సేవకు ఎందుకు ప్రతిబంధకం..?

by Ravi |   (  Updated:2025-09-30 00:45:51  IST  )

దేశంలోనే అత్యంత వెనుకబడి కరువుతో అల్లాడిన అనంతపురం జిల్లాలో కొన్ని దశాబ్దాల క్రితం రెండు ఆపన్న హస్తాలు కాంతిరేఖలై అక్కడి జీవితాల్లో

సేవకు ఎందుకు ప్రతిబంధకం..?
X

దేశంలోనే అత్యంత వెనుకబడి కరువుతో అల్లాడిన అనంతపురం జిల్లాలో కొన్ని దశాబ్దాల క్రితం రెండు ఆపన్న హస్తాలు కాంతిరేఖలై అక్కడి జీవితాల్లో వెలుగులు ప్రసాదించి జనం గుండెల్లో గూడుకట్టుకున్నాయి. అక్కడ ప్రసరించిన మానవతా కాంతి రేఖలు అక్కడే పరిమితంగా కాకుండా సరిహద్దులు చెరిపేసి వివిధ తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో సేవలందించాయి.

బలహీన వర్గాల్లో సాధికారత పెంచాలని..

అనంతపురం జిల్లా కేంద్రంగా ఈ ఘనమైన సేవలందించిన సంస్థల్లో మొదటిది విసెంటే ఫెర్రార్ మోంచో స్థాపించిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ), రెండోది సత్యసాయి స్ధాపించిన సత్యసాయి సేవా ట్రస్ట్‌లు.. ఎక్కడో స్పెయిన్ దేశంలో జన్మించి మారుమూల పల్లెలు గిరిజన, దళిత, బలహీన వర్గాల జీవితాల్లో సాధికారత పెంచాలని ప్రయత్నించి గత 56 సంవత్సరాలకు పైగా సేవలందించిన ఫెర్రర్ ఆర్డీటీకి కలిగిన అడ్డంకులను తొలగించేందుకు జరు గుతున్న జాప్యంపై ఆయా వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ లోపాలను సరిదిద్ది..

విదేశీయులు నుంచి వచ్చే విరాళాలతో మన దేశాన్నే మాతృ దేశంగా భావించి సేవలందిస్తున్న ఆర్డీటీకి గత రెండు సంవత్సరాలుగా గ్రహణం ఏర్పడింది. విదేశీ నిధులతో నిర్వహిస్తున్న ఆస్పత్రుల నుంచి వచ్చే ఆదాయాన్ని ఫారిన్ కంట్రిబ్యూషన్ ఖాతాలో కాకుండా లోకల్ కంట్రిబ్యూషన్ (ఎల్.సీ) ఖాతాలో జమ చేయడం, ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతులు లేని ఇతర ఎన్‌జీవో‌లకు విరాళాలు ఇచ్చినట్లు తేలడంతోనే రెన్యువల్ నిలుపుదల చేసామని కేంద్రం పేర్కొంది. లోపాలను సరిదిద్ది సంస్ధ సేవలను పరిగణలోనికి తీసుకుని వేగవంతంగా వారి సేవలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది.

సేవకు ప్రతిరూపం ఫెర్రర్ మోంచో

స్పెయిన్‌లోని బార్సిలోనాలో 1920 ఏప్రిల్ 9 జన్మించిన విసెంటో ఫెర్రర్ 1952లో జెస్యూట్ మిషనరీగా భారతదేశానికి వచ్చారు. మహరాష్ట్రాలోని మన్మాడ్‌లో రూరల్ డెవలప్మెంట్ అసోసియేషన్ స్థాపించి అక్కడ పాఠశాలు స్థాపించడంతో పాటు 3వేల చిలుకు బావులు నిర్మాణంలో పాలు పంచుకొని వారి ఆకలి బాధలను తీర్చేందుకు కృషి చేశారు. 16 ఏళ్ల తర్వాత అనంతపురం జిల్లాలో అతని భార్య మాజీ జర్నలిస్ట్ అన్నే ఫెర్రీతో కలిసి 1969లో ఆర్డీటీని ఏర్పాటు చేశారు. ఒకవైపు దళిత గిరిజన బలహీన వర్గాల వారికి, గ్రామీణ మహిళలకు, రైతులకు సేవలందిస్తూనే మూడు ఆస్పత్రులు, 14 గ్రామీణ క్లినిక్‌లు, 1700 పాఠశాలలు, దాదాపు 30 వేలకుపైగా ఇళ్లు, 3వేల మొక్కలు నాటడానికి నిధులు సమకూర్చిన సేవా వృక్షం ఆర్డీటీ. సుమారు 2.5 మిలియన్లకు పైగా పేద ప్రజల జీవితాల్లో ఈ సంస్థ వెలుగులు నింపడానికి ఫెర్రర్ చేసిన అనితరమైన కృషే కారణం. 2009 జూన్ 19న ఆ మహనీయుడి మరణం తర్వాత కూడా ఈ సంస్థ గణనీయమైన సేవలందిస్తోంది.

అభాగ్యుల మొర ఆలకించండి!

ఆర్డీటీకి పట్టిన గ్రహణం కారణంగా నష్టపోతున్నది ఈ దేశ వాసులు. పేదలు, అభాగ్యులతో పాటు 3 వేల మందికి పైగా ఉద్యోగులు.. వారి భవిష్యత్ అగమ్యగోచరంగా ఉంది. ప్రతి ఏడాది సుమారు రూ.300 కోట్లను ఆర్డీటీ సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తుంది. ఇప్పుడు నిధుల నిలుపుదలతో ఆస్పత్రులు, రుణాలు, స్కాలర్‌షిప్‌లు, విద్యార్థుల భవిష్యత్‌కు ప్రతిబంధకాలు ఎదురవు తున్నాయి. అనంతపురం జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో ఆర్డీటీ సేవలు నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడటంతో వేలాదిమంది అభాగ్యులు రోడ్డెక్కుతున్నారు.

సరిదిద్దడంలో తప్పులేదు కానీ..

సేవానిరతి, మానవతావాదంతో ఈ దేశ సౌభాగ్యం కోసం సేవ చేస్తున్న సంస్థల విషయంలో నిబంధనల పేరుతో నాన్చుడు ధోరణి ఏ మాత్రం క్షేమకరం కాదు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఏపీ ప్రభుత్వం ఆర్డీటీకి ఎదురైన సమస్యను పరిష్కరించేందుకు ముందుకు రావడం హర్షణీయమైన పరిణామం. నిబంధనలు గాడి తప్పితే సరిదిద్దడంలో తప్పులేదు.. కానీ త్వరితగతిన స్పందించకపోతే అభాగ్యుల జీవితాలకు వెలుగు ఎక్కడ వస్తుంది? సేవ్ ..ఆర్డీటీ.

- అడపా దుర్గ

90007 25566

Next Story