జాబ్ బోర్ అంటూ కేసు.. నష్టపరిహారం ఇప్పించిన కోర్టు

by  |
జాబ్ బోర్ అంటూ కేసు.. నష్టపరిహారం ఇప్పించిన కోర్టు
X

దిశ, వెబ్ డెస్క్:
చేస్తున్న ఉద్యోగం బోర్ కొట్టడం చాలా కామనే. ఆ కారణంతో కొందరు ఉద్యోగం మానేస్తే.. మరికొందరేమో వేరే ఫీల్డ్‌లో మరో ఉద్యోగాన్ని వెతుక్కుంటారు. కానీ ఇదే రీజన్‌తో కోర్టుకెక్కినవారు ఉన్నారా? అందుకు పరిహారం చెల్లించాలంటూ బాస్‌పైన కేసు వేసిన వారిని చూశారా? అయితే.. పారిస్‌కు చెందిన ఫ్రెడ్రిక్‌ డెస్నార్డ్‌ అనే ఉద్యోగి గురించి తెలుసుకోవాల్సిందే.

కరోనా సంక్షోభంతో కొన్ని లక్షల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఈ పరిస్థితుల నడుమ ఎంతో మందికి ఉపాధి దొరక్క సతమతమవుతున్నారు. కానీ ఓ వ్యక్తి బోర్ కొడుతోందంటూ జాబ్ మానేయడంతోపాటు దానికి కారణం బాసేనంటూ అతనిపై కేసు వేయడం 2016లో సంచలనం సృష్టించింది. ఇంటర్‌పర్‌ఫ్యూమ్స్ కంపెనీలో 2010 నుంచి 2014 వరకు ‘జనరల్‌ సర్వీస్‌ డైరెక్టర్‌’ అనే హోదాలో పని చేసిన ఫ్రెడ్రిక్ డెస్నార్డ్ అనే వ్యక్తి, ఆ కంపెనీపై వేసిన కేసు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

అది వేధింపే :

ఉద్యోగం బోర్‌ కొట్టడం వల్ల ఫ్రెడ్రిక్ మానసికంగా ఆందోళనకు గురవడంతోపాటు అతడి ఆరోగ్యం కూడా పాడయ్యింది. ఈ నేపథ్యంలో ‘తాను నాలుగేళ్లపాటు చేసిన ఉద్యోగం బోర్‌ కొట్టిందని, అందుకు బాధ్యుడు తాను పని చేసిన ఇంటర్‌పర్వ్యూమ్‌ కంపెనీ బాసేనని, ఇన్నాళ్లూ తనతో అలాంటి ఉద్యోగం చేయించినందుకు కంపెనీ ఎండీ తనకు 3.6 లక్షల యూరోలు నష్టపరిహారంగా చెల్లించాలి’ అని 2016లో కోర్టుకెక్కాడు ఫ్రెడ్రిక్. తన డిజిగ్నేషన్‌కు తగ్గ పనులు చెప్పకుండా సొంత పనులకు తనను ఉపయోగించుకున్నారని కోర్టులో వివరించాడు. ఒకరోజు బాస్ పిలిచి ఇంటికి వెళ్లిపొమ్మన్నారని, ఫోన్‌ చేసి మళ్లీ పిలుస్తామన్నారని.. కానీ ఎప్పటికీ తనకు ఫోన్ రాకపోవడంతో కోర్టులో కేసు వేసినట్టు తెలిపాడు. ఇదిలా ఉంటే ‘బోర్‌ కొట్టే ఉద్యోగం చేయించడం కూడా వేధింపు కిందకే వస్తుందని, జీతం ఇస్తూ పని చేయించుకోకపోవడం ఆ వ్యక్తిని అవమానించడమేనని’ అతని తరుపు లాయర్‌ కోర్టులో వాదించారు.

గెలిచిన ఫ్రెడ్రిక్ :

నాలుగేళ్ల పాటు సాగిన ఈ కేసులో ఎట్టకేలకు ఫ్రెడ్రిక్ విజయం సాధించారు. బోర్ అవుట్ మోరల్ హరాస్‌మెంట్ కిందకు వస్తుందని, ఉద్యోగికి 3.6 లక్షల యూరోలు నష్టపరిహారం చెల్లించాలని పారిస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ తీర్పు వెల్లడించింది.

Next Story

Most Viewed