ఆరడుగుల మేర మునిగిపోయాం

by  |
ఆరడుగుల మేర మునిగిపోయాం
X

దిశ, తెలంగాణ బ్యూరో/మహేశ్వరం/దిశ ప్రతినిధి, నల్లగొండ: వర్షాలు, చెరువులు పొంగిపొర్లడంతో ఆరడగుల వరకు వరద నీటిలో మునిగిపోయామని ఎల్​బీనగర్ జోన్ ముంపు బాధితులు కేంద్ర బృందానికి తమ గోడు చెప్పుకున్నారు. నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం రెండో రోజు పర్యటన ముగిసింది. శుక్రవారం పర్యటనలో ఎల్బీన‌గ‌ర్‌, ఖైర‌తాబాద్ జోన్లలో ప‌రిశీలించి బాధిత కుటుంబాల‌ నుంచి వివ‌రాల‌ను సేక‌రించింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ వశిష్ఠ నాయకత్వంలో కేంద్ర జలవనరుల విభాగం సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎం.రఘురామ్, కేంద్ర రోడ్ ట్రాన్స్ పోర్ట్ విభాగం సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎస్​కే కుష్వారా ఉన్నారు.

దెబ్బతిన్న రోడ్లు, నాలాలు, చెరువు క‌ట్టల పున‌రుద్ధర‌ణ‌కు చేప‌ట్టిన చ‌ర్యల గురించి అధికారులను అడిగి బృందం తెలుసుకుంది. చెరువుల ప‌టిష్టత‌కు, నాలాల విస్తర‌ణ‌కు చేప‌డుతున్న చ‌ర్యల గురించి అధికారులు వివ‌రించారు. నాగోల్‌, బండ్లగూడ‌, బైరామ‌ల్‌గూడ చెరువుల నాలాల నుంచి వ‌చ్చే వ‌ర‌ద నీటిని మూసిలో క‌లిపేందుకు శాశ్వత ప్రాతిప‌దిక‌న నాలాల‌ను అభివృద్ధి చేయ‌నున్నట్లు నీటి పారుద‌ల‌, జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. వరదతో నాగోల్ ప్రాంతంలోని పలు కాలనీలు, ఇండ్లు ఆరు అడుగుల మేర నీటి ముంపునకు గుర‌య్యాయ‌ని బాధిత కుటుంబాలు కేంద్ర కమిటీకి వివరించాయి.

దెబ్బతిన్న పంటల పరిశీలన..

భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టాన్ని తెలుసుకునేందుకు కేంద్ర బృందం శుక్రవారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాలలో పర్యటించింది. వ్యవసాయశాఖ అధికారులు కేంద్ర బృందానికి నష్టపోయిన పంటలను చూపించారు. భారీ వర్షానికి మోటార్లు, వ్యవసాయ సామగ్రి అంతా నీటిలో మునిగి పోయిందని రైతులు కేంద్ర బృందానికి తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్లు హరీష్ కుమార్, ప్రతీక్‌జైన్, జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి సమీపంలోని భూముల్లో వర్షాల కారణంగా నేలకొరిగిన పంట పొలాలను కేంద్ర బృందం పరిశీలించింది. ఇలాంటి పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడూ లేదని రైతులు వారి వద్ద గోడు వెళ్లబోసుకున్నారు.


Next Story

Most Viewed