నిషేధిత జాబితా భూములకు.. ఇప్పటికైనా మోక్షం కలిగేనా?

by Ravi |   (  Updated:2025-10-17 01:15:35  IST  )

నిషేధిత జాబితా భూముల విషయం 2007 నుండి ఇప్పటి వరకు సమస్యగానే ఉంది. పోగా, ఆ జాబితా వల్ల అధిక మంది భూ యజమానులు వాళ్ల ప్రమేయం లేకుండానే ఇబ్బందులకు గురవుతున్నారు. దానిపై హైకోర్టులో

నిషేధిత జాబితా భూములకు.. ఇప్పటికైనా మోక్షం కలిగేనా?
X

నిషేధిత జాబితా భూముల విషయం 2007 నుండి ఇప్పటి వరకు సమస్యగానే ఉంది. పోగా, ఆ జాబితా వల్ల అధిక మంది భూ యజమానులు వాళ్ల ప్రమేయం లేకుండానే ఇబ్బందులకు గురవుతున్నారు. దానిపై హైకోర్టులో అనేక కేసులు దాఖలు కాగా, హైకోర్టు తేదీ 2015 డిసెంబర్ 23న Sec.22 -A (1)(a) to (e)లకు సంబంధించి నిషేదితపు జాబితా తారుమారు చేసే విషయమై సుదీర్ఘంగా, తగు మార్గదర్శకాలతో తీర్పు వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం..

రాష్ట్ర ప్రభుత్వం తగు మార్గదర్శకాలతో పాటు నిర్ణీత నమూనాలను కూడా రూపొందించి ఆ జాబితాను తయారు చేయించాలని, జిల్లా కలెక్టర్లకు, సంబంధిత అధికారులకు తగు సూచనలు చేసింది. అయినప్పటికీ వాటిని తయారు చేయకపోగా, 2017-2018లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూప్రక్షాళన తర్వాత ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌లో రూపొందించిన నిషేదితపు జాబితాలో పరిస్థితి మరింత గందరగోళంగా తయారు కావడమే కాకుండా, దానివల్ల రైతులకు మానసిక క్షోభకు గురయ్యారు.

సమస్య పరిష్కారం కోసం తీర్పు..

అయితే 2015 తర్వాత, హైకోర్టు వెలువరించిన తీర్పులో సమస్యకు పరిష్కారం దొరక్కపోవడంతో తిరిగి హైకోర్టు 2025 ఆగస్టు 25న వెలువరించిన తీర్పులో, గతంలో హైకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం (వింజమూరి రాజగోపాల్ చారి వి. రాష్ట్ర ప్రభుత్వం), నిషేదితపు జాబితాను అందుకు నిర్ణీత సమయంలోనే తయారు చేస్తామని సీఎస్ నుండి అఫిడవిట్ తీసుకోవడం జరిగింది. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం తయారు చేసిన జాబితాపై అభ్యంతరాలను పరిశీ లించేందుకు గాను, ముగ్గురు సభ్యులతో (CCLA, Retd.Judge, Commissioner, S&LR) కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు హైకోర్టుకు తెలపడం జరిగింది. అయితే కేవలం ప్రిలిమినరీ నోటిఫికేషన్ మాత్రమే తయారు చేసి, రిజిస్ట్రేషన్ శాఖకు పంపడం జరిగింది. కానీ ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయలేదు. దీంతో రిజిస్ట్రేషన్‌లు జరుగలేదు. ఆ లిస్ట్ కూడా లోపభూయిష్టంగా ఉన్నందున, దాని నుండి డి-నోటిఫై చేయించుకోవడానికి భూ యజమానులు NOC కొరకు జిల్లా కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరగడంతో అనేక ఇబ్బందులకు గురయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2017-2018లో చేపట్టిన భూ ప్రక్షాళనలో ద్వారా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌లో అప్పటివరకూ ఎప్పుడు కూడా తమ భూముల వివరాలను, రెవెన్యూ రికార్డులలో నమోదు కానప్ప‌టికీ, భూ ప్రక్షాళనలో, దేవాదాయ, వక్ఫ్, భూదాన్ బోర్డు, అటవీ శాఖ, తమ విభాగాలకు చెడిన స్థిరాస్తుల జాబితాను నిషేధిత జాబితాలో చేర్చడం, అంతే‌గాక, షేత్వార్, ఖాస్రా ఆధారంగా చేసుకొని పట్టా భూములను కూడా ప్రభుత్వ భూములుగా నమోదు చేయడం, వివిధ అసైన్డ్ చట్టాల కింద భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములను, స్వాతంత్ర్య యోధులకు, రాజకీయ బాధితులు, మాజీ సైనికులకు పంపిణీ చేసిన భూములను లావణీ పట్టాలుగా నిషేదితపు జాబితాలో చేర్చడం, భూసేకరణ చట్టం ద్వారా సేకరించిన భూమి విస్తీర్ణం కంటే ఎక్కువ విస్తీర్ణాన్ని నిషేదిత జాబితాలో చేర్చడంతో సమస్య మరింత జటిలమయ్యింది. వాటిని డి-నోటిఫై చేసే అధికారం ధరణి పోర్టల్‌లో జిల్లా కలె క్టర్లకు కట్టబెట్టడం, వారు వాటిని ఏదో ఒక కారణంతో పరిష్కరించకపోవడం, మరికొన్ని ఎటువంటి కారణాలు లేకుండా తిరస్కరించడం జరిగింది.

నిషేధిత జాబితాపై కసరత్తు..

ఈ విధంగా ఎన్నో భూములను, రికార్డులను పరిశీలించకుండా, న్యాయంగా పట్టా భూములు అయినప్పటికీ నిషేదితపు జాబితాలో చేర్చడం ఇటువంటి సమస్యలు సుమారు 30% వరకూ ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అవక‌తవకలుగా ఉండవచ్చు. ప్రస్తుతం 10 సం.ల తర్వాత తిరిగి హైకోర్టు వెలువరించిన తీర్పులో 2021 డిసెంబర్ 23న నిషేదితపు జాబితా తయారీలో జారీ చేసిన మార్గ దర్శకాల ప్రకారం తగు ఆధారాలతో Sec.22-A(1) (a) టూ (d) వరకూ నిషేదితపు జాబితాను, నిర్ణీత వ్యవధిలో తయారు చేయమని ఇచ్చిన ఆదేశాల మేరకు, రెవెన్యూ అధికారులు ఆ జాబితా తయారీలో తలమున కలై ఉన్నారు. ఇప్పటికైనా ఆ జాబితా తయారీలో పాత రికార్డులను క్షుణ్ణంగా పరిశలించిన తర్వాత తగు ఆధా రాలతో తయారు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

కమిటీ సమీక్షలు నిర్వహించాలి..

ముఖ్యంగా ప్రభుత్వ భూములు, దేవాదాయ, వక్ఫ్, భూదాన్, సీలింగ్ అధికారులు వాటిపై తగు దృష్టిపెట్టాలి. జిల్లా స్థాయి అధికారులు కూడా వాటిని క్షుణ్ణంగా పరి శీలించిన తర్వాతనే, రిజిస్ట్రేషన్ అధికారులకు పంపడమే గాకుండా ఆ జాబితా విషయాల మీద వీలైనంత ప్రచారం చెయ్యవలసి ఉంటుంది. అదే విధంగా ఈ సంవత్సరం ఆగస్టులో ఏర్పడిన కమిటీ నెలకు ఒకసారి వాటిపై వచ్చిన అభ్యంతరాలను (15) రోజులకు ఒక సారైనా సమీక్ష జరిపితే ఆ సమస్యను త్వరితగతిన పరిష్కారం అవుతాయి. ఎందుకంటే రాష్ట్రం మొత్తంలోనే అభ్యంతరాలను కేవలం ఒకే కమిటీ సమీక్ష జరపాల్సి వస్తుంది. కావున ఆ కమిటీ సమీక్ష నిర్వహించాలి. హైకోర్టు తాజాగా వెలువరించిన తీర్పుతో ఇప్పటికైనా నిషేదిత జాబితా భూముల బాధితుల సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తూ, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్య తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ-భారతి చట్టం ఉద్దేశం నెరవేరి, ధరణి చట్టం ద్వారా జరిగిన నిషేధిత జాబితా ఇబ్బందుల నుండి విముక్తి కలుగుతుంది.

- సురేశ్ పోద్దార్

సంయుక్త కలెక్టర్ (విశ్రాంత)

800080 63605

Next Story