ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు 'కల' గానే మిగిలిపోతుందా?

by Disha edit |
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు కల గానే మిగిలిపోతుందా?
X

ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడ సాగునీటి వనరులను మెరుగుపరిచి భూమిని సాగులోకి తేవాలి. సాగునీటి రంగంలో ఈ ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతోంది అన్న దానికి 'ఉత్తరాంధ్ర సుజల స్రవంతి' ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న జాప్యమే దానికి చక్కటి నిదర్శనం. పరిపాలన అనుమతి లభించిన తర్వాత కూడా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టు దేశంలోనే ఇది మొట్టమొదటిది. అదే విధంగా ఒకే ప్రాజెక్టుకు రెండుసార్లు ఇద్దరు ముఖ్యమంత్రులు శిలాఫలకాలు వేసిన ప్రాజెక్టు కూడా ఇదే. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి మరోసారి శిలాఫలకం వేస్తే ముచ్చటగా మూడోసారి అవుతుంది.

ఉత్తరాంధ్ర కష్టాలు తీర్చేందుకే..

ఉత్తరాంధ్రలో మొత్తం 23.24 లక్షల ఎకరాలు సాగుభూమి ఉండగా, అందులో కేవలం 8 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోందని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజలు ఎదుర్కొంటున్న సాగునీరు, తాగునీరు కష్టాలను పరిష్కరించడానికి ఏకైక మార్గం బాబూ జగ్జీవన్‌రామ్‌ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేయడమే. ఈ ప్రాజెక్టు పూర్తైతే విశాఖపట్నంలో 3.21లక్షల ఎకరాలు, విజయనగరంలో 3.94 లక్షల ఎకరాలు, శ్రీకాకుళం జిల్లాలో 0.85 లక్షల ఎకరాలు మొత్తం 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 12వందల గ్రామాలకు త్రాగునీరు లభిస్తుంది. 53.40 టీఎంసీలు వ్యవసాయం కోసం, 4.46 టీఎంసీలు త్రాగునీటి కోసం, 5.34 టీఎంసీల నీరు పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించేలాగా ఈ ప్రాజెక్టు డిజైన్‌ను రూపొందించడం జరిగింది. ఇంత ప్రాధాన్యత కలిగిన ఉత్తరాంధ్రకు జీవనాడి అయిన ఈ ప్రాజెక్టును పట్టించుకునే నాథుడే లేకుండాపోయారు.

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులను జీ.వో.ఎమ్‌.ఎస్‌.నెం.3, తేది.02`01`2009 నాడు 7214.10 కోట్ల రూపాయలతో పూర్తి చేయడానికి ఉత్తర్వులు జారీచేయడం జరిగింది. పరిపాలనా అనుమతుల అనంతరం దివంగత నేత డా. వై.యస్‌.రాజశేఖర్‌రెడ్డి 21 ఫిబ్రవరి 2009 నాడు సబ్బవరంలో బాబూ జగ్జీవన్‌రామ్‌ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడంతో పాటు, ఈ ప్రాజెక్టు పనులను పర్యవేక్షించడానికి చీఫ్‌ ఇంజనీర్‌ కార్యాలయాన్ని విశాఖ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మరణం తరువాత ప్రాజెక్టు పనులు ఆగిపోవడమే కాకుండా ఇంజనీరింగ్‌ కార్యాలయం పనిచేస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

హామీలు నీటిమీద రాతలే..

అవశేష ఆంధ్రప్రదేశ్‌లో 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో 14 వ పేజీలో 'ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును' సత్వరం పూర్తిచేస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా తమ ఎన్నికల ప్రణాళికలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు కట్టుబడి వున్నామని ఉత్తరాంధ్ర ప్రజలకు హామీ ఇచ్చింది. 2019 ఎన్నికల సందర్భంగా కూడా ఉత్తరాంధ్రలో జరిగిన పలుసభల్లో టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని హామీలు ఇచ్చారు. అయితే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణం విషయంలో వారిచ్చిన హామీలు నీటిమీద రాతగానే మిగిలిపోయాయి. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ ఈ ప్రాజెక్టు నిర్మాణపు పనులను చేపట్టడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ ఈ ప్రాజెక్టు పనులు చేపట్టాలని ప్రభుత్వంపైన ఒత్తిడి తెచ్చే విషయంలో ఇప్పటివరకు ఒక్క ఆందోళనా కార్యక్రమమైనా చేపట్టకపోవడం శోచనీయం.

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణం పనులు చేపట్టాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సాధన సమితి, ఉత్తరాంధ్ర చర్చా వేదిక, వివిధ ప్రజా సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో సబ్బవరంలోని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి శిలాఫలకానికి గోదావరి జలాలతో శుద్ధి చేసి ప్రాజెక్టు సాధన కోసం శాంతియుత ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు, శిలా ఫలకం వద్ద మౌన దీక్ష వంటి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాల ఒత్తిడి కారణంగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో చలనం వచ్చి ఈ ప్రాజెక్టు పనుల పైన దృష్టి సారించింది. 2017 సెప్టెంబర్‌ 5వ తేదీన జీ.వో.ఎమ్‌.ఎస్‌.నెం.53 బాబూ జగ్జీవన్‌రామ్‌ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు మొదటి దశ పనులకు 2022.22 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. నవంబర్‌ 15, 2018 నాడు చోడవరంలో నాటి సీఎం చంద్రబాబు నాయుడు శిలాఫలకం వేసి మొదటి దశ పనులకు శ్రీకారం చుట్టారు. 2019 మే నాటికి తొలిదశ పనులు పూర్తిచేసి రైతాంగానికి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.

వైఎస్ బాటలో నడుస్తామంటూ చేసిందేంటి?

ప్రాజెక్టు తొలిదశ పనుల్లో భాగంగా 3.15 టిఎంసిల సామర్ధ్యం గల పెదపూడి రిజర్వాయర్‌ నిర్మాణం, కాలువ పనులు పూర్తయితే విశాఖ జిల్లాలోని చోడవరం, మాడుగుల, నర్సీపట్నం, అనకాపల్లి, పాయకారావుపేట నియోజకవర్గాల్లోని బుచ్చెయ్యపేట, రావికమతం, మాకవరపాలెం, నర్సీపట్నం, కశింకోట, కోటవురట్ల, రోలుగుంట, మాడుగుల మండలాలలోని 133 గ్రామాలకు చెందిన 1,33,861 ఎకరాలకు సాగునీరు, పరిసర గ్రామాలకు తాగునీటి సౌకర్యం లభిస్తుంది. పెదపూడి రిజర్వాయర్‌ నిర్మాణం కోసం 2,300 ఎకరాలు, కెనాల్‌కు 300 ఎకరాలు, మధ్యలో వున్న అటవీ భూమి 147 ఎకరాలు, పిల్ల కాలువలకు 1,653 ఎకరాలు మొత్తం దాదాపు 4,400 ఎకరాలు అవసరం వుంది. కేవలం భూసేకరణకే దాదాపు 600 నుంచి 700 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది.

దివంగత నేత డా.వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తామని, నిత్యం వైఎస్‌ జపం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి గానీ, నూతన వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం కానీ డా. వైఎస్సార్ శంఖుస్థాపన చేసిన, బాబూ జగ్జీవన్‌రామ్‌ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తికి ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో ఏం చర్యలు తీసుకున్నారో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి కానీ, రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి కానీ ఇప్పటివరకు ఎన్నిసార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించారు? ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్ని నిధులు కేటాయించారు, ఎన్ని ఖర్చు చేశారు తదితర అంశాలపై ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి

2009 నాటి ప్రాథమిక అంచనాల (లైన్‌ ఎస్టిమేట్స్‌) ప్రకారం ఈ ప్రాజెక్టు పూర్తిచేయడానికి రూ. 7,214.10 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేయటం జరిగింది. ధరల పెరుగుదల, రూపాయి విలువ తరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే కనీసం 40వేల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది.

వారి ఘర్షణకు శాశ్వత పరిష్కారం

రాష్ట్రంలో 2019 లో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు పూర్తి స్థాయిలో చేపట్టడానికి 17,050.20 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో తొలిదశ పనుల అంచనా వ్యయం 2,022.20 కోట్ల రూపాయలు కాగా, రెండో దశ పనులు అంచనా వ్యయం 15,028 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్టు కోసం 63.20 టీఎంసీల గోదావరి నికర జలాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గోదావరి వరద నీరు వృధాగా సముద్రంలోకి పోయే రోజుల్లో కేవలం 120 రోజుల పాటు కాలువల్లోకి ఎత్తిపోసి, 196 కిలోమీటర్లు పొడవునా కాలువలు నిర్మించి నాలుగు రిజర్వాయర్లలో నిలువ చేయడం ద్వారా ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సాగు, తాగునీరు అవసరాలు తీర్చడం కోసం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును రూపొందించడం జరిగింది. పోలవరం ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు నీటిని మళ్లించేందుకు మూడు చోట్ల ఎత్తిపోతల పథకాలను నిర్మించాల్సి ఉంది.

తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నం వద్ద మొదటి దశలో 28 మీటర్లు, పాపాయిపాలెం వద్ద రెండదశలో 45 మీటర్లు, చివరిదశలో 4 రిజర్వాయర్ల వద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాల్సి ఉంటుంది. ఇందులో పురుషోత్తపట్నం వద్ద పనులు పూర్తయ్యాయి. విశాఖజిల్లా రావికమతం వద్దనున్న పెద్దపూడి రిజర్వాయర్‌, భూ దేవి రిజర్వాయర్‌, విజయనగరం జిల్లాలోని ఎస్‌.కోట వద్దనున్న వీరనారాయణం రిజర్వాయర్‌, తాటిపూడి వద్ద ఎక్స్‌టెన్షన్‌ రిజర్వాయర్లను నిర్మించాల్సి ఉంది. మొత్తం 4 రిజర్వాయర్లలో 19.70 టీఎంసీల నీటిని నిలువ చేసేందుకు 339 మెగావాట్లు విద్యుత్‌ అవసరం అవుతుంది. ప్రతి సంవత్సరం విశాఖపట్నానికి తాగునీరు, పారిశ్రామిక అవసరాల కోసం సాగునీరు కోసం రూపొందించిన రైవాడ, తాండవ తదితర ప్రాజెక్టుల నుండి నీరును మళ్లించడం జరుగుతోంది. దీనివలన రైతులకు, విశాఖ నగర ప్రజలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. ముందు ముందు పల్లెలకు, పట్టణాలకు మధ్య ఘర్షణ వాతావరణం నివారణకు శాశ్వత పరిష్కారం ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని చేపట్టడం తప్ప మరో మార్గం లేదు.

అప్రమత్తంగా లేకపోతే

వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలు గోదావరి జిల్లాలకు దీటుగా అభివృద్ధి చెందాలంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణమే చేపట్టడమే శరణ్యం తప్ప మరో మార్గం లేదు. ఈ ప్రాంత అభివృద్ధికి జీవనాధారమైన ఈ ప్రాజెక్టు పనులు చేపట్టాలని ప్రతీ ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా గొంతెత్తాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ ప్రాంత ప్రజలు ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తిగా అటకెక్కించి, చరమగీతం పాడిన ఆశ్చర్యం లేదు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి దోహదం చేసి, ఈ ప్రాంత వెనుకబాటుతనాన్ని రూపుమాపే 'ఉత్తరాంధ్ర సుజల స్రవంతి' ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించాలని, గోదావరి జలాలలో ఉత్తరాంధ్రకు తగిన వాటా కేటాయించాలని, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణానికి ఈ సంవత్సరం బడ్జెట్‌లో కనీసం 10 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని, ఇప్పటివరకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయించిన నిధులు ఎన్ని? ఖర్చు చేసిన నిధులు ఎన్ని? తదితర అంశాలపై ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి.

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభించాలని, ఈ ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికపై పూర్తిచేయాలని డిమాండ్‌ చేస్తూ ... ఈ ప్రాంతానికి చెందిన రైతాంగం, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, పౌరసమాజం, అన్ని వర్గాల ప్రజలు రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే తప్ప 'ఉత్తరాంధ్ర సుజల స్రవంతి' ప్రాజెక్టు పనులు ప్రారంభం కావు. లేని పక్షంలో ఈ ప్రాజెక్టు ఓ కలగానే మిగిలిపోతుంది.

- కొణతాల రామకృష్ణ

మాజీ పార్లమెంట్‌సభ్యులు

కన్వీనర్‌, ఉత్తరాంధ్ర చర్చావేదిక



Next Story

Most Viewed