యువతలో పెరుగుతున్న గుండెపోట్లు.. వైద్య నిపుణులు ఏమంటున్నారంటే?

by Disha Web Desk 2 |
యువతలో పెరుగుతున్న గుండెపోట్లు.. వైద్య నిపుణులు ఏమంటున్నారంటే?
X

ప్రస్తుతం ఏ నోట విన్నా హార్ట్ స్ట్రోక్​ ముచ్చటే. నిలబడినోళ్లు నిలబడినట్లు మృతి చెందడం అందరినీ ఆందోళన కలిగిస్తుస్తున్నది. నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలిపోవడం ప్రజలను పరేషాన్​చేస్తున్నది. పైగా గతానికి భిన్నంగా ఇప్పుడు యంగ్​స్టర్లలోనే ఎక్కువ హార్ట్​స్ట్రోకులు పెరగడం కలవరం సృష్టిస్తోన్నది. గత పదిహేను రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటు సంఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సంఘటనలపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా విశ్లేషిస్తున్నారు. కొందరు వ్యాక్సిన్లే కారణమని, మరి కొందరు కొవిడ్‌తోనే ఇలా అవుతున్నదని, ఇంకొందరు కరోనా సమయంలో వాడిన మందుల వల్ల కలుగుతున్న రియాక్షన్ అని రకరకాలుగా పేర్కొంటున్నారు. మీడియా, సోషల్​మీడియాలోనూ గుండెపోట్ల హడావిడి ఎక్కువగా ఉన్నది. వీటిని ఫాలో అవుతున్న ప్రజలు మరింత టెన్షన్ పడుతున్నారు. ఈ క్రమంలో అసలు గుండెపోట్లు గతంలో లేవా? ఇప్పుడే ఎందుకు ఎక్కువగా కనిపిస్తున్నాయి? కారణాలు ఏమిటి? యువతోనే ఇలా ఎందుకు జరుగుతున్నది? వైద్య నిపుణుల సూచనలతో దిశ స్పెషల్​ స్టోరీ...

దిశ, తెలంగాణ బ్యూరో: గతంలో హార్ట్​ఎటాక్‌లు 45 ఏళ్ల వయసున్న వాళ్లలో ఎక్కువగా చూసే వాళ్లం. కానీ కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. వయస్సుతో సంబంధం లేకుండా హార్ట్ స్ట్రోక్​లు వస్తున్నాయి. దీనికి మారిన లైఫ్​స్టైల్ తో పాటు కొవిడ్​ చేసిన గాయం అనవాళ్లు కూడా కారణమవుతున్నాయని డాక్టర్లు పేర్కొంటున్నారు. కొవిడ్ సోకిన తర్వాత అన్ని రక్తనాళాల్లో ఇన్​ఫెక్షన్​వస్తుంది. తగ్గిన తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకొకపోతే రక్తం లో బ్లాక్స్​ ఏర్పడే ప్రమాదం ఉన్నదని డాక్టర్లు పేర్కొంటున్నారు. ఈ క్లాట్స్​ప్రధాన దమనుల్లోకి వచ్చినప్పుడు గుండెకు తగినంతగా పోషకాలు, ఆక్సిజన్​అందడం లేదు. దీంతోనే సడన్​ హార్ట్​ స్ట్రోక్​లు సంభవిస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు. వైరల్ ఇన్​ఫెక్షన్లు వచ్చినప్పుడు సహజంగానే ర్తకం ​గడ్డ కట్టే తత్వానికి మారిపోతుంది. జలుబుతోనూ ఇది వస్తుంది. అయితే కరోనాతో రక్తం మూడు రెట్లు అధికంగా గడ్డగట్టే రూపానికి మారుతుందని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. ఇలా గరిష్ఠంగా ఆరు నెలల లోపు మాత్రమే సంభవించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అలాంటి పరిస్థితులు ఉండవని వారు ఖరాకండీగా పేర్కొంటున్నారు.

యువతో సడన్​గా ఎందుకు జరుగుతుంది..?

మూడు పదుల లోపు వయస్సున్న వారిలో సడన్​హార్ట్​స్ట్రోక్​లు రావడానికి ప్రత్యేక కారణం ఉన్నదని డాక్టర్లు చెప్తున్నారు. యంగ్​స్టర్లలో రక్త నాళాలు చాలా ఫ్రీగా ఉండి, బ్లడ్ ​ఫ్లో స్పీడ్​గా జరుగుతుంది. ఇలాంటి సమయంలో బ్లాక్స్​ ఏర్పడితే గుండెకు ఆక్సిజన్​ అందడం ఒక్కసారిగా ఆగిపోతుంది. దీంతోనే సడన్​గా కుప్పకూలిపోతున్నారు. ఇలాంటి వ్యక్తులకు కేవలం మూడు నిమిషాల్లో సీపీఆర్​తో పాటు షాక్​ ఇవ్వగలితేనే ప్రాణాలు దక్కే అవకాశం ఉంటుంది. ఇక పెద్ద వాళ్లలో రక్తనాళాల్లో బ్లడ్​ ఫ్లో కాస్త నెమ్మదిగా ఉంటుంది. ఈ సమయంలో బ్లాక్​ ఏర్పడినా మెల్లగా క్లోజ్​అవుతుంది. ఈ సమయంలో వారికి ఛాతీలో నొప్పి, దవడ గుంజడం, భుజాలు లాగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అప్రమత్తమై ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందే అవకాశం ఉంటుంది. కానీ కొద్ది శాతం మంది యువతలో మాత్రం ఆ అవకాశం లభించడం లేదు.

క్లాట్స్​ఎందుకు ఏర్పడుతున్నాయి..?

హెవీ స్మోకింగ్, అల్కహాల్​ఎక్కువగా తీసుకోవడం, జన్యుపరమైన సమస్యలు ఉండటంతో పాటు ఈ మధ్య కాలంలో మెట్రో పాలిటన్​ సిటీల్లో డ్రగ్స్​ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇవి క్లాట్స్​ ఏర్పడటానికి ముఖ్యమైన కారణాలుగా డాక్టర్లు చెబుతున్నారు. శరీరంలోని కొవ్వు, కాల్షియంలు బ్లాక్​లకు కారణమవుతున్నాయి. అందుకే కొలెస్ట్రాల్​ తక్కువగా ఉన్న పుడ్​ తింటే బెటర్​ అని డాక్టర్లు పేర్కొంటున్నారు. ఎల్​డీఎల్​115 కంటే తక్కువగా ఉండాలి. దీని కోసం ప్రతి రోజు 30 నిమిషాలు వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అయితే యువత చనిపోతున్నదని? అనేది మాత్రమే హైలైట్​ అవుతున్నది? కానీ, అందుకు గల కారణాలను అన్వేషించడానికి డాక్టర్లతో పాటు ప్రభుత్వం కూడా ప్రయత్నించడం లేదనేది నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుండె పోటు వచ్చినోళ్లనూ పోస్టు మార్టం చేస్తే స్పష్టమైన ఆధారం లభించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ఇక వ్యాక్సిన్ల వలన క్లాట్​ఏర్పడుతుందనడం లో సైంటిఫిక్ ​ఫ్రూఫ్ ​ఇప్పటి వరకు లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధ్యయనాల ప్రకారం వ్యాక్సిన్లు, కొవిడ్ ప్రభావంతో కేవలం ఆరు వారాల నుంచి మూడు నెలల్లోపు మాత్రమే హార్ట్​ స్ట్రోక్​లు వచ్చే ఛాన్స్​ ఉన్నదని, ఆ తర్వాత వస్తే వ్యాక్సిన్లను బ్లేమ్​ చేయలేమని వైద్యులు వివరిస్తున్నారు. మరోవైపు పుట్టిన ఏడాది నుంచి ప్రతి వ్యక్తిలో కొంత మేర రక్తనాళాల్లో బ్లాకేజ్‌ ఉండటం సహజం. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవన శైలి ఫలితంగా ఈ బ్లాకేజ్‌ ఒక్కసారిగా తీవ్రం అవుతుంది.

నిత్యం పరీక్షలు చేయించుకోవాలి.

గుండె రక్తనాళాలు చాలా చిన్నగా ఉంటాయి. అందుకే బ్లాక్​ ఏర్పడగానే హార్ట్​కు ఆక్సిజన్ ​అందడంలో సమస్య వస్తున్నది. డయాబెటిస్​, బీపీ తో పాటు స్మోకింగ్​ ఇతర వ్యసనాలు ఉన్నవాళ్లు ప్రతి ఆరు నెలలకు ఓసారి పరీక్షలు చేయించుకోవడం మేలు. దీంతో పాటు ఎలాంటి సమస్యలు లేకపోయినా 20 ఏళ్ల తర్వాత ఒకసారి, 30 ఏళ్ల తర్వాత మరోసారి, 30 నుంచి 40 ఏళ్ల మధ్యలో హార్ట్​ పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. ఇక 40 ఏళ్లు తర్వాత ప్రతి 5 ఏళ్లకు ఓ సారి గుండె పరీక్షలుచేయించుకోవడం ఉత్తమమని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. ఇతర దేశాల్లో ప్రస్తుతం ఈ విధానం నడుస్తుందని పేర్కొంటున్నారు. హార్ట్​స్పీడ్​గా కొట్టుకోవడం, ఛాతీలో బరువు, దవడ లాగడం వంటివి రాగానే డాక్టర్లను సంప్రదిస్తే 2డీ ఎకో, ఈసీజీ వంటి ప్రాథమిక పరీక్షలు చేస్తారు. అవసరమైనవాళ్లకు యాంజీయోగ్రామ్​చేసి గుండెలోని రక్తనాళాలను గుర్తిస్తారు. బ్లాక్​ శాతాన్ని బట్టి స్టంట్లు, పూర్తిగా బ్లాక్​అయితే ఓపెన్​హార్ట్ సర్జరీలు చేస్తామని వైద్యులు పేర్కొంటున్నారు.

ఇటీవల జరిగిన ఘటనలు..

కొద్ది రోజుల క్రితం సికింద్రాబాద్ లో ఓ కానిస్టేబుల్ జిమ్ చేస్తూ సడెన్ గా కుప్పకూలిపోయాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అతడి వయస్సు 25 ఏళ్ల లోపే ఉంది. మరో చోట ఓ వ్యక్తి హల్దీ ఫంక్షన్ కు హాజరయ్యాడు. పెళ్లి కొడుకుకు పసుపు రాస్తుండగానే హార్ట్​స్ట్రోక్​ కు గురై మృతి చెందాడు. హైదరాబాద్ లాలాపేటలో ఓ వ్యక్తి షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. హైదరాబాద్‌లోని సీఎంఆర్​ ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి కారిడార్లో నడుస్తూ గుండెపోటుకు గురై మరణించాడు. ఈ ఘటనలన్నీ మీడియా, సోషల్​మీడియాల్లో ప్రచారం జరుగుతుండటంతో అందరిలోనూ హార్ట్​ స్ట్రోక్​ టెన్షన్​ మొదలైంది.

విడో మేకర్ హార్ట్ స్ట్రోక్‌

ప్రస్తుతం యువతకు వచ్చే గుండె పోటును కొందరు వైద్యులు విడో మేకర్ హార్ట్ స్ట్రోక్‌గా అంచానా వేస్తున్నారు. ఆహార అలవాట్ల కారణంగానే ఈ రకమైన గుండె పోటు అధికంగా వస్తుందని పేర్కొంటున్నారు. ఆరోగ్యకరమైన కూరగాయల కంటే ఫాస్ట్ ఫుడ్స్, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల శారీరక ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాలను కలిగిస్తుందంటున్నారు. దీని వలనే విడోమేకర్ గుండెపోటు వస్తుందంటున్నారు. అదే సమయంలో ఫ్యామిలీ కి హార్ట్​ స్ట్రోక్ ​హిస్టరీ, హెవీ స్మోకర్స్, ఆల్కాహాలిక్​, జంక్​పుడ్​ ఎక్కువగా తీసుకునేవాళ్లు ఆస్ప్రిన్​ను జేబులో పెట్టుకోవడం కాస్త సేఫ్​గా భావించవచ్చు.

ప్రధాన కారణాలు..

ధూమపానం

ఫ్యామిలీ హిస్టరీ

చెడు కొలెస్ట్రాల్​

ఆహార అలవాట్లు

శారీరక శ్రమ లేకపోవడం

డీప్‌ ఫ్రై చేసిన పదార్థాలు

బేకరీ ఐటమ్స్‌

ప్రాసెస్డ్‌ ఫుడ్‌

ఆర్థిక, కుటుంబ సమస్యలు

పని ఒత్తిడితో మానసిక ఆందోళన

ఏం చేస్తే మేలు?

స్మోకింగ్, ఆల్కహాల్​మానేయాలి

30 నిమిషాల వ్యాయామం తప్పనిసరి

తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి

తీపి, ఉప్పు, నెయ్యి తగ్గించాలి

బీఫ్‌, పోర్క్‌, మటన్‌ లాంటి మీట్‌ను తగ్గిస్తే మేలు

ప్రాసెస్డ్‌, ప్యాకేజ్‌ ఫుడ్స్‌‌కు దూరంగా ఉండాలి

అధిక బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

బీపీ, షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవాలి

ప్రతి ఆరు నెలలకోసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలి

ఆకస్మిక, ఎక్కువ సమయం వ్యాయామం చేయకూడదు

యోగ, ధ్యానం వంటివి చేయాలి.

ఛాతిలో నొప్పి, మంట, భుజాలు లాగడం వంటి లక్షణాలు కనిపించగానే డాక్టర్‌ను సంప్రదించాలి.

ప్రభుత్వం ఏం చేయాలి....?

రాష్ట్రంలో ప్రతి ఏటా 24 వేల మంది హార్ట్​స్ట్రోక్​లతో చనిపోతున్నట్లు అంచనా. కరోనా తర్వాత వీటి సంఖ్య మరో 15 శాతం పెరిగిందని డాక్టర్లు చెబుతున్నారు. గత పది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో సుమారు పది మందికి పైనే యువత హార్ట్​స్ట్రోక్​తో సంభవించినట్లు వైద్యశాఖ చెబుతున్నది. అయితే గతంలో ఎన్నడూ లేనట్టుగా యువతలోనే హార్ట్​స్ట్రోక్​లు ఎందుకు సంభవిస్తున్నాయనేది? కారణాలను అన్వేషించడం లేదు. ప్రస్తుతం నిబంధనల ప్రకారం ఎంఎల్​సీ, అనుమానిత కేసుల్లో మాత్రమే పోస్టు మార్టం చేస్తున్నారు. హార్ట్​స్ట్రోక్​మరణాలు పెరుగుతున్నందున రిసెర్చ్, కేస్​ స్టడీ​ కోసం పోస్టు మార్టం చేయాల్సి అవసరం ఉన్నది. చనిపొతున్న వారి హిస్టరీ వివరాలపై అధ్యయనం చేయాలి. ఇక మన దేశంలో సడన్​కార్డియాక్​అరెస్ట్​ లో ప్రతి మూడులో రెండుమరణాలు చోటుచేసుకుంటున్నాయి. కానీ ప్రభుత్వాలు వీటి నియంత్రణ, నివారణ, చికిత్సకు కేవలం 2 శాతం మాత్రమే బడ్జెట్​ ను పెడుతున్నాయి. వీటిని పెంచాల్సిన అవసరం ఉన్నది. సడన్​కార్డియాక్​అరెస్ట్​ కొరకు వనరులు, మ్యాన్​పవర్​ను పెంచడమే కాకుండా ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేయాలి. అంతేగాక సొసైటీ, సంస్థలు, ప్రజలందరికీ సీపీఆర్​పై అవగాహన కల్పించేలా భారీ స్థాయిలో కార్యక్రమాలు చేయాలి. ప్రభుత్వ, ప్రైవేట్​ కార్యాలయాలు, కంపెనీలు, మార్కెట్లు, బస్​స్టేషన్లు, హోటళ్లు, సినిమా హాళ్లు, జన రద్దీ ప్రాంతాల్లో గుండెకు కరెంట్​ షాక్​ను ఇచ్చే పరికరాలను (ఆటోమెటిక్​ ఎక్స్​టర్నల్​డెఫిబ్రిటేర్స్​) అందుబాటులో ఉంచి నైపుణ్యం కలిగిన స్టాఫ్​ను ఏర్పాటు చేయాలి.


Next Story

Most Viewed