రాలిపోతున్న రైతులు.. ఆ ఒత్తిడి ఎక్కువై ఇలా చేస్తున్నారట

by  |
రాలిపోతున్న రైతులు.. ఆ ఒత్తిడి ఎక్కువై ఇలా చేస్తున్నారట
X

దిశ, జగదేవపూర్ : దేశానికి అన్నం పెట్టే అన్నదాతులు వరుసగా రాలిపోతున్నారు. అందుకు ప్రధాన కారణం వారి మెడపై వేలాడుతున్న అప్పులే అని తెలుస్తోంది. తాజాగా సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పలుగుగడ్డ గ్రామంలో ఓ రైతు ప్రాణం తీసుకున్నాడు. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దేవుని నర్సింలు (52) అనే రైతు తనకున్న ఎకరం భూమిలో వరి, పత్తి పంటలను సాగు చేశాడు. మృతుడు నర్సింలు ఇటీవల కుమారుడి వివాహంతో పాటు నూతన గృహాన్ని కొనుగోలు చేశాడు. గత మూడేళ్లుగా వర్షభావ పరిస్థితుల కారణంగా పంట నష్టం వాటిల్లింది.

దీంతో పాటే కుమారుడి పెండ్లి కోసం రూ.4 లక్షల వరకు అప్పులయ్యాయి. ప్రస్తుతం వేసిన పత్తిపంట కూడా మొన్న కురిసిన వర్షాలకు పూర్తిగా ఎర్రబడటంతో తీవ్ర మనోవేదనకు గురై శనివారం సాయంత్రం తన వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే గుర్తించిన తోటి రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వెంటనే సిద్దిపేటలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం మృతి చెందినట్టు గ్రామస్తులు తెలిపారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పరమేశ్వర్ తెలిపారు.

Next Story