దిశ ఎఫెక్ట్.. 15% నిధుల అవినీతి నిజ‌మే..!?

by  |
దిశ ఎఫెక్ట్.. 15% నిధుల అవినీతి నిజ‌మే..!?
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్: మ‌హ‌బూబాబాద్ జిల్లా గూడూరు అటవీశాఖ రేంజ్ అధికారి అక్ర‌మాల‌పై దిశ వ‌రుస‌గా ప్ర‌చురిస్తున్న క‌థ‌నాల‌తో ఆ శాఖ ఉన్న‌తాధికారులు క‌దిలారు. విచార‌ణ చేప‌డుతూనే అదే స‌మ‌యంలో స‌ర్దుబాటు య‌త్నాలు కూడా సాగుతున్నాయి. అయితే మంజురైన‌ రూ.45 ల‌క్ష‌ల్లో 15 శాతం నిధుల‌ను ఎఫ్ఆర్వో గోల్‌మాల్‌కు య‌త్నించిన‌ట్లుగా బ్యాంకు లావాదేవీల సాక్షిగా బ‌య‌ట‌ప‌డినట్లు స‌మాచారం. అయితే చేతికి న‌గ‌దు ఇచ్చార‌ని సెక్ష‌న్ అధికారుల చేత చెప్పినా.. త‌నిఖీ అధికారులు వారిచ్చిన స‌మాధానంతో సంతృప్తి చెందలేద‌ని స‌మాచారం. ఎఫ్ఆర్వోపై శాఖ‌ప‌ర‌మైన చ‌ర్య‌లకు రంగం సిద్ధ‌మైన‌ట్లుగా తెలుస్తోంది. గురువారం అట‌వీశాఖ టాస్క్‌ఫోర్స్ రేంజ్ అధికారి బీవీవీఎస్‌కే ప్ర‌సాద్‌, మ‌హ‌బూబాబాద్ స్ట్రైకింగ్ ఫోర్స్ రేంజ్ అధికారి రాంమూర్తి ఆధ్వ‌ర్యంలో అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ నెల‌ 3న ఆధారాల‌తో స‌హా దిశ ప‌త్రిక‌లో కంపా కొల్లేరు శీర్షిక‌న క‌థ‌నం ప్ర‌చురిత‌మైంది. ఈనెల 5న రికార్డుల సర్దుబాటు శీర్షిక‌న మ‌రో క‌థ‌నం ప్ర‌చురించింది. దీంతో ఉన్న‌తాధికారుల ఆదేశాల‌తో అట‌వీశాఖ‌ టాస్క్‌ఫోర్స్ అధికారులు గూడూరు రేంజ్ కార్యాల‌యంలో గురువారం త‌నిఖీలు చేప‌ట్టారు. ఉద‌యం నుంచి సాయంత్రం పొద్దుపోయేంత వ‌ర‌కు గోప్యంగా త‌నిఖీలు, విచార‌ణ చేప‌ట్టారు. కార్యాల‌యం సిబ్బంది, ఎఫ్ ఆర్వో అమృత‌తో పాటు సెక్ష‌న్ అధికారుల‌ను ఒక్కోరిని విడివిడిగా విచారించారు. అనంత‌రం వివ‌రాల‌ను మీడియాకు వెల్ల‌డించేందుకు నిరాకరించారు. విచార‌ణ పూర్త‌య్యకే వివ‌రాల‌ను వెల్ల‌డిస్తామ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.

85 శాత‌మే చెల్లింపులు..

ఉద‌యం త‌నిఖీలు ఆరంభించిన అధికారుల బృందం ముందుగా ఇటీవ‌ల ప్ర‌భుత్వం నుంచి హారిత‌హారం కార్య‌క్ర‌మ అమ‌లుకు మంజూరైన నిధుల వివ‌రాల‌ రికార్డులను ప‌రిశీలించారు. సెక్ష‌న్ అధికారుల‌కు ఎఫ్ఆర్వో బ్యాంకు ఖాతా నుంచి సెక్ష‌న్ అధికారుల ఖాతాల‌కు బ‌దిలీ అయిన మొత్తాల‌ను ప‌రిశీలించారు. రేంజ్ ప‌రిధిలోని ఆరు సెక్ష‌న్ల‌లో హ‌రిత‌హారం కార్య‌క్ర‌మం అమ‌లుకు ప్ర‌భుత్వం ఇటీవ‌ల మంజూరు చేసిన రూ.45ల‌క్ష‌ల్లో ఆయా అధికారుల ఖాతాల‌కు 85శాతం నిధుల మాత్రమే జ‌మ అయిన‌ట్లుగా అధికారులు త‌నిఖీల్లో గుర్తించారు. ఎఫ్ఆర్వో ఖాతా నుంచి ఏయే ఖాతాల‌కు న‌గదు బ‌దిలీ జ‌రిగిన విషయాల‌పైనా ఆరా తీశారు. ఎఫ్ ఆర్వో, సెక్ష‌న్ అధికారుల బ్యాంకు ఖాతాల లావాదేవీల‌కు సంబంధించిన జిరాక్స్ కాపీల‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

సెక్ష‌న్ అధికారుల‌పై ఒత్తిడి.. చేతికిచ్చార‌ని జ‌వాబు

రెండు, మూడు రోజులుగా సెక్ష‌న్ అధికారుల‌పై జ‌రుగుతున్న ఒత్తిడి తారాస్థాయికి చేరిన‌ట్లుగా స‌మాచారం. ఉన్న‌తాధికారుల హెచ్చ‌రిక‌ల‌తో భ‌య‌ప‌డిన ఉద్యోగులు ఎఫ్ఆర్వో 15శాతం నిధుల‌ను చేతిగుండా అంద‌జేశార‌ని టాస్క్‌ఫోర్స్ అధికారుల‌కు వెల్ల‌డించిన‌ట్లు స‌మాచారం. ఈ స‌మాధానంతో అధికారులు సంతృప్తి చెంద‌న‌ట్లు స‌మాచారం. అయితే నిధుల మంజూరు, బ‌ద‌లాయింపు అంతా కూడా ఆన్‌లైన్‌లో జ‌ర‌గాల్సి ఉంటుంది. 15శాతం మొత్తం ఎందుకు చేతిగుండా ఇవ్వాల్సి వ‌చ్చిందనే విష‌యంపై ఎఫ్ఆర్వో నుంచి స‌మాధానం రాలేద‌ని తెలుస్తోంది. సెక్ష‌న్ అధికారుల నుంచి లిఖిత పూర్వ‌క ఈ విషయంపై స్ప‌ష్ట‌త తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. అయితే ఇటీవ‌ల జ‌రిగిన నిధుల విష‌యంలోనే కాకుండా గ‌తంలో రేంజ్ ప‌రిధిలో జ‌రిగిన అభివృద్ధి ప‌నుల‌కు సంబంధించిన లావాదేవీల‌పైనా టాస్క్‌ఫోర్స్ దృష్టి పెట్టిన‌ట్లుగా తెలుస్తోంది. చూడాలి ఏం జ‌రుగుతుందో..?!

Next Story

Most Viewed