పెట్రోల్ ధర రూ.100 చేస్తే ఓటేస్తాం

by  |
పెట్రోల్ ధర రూ.100 చేస్తే ఓటేస్తాం
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు, మద్దతుదారులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారంలో అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీలపై పట్టభద్రులు సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు తరఫున ప్రచారం చేసే నేతలకు విమర్శలు ఎదురవుతున్నాయి.

ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఓటర్లు విరుచుకుపడుతున్నారు. అధికార పార్టీకి ఓట్లు వేయాలంటే పదోన్నతులు, పీఆర్సీ, బదిలీలు చేయాలని నిర్మోహమాటంగానే కాంట్రాక్టు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఖాళీలైన ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు వేయకుండా నిరుద్యోగ జీవితాలతో ఆటలాడుతున్నారని మండిపడుతున్నారు.

ఇక బీజేపీపై కూడా ఇదే అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నారు. గతంలో శాసనమండలిలో పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్ధి నిరుద్యోగ యువత కోసం పోరాటం చేసింది ఏమీలేదని నిలదీస్తున్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్‌లతో సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని… ఆయిల్ ధరలు రూ.100 చేస్తే అప్పుడు బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేస్తామని ఎద్దేవా చేస్తున్నారు. ఈ విధంగా ఓటర్ల నుంచి ప్రతిస్పందన రావడంతో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు.

పోటీ పెరిగింది.. విమర్శలు కూడా..!

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలంటే ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు మాత్రమే ఓట్లువేస్తారనే భావన ఉండేది. క్రమ క్రమంగా పార్టీలు చోరవ పెరిగిపోవడంతో రాజకీయ రంగు పులుముకుంది. తెలంగాణ రాష్ట్రం ఉద్యమ కాలం నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అత్యధిక పోటీ నెలకొంది.

ఈసారి టీఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ.. ఇతర పార్టీలు సైతం దూకుడుగా వ్యవహరిస్తుండడంతో అధికార పార్టీ అభ్యర్థులు జంకుతున్నారు. దీనికితోడు ఉద్యోగ నోటిఫికేషన్లు, పీఆర్సీలపై ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ పరిణామాలతో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపుపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీటినే ఆసరాగా చేసుకుంటున్న బీజేపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేసినప్పటికీ.. తాజాగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు కూడా వారి ప్రచారానికి అడ్డుతగులుతున్నాయి. దీంతో గ్రాడ్యుయేట్ ఓటరు నాడి ఎటువైపు వీస్తుందో తెలియక సతమతమవుతున్నారు.

టీఆర్ఎస్-బీజేపీ పార్టీల వైఫల్యాలను బహిరంగంగానే చెబుతున్న ఓటర్లు ప్రశ్నించే గొంతుక కోసం వేతుకులాట ప్రారంభించారని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే కాంగ్రెస్, వామపక్షాలు, ఇండిపెండెంట్ అభ్యర్థుల్లో గట్టిగా వాదించే నాయకుడికి మద్దతు తెలిపేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ ఉత్కంఠకు తెరపడాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు వేచిచూడాల్సిందే అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed