సుంకాల పెంపు.. వినియోగదారులకు కత్తిరింపు

by  |
సుంకాల పెంపు.. వినియోగదారులకు కత్తిరింపు
X

రష్యా, సౌదీఅరేబియాల మధ్య చమురు పోరుతో అంతర్జాతీయ స్థాయిలో ఇంధన ధరలు భారీగా పతనమయ్యాయి. బ్యారెల్ ధర 32 డాలర్లకు దిగువకు పడిపోయింది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయ ఇంధన సంస్థలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాయి. లీటరుకు రూ. 2లకు పైగానే తగ్గింది. ధరలు తగ్గి రెండ్రోజులు అయిందో లేదో కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ రూపంలో దెబ్బకొట్టింది. అంతర్జాతీయ ముడి చమురు ధరల పతనానికి సంబంధించిన లాభం సామాన్యులకు చేరకుండా చేసింది. ఈ పెంపు కారణంగా కేంద్ర ప్రభుత్వానికి రూ. 39 వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుంది.

పెట్రోల్, డీజిల్‌పై స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ విధిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. లీటర్ పెట్రోల్ పై రూ. 2 నుంచి రూ. 8, డీజిల్‌పై రూ. 2 నుంచి రూ. 4 వరకు ఎక్సైజ్ డ్యూటీ పెంచింది. లీటర్, డీజిల్‌పై రోడ్డు ట్యాక్స్ రూ. 1 చొప్పున పెంచడంతో అది రూ. 10కి చేరుకుంది. స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ, రోడ్డు సెస్సు కలుపుకుని పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం రూ. 22.98లకు, డీజిల్‌పై రూ. 18.83లకు చేరుకుంది. 2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పెట్రోల్‌పై ట్యాక్స్ రూ. 9.48గా, డీజిల్‌పై రూ. 3.56గా ఉన్నాయి. అయితే, ప్రస్తుత పెంపు కారణంగా రిటైల్ ధరలు పెరిగే అవకాశం లేదని చమురు సంస్థలు పేర్కొంటున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు సుంకాలను సర్దుబాటు చేసే అవకాశం ఉంది.

రోజువారీ ప్రాతిపదికన పెట్రోల్, డీజిల్ ధరలు మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ స్థాయిలో చమురు ధల హెచ్చుతగ్గులను దృష్టిలో పెట్టుకొని కంపెనీలు లీటరుకు 13 నుంచి 16 పైసలు పెంచుతూ తగ్గిస్తూ ఉంటాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 69.87 కాగా, డీజిల్ ధర రూ. 62.58గా ఉంది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పుడు రిటైల్ ధరలు కూడా భారీగా తగ్గాల్సి ఉంది. కానీ, కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం పెంచుతూ పోతుండటంతో అది సాధ్యం కావడం లేదు.

2014 నవంబర్ నుంచి 2016 జనవరి వరకు తొమ్మిది సార్లు ఎక్సైజ్ సుంకాలను కేంద్ర ప్రభుత్వం పెంచిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ పెంపు కారణంగా 15 నెలల కాలంలో పెట్రోల్ ధర రూ. 11.77, డీజిల్ ధర రూ. 13.47లకు పెరిగాయి. ఎక్సైజ్ సుంకాలను పెంచకముందు 2014-15లో కేంద్ర ప్రభుత్వానికి రూ. 99,000 కోట్ల ఆదాయం చేకూరింది. కానీ, సుంకాల పెంపు తర్వాత 2016-17లో ఆదాయం రెట్టింపు అయి రూ. 2,42,000 కోట్లకు చేరుకుంది.
ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం ద్వారా 2019-20 ఆర్థిక సంవ్సతరం మొదటి క్వార్ట‌ర్‌లో వినియోగదారులకు లబ్ధి చేకూరింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆదాయం బాగా తగ్గింది. పెట్రోల్, డీజిల్‌పై సుంకాల పెంపు ద్వారా అంతర్జాతీయ చమురు ధరల పతనం కారణంగా వచ్చే లబ్ధిని కేంద్రం పొందాలనుకుంటోందని తెలుస్తోంది. ఈ కారణంగా వచ్చే అదనపు ఆదాయాన్ని అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన రంగాలపై ఖర్చు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

Tags: Government,Raises,Excise Duty,Petrol, Diesel ,Rs 3 Per Litre

Next Story

Most Viewed