కొనుగోలు కేంద్రాల వద్ద కొర్రీలు.. జాడలేని లారీలు

by  |
Penchikalpeta1
X

దిశ, ఆత్మకూర్: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేని దౌర్భాగ్య స్థితిలో అన్నదాత విలవిలలాడుతున్నాడు. పంట పండించడం ఒక ఎత్తయితే ఆ పంటను అమ్ముకోవడం మరొక ఎత్తు అవుతుంది. అనేక కష్టనష్టాలు, చీడపీడలను ఓర్చి పంట పండించి ఆ పంటను తీరా కొనుగోలు కేంద్రానికి తీసుకు వస్తే అక్కడ పెడుతున్నా కొర్రీలతో రైతులు ఆగం అవుతున్నారు. మండలంలోని పెంచికలపేట పీఏసీఎస్ పరిధిలో కటాక్ష పూర్, నీరుకుల్లా, పెంచికల్ పేట, కామారం, బ్రాహ్మణపల్లి గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులు వరి ధాన్యం కాంటాలై 5 రోజులు గడుస్తున్నా లారీల కొరతతో రైతులు పడిగాపులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుండి బస్తాకు సంచి బరువు, తాలు పేరుతో నిర్వాహకులు 2 కిలోల చొప్పున కోత విధిస్తూ ఉంటే, మిల్లుల వద్ద మిల్లర్లు మరో 2 కిలోల కోతతో సుమారుగా క్వింటాల్ పేరు మీద 9 కిలోల దాకా నష్టపోతున్నామని రైతులు ఆరోపిస్తున్నారు.

కొనలేక కొర్రీలు..

రైతులు తమ ధాన్యాన్ని తాము అమ్ముకోవడంలో కూడా ప్రభుత్వ అధికారులు విధిస్తున్న నిబంధనలతో రైతులు విసిగి వేసారి పోతున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి అయితే ఇక చస్తే పంట సాగు చెయ్యొద్దని అభిప్రాయం ఉంది. ధాన్యం అమ్మాలంటే గతంలో ఆధార్ కార్డు, పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంక్ అకౌంట్ పత్రాలు అవసరం ఉండేది. కానీ, ఇప్పుడు మాత్రం ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్, సర్వే నెంబర్ లో ఏ పంట సాగు చేస్తున్నారో ఆ పంటను మాత్రమే విక్రయించాలని విధించిన షరతులతో రైతులు ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్ల దగ్గర పడిగాపులు గాస్తున్నారు. యాసంగి పంట కొనుగోలు ఏమో కానీ, ఇప్పుడు పంటలు విక్రయించాలంటే రైతులకు పగలే చుక్కలు చూపిస్తున్నారు.

జాడలేని లారీలు

కాంటాలై 5 రోజులు అవుతున్న లారీ రావడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. కొన్ని సెంటర్లలో ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు ఒక్క లారీ కూడా రాని దుస్థితి నెలకొంది. గత 3 రోజులుగా వాతావరణంలో మార్పుల కారణంగా మబ్బులు పడుతుండడంతో రైతులు వారి పంట ఎక్కడ తడుస్తుందోనని ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సకాలంలో లారీలు తెప్పించి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నారు.

లారీలు కేటాయించాలి: మంగ రాజయ్య, పెంచికలపేట గ్రామ రైతు

సెంటర్ ప్రారంభమై 15 రోజులు అవుతుంది. ఇప్పటివరకు ఒక్క లారీ మాత్రమే వచ్చింది. నా వరి ధాన్యం కాంటాలు అయ్యి 5 రోజులు కావస్తోంది. ఇప్పటివరకు ఒక్క లారీ కూడా రాలేదు. లారీలు వస్తేనే ధాన్యం కాంట చేస్తామని నిర్వాహకులు తెలుపుతున్నారు. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. వెంటనే అధికారులు స్పందించి మా సెంటర్ కు లారీలను కేటాయించాలి.


Next Story

Most Viewed