హరీశ్‌కు షాకిచ్చిన BJP నేత.. దుబ్బాక ఓటమిలోనూ ఆయనదే కీలక పాత్ర..

by  |
హరీశ్‌కు షాకిచ్చిన BJP నేత.. దుబ్బాక ఓటమిలోనూ ఆయనదే కీలక పాత్ర..
X

దిశ, వెబ్‌డెస్క్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటర్లు గట్టి షాకిచ్చారు. ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ.. మంత్రి హరీశ్ రావును రంగంలోకి దింపింది. ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీశ్ ప్లాన్స్ హుజురాబాద్‌లో వర్క్ అవుట్ అవలేదు. దీంతో గులాబీ పార్టీ భారీ ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇటీవల దుబ్బాక ఎన్నిక కూడా మంత్రి హరీశ్‌కు ఇలాంటి చేదు అనుభవాన్నే మిగిల్చింది. దుబ్బాకలో సైతం టీఆర్ఎస్‌ను హరీశ్ రావు గెలిపించుకోలేకపోయారనే చర్చ తాజాగా ముందుకు వచ్చింది. కానీ, దుబ్బాకతో పోలిస్తే.. హుజురాబాద్‌లో బీజేపీకి మెజార్టీ ఎక్కువగా సాధించడం హరీశ్ రావుకు మింగుడుపడకుండా మారింది. ఈ రెండు ఎన్నికల్లో హరీశ్‌కు గట్టి షాక్ తగలడానికి బీజేపీ సీనియర్ నేతనే కారణమంటూ కొందరు నేతలు ప్రస్తావిస్తున్నారు.

ఈ రెండు ఉప ఎన్నికలకు మంత్రి హరీశ్ టీఆర్ఎస్‌కు ఇంచార్జ్‌గా ఉండగా.. బీజేపీ పార్టీకి ఎన్నికల ఇంచార్జ్‌గా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కొనసాగారు. బీజేపీకి ఇంఛార్జ్‌గా వ్యవహరించిన జితేందర్ రెడ్డి.. అక్కడ పార్టీ నేతలు, శ్రేణులను సమన్వయం చేసుకోవడంలో విజయం సాధించారు. ఆయనే దుబ్బాకలో రఘునందన్ రావు గెలుపులో కీలక పాత్ర పోషించారు. అదే నమ్మకంతో హుజురాబాద్ ఎన్నికలకు సైతం బీజేపీ ఇంచార్జీ బాధ్యతలను మరోసారి ఆయనకే అప్పగించింది అధిష్టానం.

దీంతో హుజూరాబాద్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జితేందర్ రెడ్డి.. ఈటల రాజేందర్ వ్యూహాలను అమలు చేయడంతోపాటు బీజేపీ నేతలు, శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడంలో విజయం సాధించారు. అలా టీఆర్ఎస్ ముఖ్యనేత, ఆ పార్టీ ట్రబుల్ షూటర్ హరీశ్ రావుకు రెండోసారి ఊహించని షాక్ ఇచ్చారు. మొత్తానికి హరీశ్ రావు వ్యూహాలకు విరుగుడు వ్యూహాలను సిద్ధం చేయడంలో జితేందర్ రెడ్డి సక్సెస్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది.



Next Story

Most Viewed