నానో యూరియా విరివిగా వాడండి

by  |
Minister Niranjan Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: నానో యూరియాను విరివిగా వాడాలని రైతులకు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మంత్రుల నివాస సముదాయంలో గుజరాత్ రాష్ట్రం కలోల్ నుంచి తెలంగాణకు బయలుదేరిన మొదటి నానో యూరియా ట్రక్‌ను ఆన్ లైన్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. భారతీయ రైతుల సొంత ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో ) నానో టెక్నాలజీ ద్వారా ఈ యూరియాను ఆవిష్కరించారని తెలిపారు.

ఇఫ్కో సంస్థ ప్రభుత్వానికి అధిక సబ్సిడీని అందిస్తూ రవాణ, నిల్వ ఖర్చులను తగ్గిస్తూ నానో యూరియాను సరఫరా చేస్తుందన్నారు. దీని ద్వారా ఒక బస్తా మీద దాదాపు రూ.800 నుండి రూ.1000 వరకు ప్రభుత్వాలకు సబ్సిడీ భారం తగ్గుతుందని తెలిపారు. కేవలం రూ.240లకు 500 ఎంఎల్ లిక్విడ్ బాటిల్ ఒక బస్తా యూరియా రైతులకు అందుతుందని వివరించారు. ప్రపంచంలో మొదటి సారిగా ఈ నానో యూరియాకు ఇఫ్కో సంస్థ పేటెంట్ కలిగి ఉండడం సంతోషకరమన్నారు.

ప్రస్తుతం వినియోగిస్తున్న యూరియాల వలన జరిగే కలుషితాలను నానో యూరియా నివారిస్తుందన్నారు. కార్పొరేట్ సంస్థల నుండి కాకుండా ప్రభుత్వ పరిధిలోని సహకార సంస్థ నుండి ఇలాంటి పరిశోధనా ఉత్పత్తి రావడం ఆహ్వానించదగిన పరిణామమన్నారు. దీనిని పెద్ద ఎత్తున ప్రచారం చేసి మార్కెట్‌లోకి తీసుకుపోయే బాధ్యతను రాష్ట్ర వ్యవసాయ శాఖ చేపడుతుందన్నారు. ఏ పంటకయినా పూతకంటే ముందు, విత్తిన 20 రోజుల తర్వాత యూరియాకు ప్రత్యామ్నాయంగా రెండు సార్లు పిచికారీ చేసుకోవచ్చని వివరించారు.

మామూలు యూరియాకు 30 శాతం సమర్ధత ఉంటే నానో యూరియా 80 శాతం సమర్ధంగా ఉండటంతో పాటు 8 శాతం దిగుబడి పెరుగుతుందని ఐకార్ పరిశోధనలలో వెల్లడించారని తెలిపారు. ప్రస్తుతం వాడుతున్న యూరియా కన్నా తక్కువ మోతాదు, తక్కువ ధరలో ఎక్కువ ఫలితాలు నానో యూరియా ఇస్తుందని చెప్పారు. క్షేత్ర స్థాయిలో రైతులకు ఈ యూరియా అందే విధంగా వ్యవసాయాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.



Next Story