మీలో ఈ లక్షణాలుంటే విటమిన్ D లోపం ఉన్నట్లే.. జాగ్రత్త సుమా!

by D.Reddy |
మీలో ఈ లక్షణాలుంటే విటమిన్ D లోపం ఉన్నట్లే.. జాగ్రత్త సుమా!
X

దిశ, వెబ్ డెస్క్: మనం ఆరోగ్యంగా ఉండటంలో శరీరానికి రకరకాల పోషకాలు, విటమిన్లు, ప్రోటీన్లు ఎంతగానో ఉపయోగపడుతాయి. ముఖ్యంగా ఎముకలు దృఢంగా ఉండేందుకు, రోగ నిరోధక శక్తి పెంచేందుకు విటమిన్ D కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ప్రస్తుత రోజుల్లో చాలా మంది విటమిన్ D లోపం బారిన పడుతున్నారు. దీంతో అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. సాధారణంగా సూర్య ర‌శ్మి త‌గిలేట్లు శ‌రీరాన్ని ఎండ‌లో ఉంచితే అప్పుడు మ‌న శ‌రీరం చ‌ర్మం కింద విట‌మిన్ Dని త‌యారు చేసుకుంటుంది.

విటమిన్ D లోపిస్తే లక్షణాలు..

శ‌రీరంలో విట‌మిన్ D స్థాయిలు 20ng/mL క‌న్నా త‌క్కువ‌గా ఉంటే విటమిన్ D లోపం ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇక మ‌నం తినే ఆహారాల్లో ఉండే క్యాల్షియం మ‌న శ‌రీరానికి కావాలంటే అందుకు విట‌మిన్ D ఎంత‌గానో అవ‌స‌రం అవుతుంది. మ‌నం తినే ఆహారంలో ఉండే క్యాల్షియం, ఫాస్పరస్‌ను శ‌రీరం శోషించుకుంటుంది. విట‌మిన్ D త‌గినంత‌గా లేక‌పోతే శ‌రీరం క్యాల్షియంను శోషించుకోదు. ఫ‌లితంగా ఎముక‌లు బ‌ల‌హీనంగా మారుతాయి. ఇక విటమిన్ D లోపం ఉంటే.. చిన్న ప‌నిచేసినా తీవ్రమైన అలసట, నీరసంగా అనిపిస్తుంది. ఎముక‌లు నొప్పిగా ఉంటాయి. కండ‌రాలు బ‌ల‌హీనంగా మారి చేతులు, తొడ‌ల్లో నొప్పిగా ఉంటాయి. జుట్టు రాలిపోతుంది. చ‌ర్మం రంగు పాలిపోయిన‌ట్లు తెల్లగా అవుతుంది. కొంద‌రికి నిద్రలేమి స‌మ‌స్య వ‌స్తుంది. పాదాలు, అర‌చేతుల్లో సూదుల‌తో గుచ్చిన‌ట్లు అనిపిస్తుంది.

విట‌మిన్ D లోపిస్తే ఏమ‌వుతుంది..

విట‌మిన్ D లోపాన్ని పరిష్కరించకుండా ఎక్కువ కాలం పాటు అలాగే ఉంచితే ప‌లు అనారోగ్య స‌మస్యలు వ‌స్తాయి. ముఖ్యంగా ఎముక‌ల‌కు సంబంధించిన వ్యాధులు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఆస్టియోపోరోసిస్‌, ఆర్థరైటిస్ వంటి వ్యాధులు వ‌స్తాయి. అలాగే గుండె జ‌బ్బులు, టైప్ 2 డ‌యాబెటిస్‌, రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గిపోవ‌డం వంటి స‌మస్యలు వ‌స్తాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలు మీలో కనిపిస్తే వెంట‌నే వైద్యులను సంప్రదించండి.

ఇక విటమిన్ D కేవలం సూర్యరశ్మి నుంచే కాదు.. చేప‌లు, కోడిగుడ్డు ప‌చ్చ సొన‌, లివ‌ర్‌, నారింజ పండ్లు, కాడ్ లివ‌ర్ ఆయిల్‌, చియా సీడ్స్‌, నువ్వులు, చీజ్ వంటి ఆహారాల ద్వారా కూడా ల‌భిస్తుంది. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే విట‌మిన్ D లోపం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Advertisement

Next Story

Most Viewed