తెలివైన దొంగలు.. గుంజపడుగు SBI బ్యాంక్‌లో చోరీ..!

by  |
తెలివైన దొంగలు.. గుంజపడుగు SBI బ్యాంక్‌లో చోరీ..!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ కార్యాలయంలో చోరీ జరిగింది. పకడ్భందీ ప్లాన్ ప్రకారం దొంగలు బ్యాంక్‌లోకి చొరబడి లాకర్ అలారం కనెక్షన్‌ను కట్ చేశారు. అనంతరం లాకర్ ఓపెన్ చేసి అందులోని నగదు, బంగారం పెద్ద ఎత్తున దోచుకెళ్లారు. బ్యాంక్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు పోలీసులకు దొరకకుండా డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్) కూడా ఎత్తుకెళ్లారు. అయితే బ్యాంకలో ఎంతమేర చోరీ జరిగిందో అంచనా వేస్తున్నారు అధికారులు. పెద్దపల్లి డీసీపీ రవిందర్, గోదావరిఖని ఏసీపీ ఉమేంద‌ర్‌లు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. డాగ్ స్వ్కాడ్ టీంలను కూడా రంగంలోకి దింపారు.

గ్యాస్ కట్టర్‌తో లాకర్ తెరిచి..

సినిమా ఫక్కీలో దొంగలు గుంజపడుగులోని SBI బ్యాంకులో చోరీకి పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్‌తో లాకర్‌ను తెరువగా.. కనీసం రెండు గంటలకు పైగా దొంగలు బ్యాంకులోనే ఉన్నారని తెలుస్తోంది. చోరీ కోసం ముందుగానే రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యాంకులో లాకర్ అలారం కనెక్షన్‌ను కూడా కట్ చేయడం, డీవీఆర్ బాక్సును కూడా ఎత్తుకెళ్లడంతో అగంతకులు ముందుగా బ్యాంకు పరిసరాలను పరిశీలించే ప్లాన్ వేసినట్లు స్పష్టం అవుతోంది.

దొంగలేనా..?

గుంజపడుగు ఎస్‌బీఐలో జరిగిన చోరీ పలు అనుమానాలకు తావిస్తోంది. దొంగతనాలు చేస్తూ జీవనం సాగించే వారు బ్యాంకులోకి చొరబడితే నగదు, బంగారం ఎత్తుకెళ్లిన ఘటనలు ఉన్నాయి, కానీ టెక్నాలజీపై పెద్దగా దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. సీసీ కెమెరాలు ఉన్నాయని గమనిస్తే ముఖాలు కన్పించకుండా మాస్కులు వేసుకుని చోరీలకు పాల్పడ్డారు. కానీ గుంజపడుగ బ్యాంకులో మాత్రం సీసీ కెమెరాల్లో రికార్డయ్యే వీడియోలను ఆధారం చేసుకుని పోలీసులు పట్టుకుంటారన్న అనుమానంతో ఏకంగా డిజిటల్ వీడియో రికార్డర్‌లను ఎత్తుకెళ్లలేదు. 2013లో కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎస్‌బీఐలో చోరీ జరిగినప్పుడు డీవీఆర్ బాక్స్ అనుకుని సిస్టం యూపీఎస్‌ను ఎత్తుకెళ్లారు. ఆ దుండగులు ఎవరనే కోణంలో ఆరా తీస్తుండగా చొప్పదండి బ్యాంకులో ఎత్తుకెళ్లిన నగదుకు సంబంధించిన లేబుళ్లు పశ్చిమ బెంగాల్‌లోని బురద్వాన్ వద్ద పేలుడు సంభవించిన చోట లభ్యయ్యాయి. అప్పుడు చొప్పదండి బ్యాంకులో చోరీకి పాల్పడింది ఉగ్రవాదులని గుర్తించారు. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్‌లో చొప్పదండి బ్యాంకు ఘటనలో నిందితుడు ఒకరు చనిపోయారు. సాంకేతికంగా ఎలాంటి ఆధారాలు లభ్యం కాకుండా ఉండేందుకు ఉగ్రవాదులు డీవీఆర్ బాక్స్ అనుకుని యూపీఎస్‌ను తీసుకెళ్లారని కూడా ఎన్ఐఏ విచారణలో తేలింది. ఇప్పుడు కూడా గుంజపడుగు బ్యాంకులో దొంగతనం జరిగిన తరువాత డీవీఆర్ బాక్స్‌ను ఎత్తుకెళ్లడంతో ఈ ఘటనకు పాల్పడింది దొంగలేనా లేక ఉగ్రవాదులా అన్న కోణంలో ఆరా తీయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ చోరీలకు పాల్పడే ముఠాలే అయితే మాత్రం టెక్నాలజీపై పట్టు సాధించిన వ్యక్తి సహకారం తీసుకోవడమో లేక ఈ ముఠాతో కలిసి నేరాలకు పాల్పడుతుండటమో జరిగి ఉంటుందని స్పష్టమవుతోంది.

Next Story

Most Viewed