- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీలీమిటేషన్‌కు జీడీపీని పరిగణలోకి తీసుకోరా?
డీలిమిటేషన్ అనేది శాసన వ్యవస్థ నియోజకవర్గాల సరిహద్దులను పునర్నిర్ధారించే ప్రక్రియ. ఈ ప్రక్రియ పార్లమెంట్‌లో

డీలిమిటేషన్ అనేది శాసన వ్యవస్థ నియోజకవర్గాల సరిహద్దులను పునర్నిర్ధారించే ప్రక్రియ. ఈ ప్రక్రియ పార్లమెంట్‌లో "ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాల ప్రాతినిధ్యం", జనాభా, జీడీపీ వాటాల చర్చకు దారి తీసింది. 2026 తర్వాత పునర్విభజన జరుగుతుంది. జనాభా నియం త్రణలో విజయం సాధించిన తమకు స్థానాలు, నిధులు తగ్గుతాయనేది దక్షిణాది రాష్ట్రాల ఆందోళన.
జీడీపీలో 35%తో గణనీయమైన వాటా కలిగివున్నప్పటికీ, 18% జనాభాతో ప్రాతినిధ్యం కోల్పోతామనే భయం ప్రాంతీయ ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. జనాభాను అభివృద్ధి ప్రమాణాలతో సమతుల్యం చేయాలని రాజకీయ నాయకులు వాదిస్తున్నారు. సమగ్రతను కాపాడుతూ, భారత ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించే విధంగా డీలిమిటేషన్ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది.
దక్షిణాది అభ్యంతరం దేనికి?
ప్రస్తుతం, ఆర్థిక సంఘం నిధుల కేటాయింపులో జనాభాను ఒక ప్రామాణికంగా పరిగణించడంపై దక్షిణ రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం, కమిషన్ ఉత్తర్వులు గెజిట్‌లో ప్రచురించబడిన తర్వాత వాటిని ఏ కోర్టులోనూ ప్రశ్నించడానికి వీలు లేదు. 2002లో రాజ్యాంగ సవరణ ద్వారా 2026 వరకు నియోజకవర్గాల పునర్విభజన చేయకూడదని నిశ్చయించారు. జనగణన 2021 తర్వాత జరగాల్సి ఉండగా, కొవిడ్ తదనంతర జాప్యాల కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం 2001 జనగణన ఆధారంగా రూపొందించిన నియోజకవర్గాలు 2026 తర్వాత పునర్విభజన జరుగుతుంది.
ఈ ప్రక్రియలో పక్షపాత వైఖరి
నియోజకవర్గాల పునర్విభజన నిర్ణయం పక్షపాత ఆరో పణలు ఎదుర్కొంటున్నది, ముఖ్యంగా జనాభా పెరుగుదల ఎక్కువగా ఉన్న ఉత్తర భారత రాష్ట్రాలకు అనుకూలంగా ఉందని విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే ఇది వారి లోక్‌సభ స్థానాలను తగ్గించే ప్రమాదం ఉందిని వాదిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ విషయంలో 1971 జనాభా లెక్కల ఆధారంగా 30 సంవత్సరాల పాటు ప్రాతినిధ్యాన్ని కొనసాగించాలని కోరారు. ఉత్తర-దక్షిణ విభజన& రాజకీయ వ్యతిరేకత, డీఎంకే, ఏఐడీఎంకే, బీఆర్ఎస్ వంటి పార్టీలు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు వ్యతి రేకంగా రాజకీయ నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఉత్తర భారతదేశం ప్రాధాన్యత మరింత పెరిగే అవకాశం ఉందని దక్షిణ రాష్ట్రాలు భయపడుతున్నాయి.
రాజకీయ ప్రాతినిధ్యం ప్రమాదకరం!
నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ రాజకీయ పార్టీలకు అనుకూలంగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గెరీమాండరింగ్ వంటి చర్యలు న్యాయమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగించే అవకాశం ఉంది. అంతేకాకుండా, కొన్ని ప్రాంతాల్లో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలకు (ఎస్టీ) తగిన ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల రిజర్వేషన్లలో అసమతుల్యతలు ఏర్పడే అవకాశం ఉందని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పునర్విభజన ప్రభావం కేవలం రాజకీయ ప్రాతినిధ్యానికే పరిమితం కాదు, ఇది కేంద్రం నుండి రాష్ట్రాలకు నిధుల కేటాయింపును కూడా ప్రభావితం చేస్తుంది. ఈ నేపథ్యంలో, పునర్విభజన ప్రక్రియ మరింత పారదర్శకంగా, సమ న్యాయం చేకూర్చే విధంగా ఉండాలని దక్షిణాది రాష్ట్రాలు గట్టిగా కోరుతున్నాయి.
వెయిటేజీ విధానంతో తీవ్ర నష్టం!
రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు నియమించబడే ఆర్థిక సంఘం, పన్నుల పంపిణీ, గ్రాంట్ల కోసం సిఫార్సులు చేస్తుంది. ఈ సిఫార్సులు జనాభా, ఆదాయం, భౌగోళిక విస్తీర్ణం, పన్నుల వసూళ్లు వంటి వివిధ అంశాల ఆధారంగా రూపొందించబడతాయి. ఉదాహరణకు, 15వ ఆర్థిక సంఘం (2021-26) నిధుల పంపిణీ కోసం 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకుంది. ఇందులో జనాభాకు 15%, జనాభా పనితీరుకు 12.5%, ఆదాయ భేదానికి 45%, భౌగోళిక విస్తీర్ణానికి 15%, అటవీ, పర్యావరణ అంశాలకు 10%, పన్నుల వసూళ్ల పనితీరుకు 2.5% ప్రాధాన్యత ఇవ్వబడింది. ఈ వెయిటేజీ విధానం భవిష్యత్తులో నిధుల కేటాయింపులో కీలక పాత్ర పోషించనుంది. ఈ విధానం దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలిగిస్తుందని వాదనలు వినిపిస్తున్నాయి. తక్కువ జనాభా వృద్ధి ఉన్న రాష్ట్రాలకు తక్కువ నిధులు రావడం, నిధుల కేటాయింపు మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. అయితే, భవిష్యత్తులో 2026 తర్వాత జరిగే డీలిమిటేషన్ కొత్త జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సంఖ్యను మార్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆర్థిక సంఘం భవిష్యత్తులో నిధుల కేటాయింపులో జనాభాకు అధిక ప్రాధాన్యత ఇస్తే, జనాభా పెరిగిన రాష్ట్రాలకు ఎక్కువ నిధులు, జనాభా స్థిరంగా ఉన్న లేదా తక్కువగా ఉన్న రాష్ట్రాలకు తక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంది.
ఇతర సమాఖ్య వ్యవస్థలతో పోల్చి..
ఈ సమస్యల పరిష్కారానికి జనాభా ప్రాముఖ్యతను తగ్గించడం, ఇతర ప్రమాణాల ప్రాధాన్యతపై కమిషన్ వేయడం వంటి సూచనలు ఉన్నాయి. భవిష్యత్తులో ఆర్థిక ప్రగతి వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని, సార్వత్రిక సంప్రదింపులు, స్వతంత్ర నిపుణుల కమిటీల ద్వారా సమతుల్యమైన డీలిమిటేషన్ విధానాన్ని అభివృద్ధి చేయాలి. రాజకీయ ఒత్తిళ్లను నివారించే రాజ్యాంగ భద్రతలు లాంటి మార్గాలను పకడ్బందీగా అమలు చేయడం అవసరం. అమెరికా, కెనడా వంటి ఇతర సమాఖ్య వ్యవస్థలతో పోల్చి చూసి, సమతుల్యమైన డీలిమిటేషన్ విధానాన్ని అభివృద్ధి చేయవచ్చు. సమగ్రతను కాపాడుతూ, భారత ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించే విధంగా డీలిమిటేషన్ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది.
డా. కట్కూరి
న్యాయ నిపుణులు
94909 34520






