15 రోజులు మస్ట్.. పంచాయతీ కార్యదర్శుల హాజరుపై వెసలుబాటు

by  |
15 రోజులు మస్ట్.. పంచాయతీ కార్యదర్శుల హాజరుపై వెసలుబాటు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పంచాయతీ కార్యదర్శుల హాజరుపై ఆ శాఖ కొంత వెనక్కి తగ్గింది. దీనిపై పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో పీఆర్​ కమిషనర్​ శరత్​తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కీలకంగా చర్చించారు. గురువారం నుంచి అమల్లోకి తీసుకువచ్చిన డీఎస్​ఆర్​ యాప్​పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉదయం 8 గంటలకు పంచాయతీ కార్యాలయాల దగ్గరకు వెళ్లి ఫొటో తీసి హాజరు వేయడం ఏమిటంటూ పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు మధుసూదన్​రెడ్డి ప్రశ్నించారు. దీనిపై కమిషనర్​ ఎదుట వాదించారు. దీంతో కమిషనర్​ కొంత వెనక్కి తగ్గారు. హాజరుపై వెసలుబాటు కల్పించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు హాజరును వేయాలని నిర్ణయం తీసుకున్నారు.

అంతేకాకుండా ప్రతి నెలలో కనీసం 15 రోజులు డీఎస్​ఆర్​ యాప్​లో హాజరు ఉండే విధంగా మార్పులు చేస్తున్నట్లు అసోసియేషన్​కు హామీ ఇచ్చారు. నెలంతా కాకుండా 15 రోజులు తప్పనిసరిగా హాజరు ఉండాలని సూచించారు. దీనిపై కొంత అభ్యంతరం వ్యక్తం చేసినా చివరకు ఒప్పుకున్నారు. అంతేకాకుండా పనిభారాన్ని తగ్గించాలని సూచించారు. ఉపాధి పనుల నుంచి మొదలుకుని మొక్కలకు నీళ్లు పట్టే వరకు పంచాయతీ కార్యదర్శులపై పని ఒత్తిడి పెరుగుతుందని, వీటిపై నిర్ణయం తీసుకోవాలంటూ సూచించారు. అయితే కొద్ది రోజుల్లో ఈ సమస్యను పరిశీలిస్తామంటూ హామీ ఇచ్చారు. ఉపాధి పనుల కోసం ఒక సహాయకుడిని నియమించేందుకు ప్రయత్నాలు చేస్తామని పీఆర్​ కమిషనర్​ శరత్​ వారికి వివరించారు. అదేవిధంగా బదిలీలపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు మధుసూదన్​రెడ్డి మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులపై పనిభారం పెరిగిందని, అధికారుల ఒత్తిళ్లు కూడా పెరిగుతున్నాయన్నారు. ప్రస్తుతం పనిచేసేందుకు కూడా భయపడాల్సిన పరిస్థితి ఉందని, రాష్ట్రంలో కేవలం పంచాయతీ కార్యదర్శులు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు అనే తీరుతో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed