బయటపడిన ‘ఈటల’ విజయ రహస్యం.. అదే ఫార్ములా ఈసారి కూడా రిపీట్..!

by  |
బయటపడిన ‘ఈటల’ విజయ రహస్యం.. అదే ఫార్ములా ఈసారి కూడా రిపీట్..!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఆరుసార్లు వరస విజయాలు సాధించిన ఆ మాజీ మంత్రికి ఓ సెంటిమెంట్ కలిసొస్తుందా..? ఏడడుగులు నడిచిన తన అర్థాంగిచే ఏడో సారి కూడా అదే పద్ధతిన నామినేషన్ వేయిస్తారా..? తన ఇష్ట సఖిచే నామినేషన్ సెట్లు వేయిస్తూ విత్ డ్రా చేయిస్తూ ముందుకు సాగుతున్నారెందుకు అన్నదే ఇప్పుడు అక్కడ జరుగుతున్న హాట్ టాపిక్. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి..? ఎవరా అర్థాంగి అంటే మీరూ ఈ స్టోరీ చదవాల్సిందే.

దశాబ్దల కిందటే ఆదర్శ వివాహం చేసుకున్న ఈటల రాజేందర్, జమునల జీవితంలో ఈ విచిత్రం చోటు చేసుకుంది. అదీ ఎన్నికలప్పుడే కొనసాగుతుండటం అందరినీ ఆశ్యర్యానికి గురిచేస్తోంది. 2004 ఎన్నికలప్పటి నుండి ఈ ఆనవాయితీ సాగుతుండటం విశేషం. హుజురాబాద్ నుండి ఆరుసార్లు బరిలో నిలిచిన రాజేందర్‌తో పాటు ఆయన భార్య జమున కూడా ఆరు సార్లు నామినేషన్లు వేసి విత్ డ్రా చేసుకున్నారు. ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ తరుపున రెండు సెట్లు వేయగా మిగతా ఐదు సార్లు మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేయడం, ఉపసంహరించుకుంటుండమే అసలు ట్విస్ట్.

2014 ఎన్నికల్లో ఒక్కసారి మాత్రమే టీఆర్ఎస్ పార్టీ తరపున రెండు సెట్ల నామినేషన్ వేసిన ఈటల జమున.. అంతకుముందు, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా ఐదు సార్లు స్వతంత్ర అభ్యర్థినిగా నామినేషన్ వేశారు. ప్రతి సారీ ఈటలతో పాటు ఆయన భార్య నామినేషన్ వేయడం సెంటిమెంట్‌గా కొనసాగుతోందని కొందరు అంటుంటే, ఈటల రాజేందర్ నామినేషన్ తిరస్కరణకు గురైతే జమునను పోటిలో ఉంచే అవకాశం ఉంటుందనే ఈ ఎత్తుగడతో ముందుకు సాగుతున్నారన్న అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్న వారూ లేకపోలేదు. ఈ విషయంలో ఎవరెలా అనుకున్నా ఆ ఆలుమగల మధ్య ఉన్న ఆంతర్యం వారికే తెలియాలి తప్ప ఎవరికీ మాత్రం అంతుచిక్కడం లేదన్నది వాస్తవం.

ఏడోసారి కూడా..

ఆరుసార్లు ఆ సెంటిమెంట్‌తోనే అసెంబ్లీలో అడుగుపెట్టిన ఈటల రాజేందర్ ఏడడుగులు వేసిన తన సహధర్మచారిణిచే ఏడోసారీ కూడా నామినేషన్లు వేసే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు స్థానికులు. అయితే 2014లో టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్టుగా ఈ సారి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తారా లేక.. ఇండిపెండెంట్‌గా వేస్తారా అన్నదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.

Next Story

Most Viewed