డీఎంహెచ్ఓ సస్పెన్షన్​

by Sridhar Babu |
డీఎంహెచ్ఓ సస్పెన్షన్​
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా వైద్యాధికారిపై ఎట్టకేలకు ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. డీఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు ఉత్తర్వులు జారీ చేశారు. గత 15 రోజుల క్రితం జిల్లాలోని పీహెచ్సీలలో పని చేస్తున్న మహిళా మెడికల్ ఆఫీసర్లు తమపై డీఎంహెచ్ఓ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని రాష్ట్ర అధికారులతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో లైంగిక వేధింపుల కేసు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. దాంతో అడిషనల్ డీహెచ్ అమర్ సింగ్ నాయక్ ను ఈ నెల 15 న విచారణ నిమిత్తం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కామారెడ్డికి పంపారు.

విచారణలో లైంగిక ఆరోపణలు నిజమేనని తేలడంతో పాటు వైద్యాధికారిగా నిబంధనలు పాటించడంలో విఫలమయ్యారని తేలింది. విచారణ అనంతరం వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ పై దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో 7 కేసులు నమోదు చేశారు పోలీసులు. 15వ తేదీ సాయంత్రమే పోలీసులు లక్ష్మణ్ సింగ్ ను అదుపులోకి తీసుకుని 24 గంటల పాటు విచారించారు. 16 వ తేదీన సాయంత్రం కోర్టులో హాజరు పరచగా షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ తమ నివేదికలో పేర్కొన్నట్టుగా తెలిసింది. విచారణ అధికారి, కలెక్టర్, ఎస్పీల నివేదికలతో డీఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ ను సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. లక్ష్మణ్ సింగ్ తన సొంత హెడ్ క్వార్టర్ మెదక్ విడిచి వెళ్లరాదని, సస్పెన్షన్ సమయంలో సగం వేతనం చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అవినీతి అక్రమాలపై చర్యలుంటాయా..?

డీఎంహెచ్ఓపై ఇటీవల ఆలస్యంగా వెలుగు చూసిన లైంగిక ఆరోపణలపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ అనంతరం సస్పెండ్ చేయడం వరకు బాగానే ఉన్నా ఇన్నాళ్లుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన అవినీతి అక్రమాల సంగతేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో వైద్యాధికారిపై అవినీతి అక్రమాల ఆరోపణలు కోకొల్లలుగా వచ్చాయి. జిల్లాలో కొత్తగా చేపట్టిన పోస్టింగులలో డబ్బులు తీసుకోవడంతో పాటు అక్రమ డిప్యూటేషన్లపై కొందరు ఆధారాలతో సహా జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు చేసినా,

ఆధారాలు సమర్పించినా ఇప్పటివరకు వైద్యాధికారిపై చర్యలు తీసుకోపోవడంపై అనేక అనుమానాలు వెల్లువెత్తాయి. శాఖలో ఒక టీం ను తయారు చేసుకుని వసూళ్లకు పాల్పడ్డారన్న ప్రచారం సాగింది. అయినా అధికారిపై చర్యలకు అధికారులు వెనుకంజ వేశారు. ప్రస్తుతం లైంగిక ఆరోపణలపై సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటారా లేక ఆయన హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి వాటిపై కూడా చర్యలు తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed