పంటల మార్కెటింగ్‌పై దృష్టి సారించాలి : సీఎం కేసీఆర్

by  |
పంటల మార్కెటింగ్‌పై దృష్టి సారించాలి : సీఎం కేసీఆర్
X

దిశ,తెలంగాణ బ్యూరో: పంటలను మార్కెటింగ్ చేసేందుకు కొత్త విధానాలను అన్వేషించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గత సంవత్సర కాలంలో వ్యవసాయ రంగంలో జరిగిన పురోగతి, ధాన్యం దిగుబడి, సాగు విస్తీర్ణం పెంపు తదితర విషయాలపై రాష్ట్ర క్యాబినెట్ చర్చించింది. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలతో గతేడాది 3 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయని సీఎం కేసీఆర్ తెలిపారు. పెరుగుతున్న దిగుబడులకు అనుకూలంగా రాష్ట్రంలో రైస్ మిల్లుల్లో మిల్లింగ్ సమర్ధ్యాన్ని పెంచుకోవాలని అన్నారు. నూతనంగా రైస్ మిల్లులు పారాబాయిల్డ్ మిల్లులను గణనీయంగా స్థాపించాలని, ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖను ఆదేశించారు.

ఉద్యానవన శాఖను పూర్తిస్థాయిలో క్రియాశీలకంగా మార్చాలని, అందుకు అవసరమైన రీతిలో అధికారులను నిపుణులను జోడించి నిరంతరంగా రైతులకు శిక్షణలు అందించాలన్నారు. పౌర సరఫరాల శాఖ సహా వ్యవసాయ శాఖలో ఎటువంటి ఉద్యోగాలు ఖాళీలు ఉండకూడదని, అన్ని పోస్టులను నింపుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. రానున్న 2022-23 సంవత్సరాల వరకు 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టే దిశగా రైతులను చైతన్యపరిచి ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది.

ఇందులో భాగంగా.. ఆయిల్ పామ్ సాగుచేసే రైతులకు ఎకరాకు, మొదటి సంవత్సరం రూ.26,000, రెండవ సంవత్సరం ఎకరాకు రూ.5000, మూడవ సంవత్సరం ఎకరాకు రూ. 5,000 చొప్పున పంట పెట్టుబడి ప్రోత్సాహకం కింద సబ్సిడీగా అందజేయాలని నిర్ణయించింది. తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్ద ఎత్తున స్థాపించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో కనీసం 10 జోన్లను ఏర్పాటు చేసేలా సంబంధిత శాఖను ఆదేశించింది. 500 ఎకరాలకు తగ్గకుండా 1000 ఎకరాల వరకు తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఏర్పాటు చేసి 2024-25 సంవత్సరం వరకు రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఎకరాలల్లో ఏర్పాటు లక్ష్యంగా చర్యలు చేపట్టాలని అధికారులను కేబినెట్ ఆదేశించారు. కొత్త జోనల్ వ్యవస్థ, కొత్త జిల్లాల ప్రకారంగా అన్ని రకాల ఉద్యోగుల విభజన జరగాలని, తద్వారా జిల్లాల వారీగా జోన్ల వారీగా అన్ని ఖాళీలను గుర్తించాలని, వాటితో పాటు ప్రమోషన్ల ద్వారా పలు ఖాళీలను భర్తీ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

రెండు రాష్ట్రాల నడుమ ఉద్యోగుల విభజన పూర్తయిందని, ఆంధ్రాలో మిగిలిన ఉద్యోగులను కూడా ఈ మధ్యనే తెలంగాణకు తెచ్చుకున్నామని కేబినెట్ తెలిపింది. ఇంకా మిగిలిపోయిన 200 నుంచి 300 తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రా నుంచి తీసుకు వస్తామని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed