కర్షకుల్లో తీవ్ర ఆందోళన.. కమ్ముకొస్తూనే.. కనుమరుగు..!

by  |
Rains
X

దిశ, కరీంనగర్ సిటీ: నైరుతి రుతుపవనాల ముందస్తు ఆగమనం మూన్నాళ్ళ ముచ్చటగా మారింది. ఆరంభంలో అదరగొట్టిన వరుణుడు, అనంతరం ముఖం చాటేయడంతో కొద్ది రోజులుగా జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. నిత్యం మేఘాలు కమ్ముకొస్తూ ఊరించి, అంతలోనే గాలిలో కలిసిపోయి ఉసూరుమంటున్నాయి. మొలకెత్తిన విత్తనాలు వాడిపోతుండగా, వరి నాట్ల కోసం అలికిన నారు కూడా ఎండుతోంది.. దీంతో, అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. ఉమ్మడి జిల్లాలో వరినాట్లు మరో వారం, పది రోజుల్లో ఊపందుకోనుండగా, వర్షాలు లేక బురద దున్నకం నిలిచింది. ప్రస్తుతం బోర్లు, నీటి సౌలభ్యం ఉన్న వ్యవసాయ బావుల వద్ద మాత్రమే వరి నాట్లు కొనసాగుతున్నాయి. వర్షాధారిత ప్రాంతాల రైతులు వరి నారు పోయలేక పోతున్నారు.

మృగశిర, ఆరుద్ర కార్తెలు ముగిసి పెద్ద పూశాల నడుస్తున్నా.. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ పెద్దగా వర్షాలు కురిసిన దాఖలాలు లేవు. రానున్న రోజుల్లో కూడా కురుస్తాయని నమ్మకం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మొక్కజొన్న, కంది, పెసర్లు లాంటి ఆరుతడి పంటల సాగు మొదలైంది. కనీసం వర్షం వీటికైనా ఊతమిస్తుందనుకుంటే అది కూడా లేక, రైతుల్లో ఆందోళన మొదలైంది. వారం రోజుల క్రితం జిల్లా కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో ఓ మోస్తరుగా వర్షం కురిసినా, ఆయకట్టు ప్రాంతాల్లో మాత్రం కురవలేదు.

ఈ ప్రాంతాల్లో ముందుగా కురిసే వర్షాలకు నారు పోసి సిద్ధంగా ఉంటారు. దిగువ మానేరు నుంచి నీటి విడుదల కాగానే, పొలాలు దున్ని నాట్లు వేస్తారు. అయితే వర్షాలు సక్రమంగా లేక, ఇప్పటి వరకు నార్లు పోయలేదు. మానేరు నీరు కూడా ఇప్పట్లో విడుదల చేసే అవకాశాలు కూడా కనిపించటం లేదు. దీంతో, ఈ వానాకాలంలో సాగు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికితోడు, నైరుతి రుతుపవనాల కదలిక నెమ్మదించిందని వాతావరణ శాఖాధికారులు పేర్కొంటుండటంతో రైతుల్లో నిరాశ, నిస్పృహలు మొదలయ్యాయి.

మొక్కజొన్న, కంది, పెసర్లు వర్షం కురవకపోతే ఎండిపోయే పరిస్థితులుండగా, రైతులు తీవ్రంగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలో వర్షాలు ముఖం చాటేయడంతో నీళ్లు లేక పొలాలు దున్నటంపై రైతులు అయోమయంలో ఉన్నారు. ఆయకట్టు రైతులతో పాటు బోర్లు, బావులపై ఆధారపడ్డ వారిలో కూడా, వర్షాభావ పరిస్థితి పట్ల ఆందోళన మొదలైంది. తుదకు ఖరీఫ్ సీజన్ ఆదిలోనే దెబ్బ తీసేనా అనే భయం కర్షకుల్లో నెలకొంది.


Next Story