కరోనాను తలదన్నిన ఫ్రీలాన్స్ రంగం!

by  |
కరోనాను తలదన్నిన ఫ్రీలాన్స్ రంగం!
X

దిశ, వెబ్‌డెస్క్:

‘కరోనా కారణంగా అన్ని రంగాలు దెబ్బతిన్నాయి, అందరూ ఆర్థికంగా వెనకబడ్డారు’ అని రోజూ వార్తల్లో చూస్తున్నాం. కానీ ప్రతి నాణేనికి రెండు వైపులున్నట్లే.. కరోనా వల్ల నష్టపోయినవారితో పాటు లాభపడినవారు కూడా ఉన్నారు. నిజానికి ఈ సిచ్యువేషన్‌ను క్యాష్ చేసుకున్న వారిని కష్టాల్లో కూడా దారులు వెతుక్కోగల సమర్థులు అని అనాలేమో.. ఎందుకంటే సాధారణ రోజుల్లో వీరికి పెద్దగా పని దొరికేది కాదు. ఒకవేళ దొరికినా చాలా తక్కువ చెల్లించే ప్రాజెక్టులు దొరికేవి. కానీ కరోనా సమయంలో రెగ్యులర్ ఉద్యోగుల మీద ఎక్కువగా చెల్లించలేని వాళ్లందరూ వారిని తీసేసి, వారి స్థానంలో వీరిని పెట్టుకున్నాయి. దీంతో వీరికి డిమాండ్ పెరిగింది. వీరు.. వీరు.. అంటున్నాం గానీ వారెవరో చెప్పడం లేదు కదా.. వారే ఫ్రీలాన్స్ ఉద్యోగులు.

ఇంతకీ ఫ్రీలాన్స్ ఉద్యోగం అంటే ఏంటి?

నేర్చుకున్న నైపుణ్యాలన్నీ మనకు ఉద్యోగాన్ని సంపాదించి పెట్టి, పొట్ట నింపాలనే రూల్ ఏం లేదు. కానీ మన నైపుణ్యాలకు తగిన ఉద్యోగం దొరకకపోతే, అది దొరికే వరకూ ఎదురు చూసే స్థోమత ఉండకపోవచ్చు. అలాగని దొరికిన ఫుల్ టైమ్ ఉద్యోగంలో చేరితే దాని పనిలో పడి నేర్చుకున్న నైపుణ్యాలను మర్చిపోయే అవకాశం ఉంది. దాదాపు 2006 నుంచి ఇంజినీరింగ్‌ చేసిన వారందరి పరిస్థితి ఇదే. ఒక ఇంజినీర్ నీళ్ల లాంటివాడు, ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకృతికి మారిపోతాడు.. అని చెప్పినట్లుగా పెరిగిన కాంపిటీషన్ కారణంగా వారికి నచ్చిన ఉద్యోగాల్లో కాకుండా వచ్చిన ఉద్యోగాల్లో ఇంజినీర్లు చేరిపోయారు. కానీ వచ్చిన ఉద్యోగంలో కొనసాగుతుండగా, కొంత కాలం పాటు నచ్చిన ఉద్యోగం చేసే అవకాశం వస్తే? ఇక్కడ ఆలోచన మొదలవుతుంది. కొంతకాలమే ఉండే నచ్చిన ఉద్యోగం కోసం ఇంతకాలం తిండి పెట్టిన వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోలేరు. అందుకే ఆ నచ్చిన ఉద్యోగాన్ని ఫ్రీలాన్స్‌లో చేస్తారు. అంటే పగటి పూట వచ్చిన ఉద్యోగం కోసం సమయాన్ని కేటాయించి, రాత్రి పూట నచ్చిన ఉద్యోగం చేస్తారన్నమాట. ఇలా ఫ్రీలాన్స్ రంగం పుట్టుకొచ్చింది.

ఎవరికి ఉపయోగం?

సృజనాత్మకత రంగంలో అవకాశాలు ఎక్కువ.. కానీ ఇవన్నీ తాత్కాలిక అవకాశాలే. ఇక్కడ అన్ని పనులను అందరూ చేయలేరు. ఒకటి లేదా రెండు పనుల్లో మాత్రమే నైపుణ్యం కలిగి ఉంటారు. అలాగే ఈ రంగంలో ఒక పనిని ఒకరు చేసిన విధంగా మరొకరు చేయలేరు. ఎవరి శైలి వారిది. అందుకే ఒకే వ్యక్తిని శాశ్వతంగా నమ్ముకోవడానికి మీడియా సంస్థలు ఆసక్తి చూపించవు. ఎప్పటికప్పుడు కొత్తదనం కావాలి కాబట్టి కొత్తవారి కోసం వెతుకుతుంటాయి. ఆ వెతుకులాటే ఈ లాక్‌డౌన్‌లో ఫ్రీలాన్స్ ఉద్యోగులకు లాభాలను తెచ్చిపెట్టింది. లాక్‌డౌన్‌లో ఎన్ని రంగాలు ఆగినా డిజిటల్ మీడియా ఆగలేదు. ఈ డిజిటల్ మీడియా పనులన్నింటినీ వర్క్ ఫ్రమ్ హోమ్‌లో చేసుకోవచ్చు కాబట్టి ఫ్రీలాన్సర్ల అవసరం పెరిగింది. ముఖ్యంగా గ్రాఫిక్ డిజైనర్లు, కంటెంట్ రైటర్లు, ఎస్‌ఈవో స్పెషలిస్టులు, సోషల్ మీడియా మేనేజర్లు, ఆన్‌లైన్ కమ్యూనిటీ మార్కెటింగ్ చేసేవాళ్లకు డిమాండ్ అమాంతం పెరిగింది. ఈ కరోనా సమయంలో ఎలాగూ బయటికి వెళ్లే పని లేదు కాబట్టి ఇంట్లోనే ఉండి నాలుగు చేతులా సంపాదించుకున్నారు. వీరితో పాటు వెబ్‌సైట్ డెవలపర్లు, యూట్యూబ్ చానల్ మెయింటైన్ చేసే వాళ్లు, కంటెంట్ క్రియేటర్లు, ఆడియన్స్ మానిటరింగ్ నిపుణులు… ఇలా డిజిటల్ మీడియాతో సంబంధమున్న ప్రతీ ఒక్క సాంకేతిక నిపుణుడు ఫ్రీలాన్స్ ఉద్యోగిగా మారిపోయాడు.

దూసుకుపోయిన లోకలైజేషన్ ఇండస్ట్రీ

రోజుకొక కొత్త ఫీచర్, కొత్త ఉత్పత్తి, కొత్త ప్రోగ్రామ్ విడుదలవుతున్న ఈ రోజుల్లో ఆయా ఉత్పత్తులను ప్రతి ఒక్కరికీ చేరవేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా యాప్‌లు, టీవీ షోలు, సినిమాలను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావడానికి కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో భాగంగా పుట్టుకొచ్చినదే లోకలైజేషన్, అంటే లోకల్ వారికి తగినట్లుగా మార్చడం. ఇంగ్లీషు భాషలో ఉన్న యాప్‌లు, వెబ్‌సైట్, టీవీ షోలు, సినిమాలను ప్రాంతీయ భాషల్లోకి మార్చడం. అంటే అనువాదమే కానీ సృజనాత్మకత నిండిన అనువాదన్నమాట. భాష తెలిసిన ప్రతి ఒక్కరూ అనువాదం చేయలేరు, అందుకని మార్కెట్ అవసరాలకు తగినట్లుగా వినియోగదారులను ఆకర్షించే రీతిలో అనువాదం చేయగలగాలి. ఏ ఉత్పత్తినైనా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ కరోనా కాలమే సరైన సమయమని భావించిన కంపెనీలన్నీ లోకలైజేషన్ బాట పట్టాయి. దీంతో సబ్‌టైటిల్స్ అనువదించే వారు, డైలాగులు రాసేవారు, టెక్నికల్ నాలెడ్జి ఉండి అందుకు తగినట్లుగా ప్రాంతీయ భాషలో రాయగలిగే వారికి డిమాండ్ పెరిగింది. దీంతో భాషపై పట్టున్న వాళ్లందరూ ఫ్రీలాన్స్ అనువాదకులుగా మారిపోయారు.

ఇలా చూసుకుంటూ పోతే… ఫ్రీలాన్స్‌లో చేయదగిన పనులు ఎన్నో ఉన్నాయి. కానీ వాటిని వెతకడంలోనే అసలైన కష్టం ఉంటుంది. ఫ్రీలాన్స్ ఉద్యోగాల కోసం ఎన్ని యాప్‌లు, వెబ్‌సైట్‌లు ఉన్నా సరైన ప్రాజెక్టు వెతుక్కోవడం కొద్దిగా కష్టమే. అతికష్టం మీద ఒక ప్రాజెక్టు దొరికినా, అది పూర్తి చేశాక సరిగా డబ్బులు చెల్లిస్తారో లేదోనన్న భయం ఉంటుంది. అంతేకాకుండా ఏ చిన్న తప్పిదం జరిగినా ఎన్ని మాటలు పడాల్సి వస్తుందోనన్న ఆందోళన ఉంటుంది. అన్నిటికన్నా మించి, సమయాన్ని మేనేజ్ చేసుకుంటూ సరైన సమయానికి డెలివరీ చేయగలుగుతామా లేదా అనే కంగారు ఉంటుంది. ఇన్ని కష్టాల మధ్య కూడా ఒక చక్కని దారి వెతుక్కునే ఫ్రీలాన్స్ ఉద్యోగులను నిజంగా మెచ్చుకుని తీరాల్సిందే!


Next Story

Most Viewed