేదా స్మార్ట్‌ఫోన్ యాప్‌ల ద్వారా అడుగులను ట్రాక్ చేసుకోవచ్చు. ఇది ఆరోగ్య అవగాహనను పెంచే సరళమైన మార్గం. పబ్లిక్ హెల్త్ మార్గదర్శకాలలో అడుగుల ఆధారిత లక్ష్యాలను చేర్చాలని పరిశోధకులు సూచిస్తున్నారు. అలాగే సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి ఇతర శారీరక శ్రమలను కూడా ప్రోత్సహించాలని వారు నొక్కి చెప్పారు.

Next Story