చేనేత రంగంపై చిన్నచూపెందుకు?

by Ravi |   (  Updated:2026-02-22 01:00:49  IST  )

భారతదేశంలోని గ్రామీణ కుటీర పరిశ్రమల ప్రాముఖ్యత ఎంత చెప్పుకున్నా తక్కువే. భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి, అస్తిత్వానికి ప్రతీకలుగా చేనేత వస్రోత్పత్తి రంగం నిలుస్తుంది.

చేనేత రంగంపై చిన్నచూపెందుకు?
X

భారతదేశంలోని గ్రామీణ కుటీర పరిశ్రమల ప్రాముఖ్యత ఎంత చెప్పుకున్నా తక్కువే. భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి, అస్తిత్వానికి ప్రతీకలుగా చేనేత వస్రోత్పత్తి రంగం నిలుస్తుంది. సాంప్రదాయక వస్త్రోత్పత్తి రంగంగా నేటికీ చేనేత పరిశ్రమ మనుగుడ సాగిస్తుంది. జాతీయ ఉద్యమానికి చరఖా స్ఫూర్తిగా నిలిచింది.

భారత రాజ్యాంగం 43వ ఆర్టికల్‌లో కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను పొందుపరిచారు. పంచవర్ష ప్రణాళికల్లో సైతం చేనేత రంగానికి విశిష్ట ప్రాధాన్యత కల్పించారు.. 20 సూత్రాల ఆర్థిక పథకంలోనూ చేనేత రంగాన్ని ప్రోత్సహించారు. కానీ ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఉపాధి రంగాన్ని ప్రోత్సహించాల్సిన ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయి.

35 లక్షల కుటుంబాలు.. 68 లక్షల కార్మికులు..

అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉపాధి పొందుతున్న రంగాలలో చేనేత ఒకటి. నేడు ఉపాధి కల్పన పేరుతో ఒక్కో ఉపాధికి కోట్లాది రూపాయలు సబ్సిడీల రూపంలో వెచ్చిస్తున్న కేంద్ర ప్రభుత్వం చేనేత రంగం అభివృద్ధికి సంక్షేమానికి సరైన రీతిలో ప్రోత్సాహాలు కల్పించడం లేదు. నాలుగవ ఇండియన్ హ్యాండ్లూమ్ సెన్సెస్ 2020 ప్రకారం దేశవ్యాప్తంగా 35.22 లక్షల కుటుంబాలు చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి. మొత్తం 68.86 లక్షల చేనేత కార్మికులు ఈ రంగంలో పనిచేస్తున్నారు.. వీరిలో స్త్రీలు 38.61 లక్షలు, పురుషులు 30.25 లక్షల మంది పని చేస్తున్నారు.. వీరిలో ఎస్సీలు 13.8%, ఎస్టీలు 17.8%, ఓబీసీలు 36% ఇతరులు 32.4% ఉన్నారు. ముస్లింలు, క్రైస్తవులు చెప్పుకోదగిన సంఖ్యలో జీవనోపాధి పొందుతున్నారు.. వీరిలో 90 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్నారు. వీరి నెలసరి ఆదాయం చాలా తక్కువగా ఉంది. ఐదువేల రూపాయల కన్నా తక్కువ ఆదాయం పొందుతున్న వారు 67% కాగా 10000 లోపు ఆదాయం పొందుతున్న వారు 26% మాత్రమే. 15 వేల లోపు ఆదాయం పొందుతున్న వారు కేవలం 4.5% కాగా 15000 రూపాయల పైన ఆదాయం పొందుతున్న వారు 2% మాత్రమే. టెక్స్‌టైల్ మినిస్ట్రీ లెక్కల ప్రకారం చేనేత కార్మికులకు సంవత్సరంలో 274 రోజులు పని దినాలు లభిస్తున్నాయని అంచనా వేశారు..

తక్కువ పెట్టుబడి, ఎక్కువ ఉపాధి!

ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఉపాధి రంగాన్ని ప్రోత్సహించాల్సిన ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయి. అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉపాధి పొందుతున్న రంగాలలో చేనేత ఒకటి. నేడు ఉపాధి కల్పన పేరుతో ఒక్కో ఉపాధికి కోట్లాది రూపాయలు సబ్సిడీల రూపంలో వెచ్చిస్తున్న కేంద్ర ప్రభుత్వం చేనేత రంగం అభివృద్ధికి సంక్షేమానికి సరైన రీతిలో ప్రోత్సాహాలు కల్పించడం లేదు. చేనేత రంగం పర్యావరణ అనుకూల ఉత్పత్తుల పరిధిలోకి వస్తుంది. విద్యుత్ వాడకుండా చేనేతలు తమ వస్త్ర ఉత్పత్తి చేస్తారు.. సహజమైన కాటన్, సిల్క్, లినెన్ వంటి నూలు దారాలతో వస్త్ర ఉత్పత్తి చేస్తారు. ప్రకృతి రంగుల అద్దకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. నేడు యువతరం నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటుంది. చేనేత వంటి రంగాలలో కొత్త ఉపాధికి ముఖ్యంగా స్త్రీలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ కొత్తవారు ఈ రంగంలోకి రావడానికి విముఖత చూపుతున్నారు. ఈ రంగంలో ప్రభుత్వాలు సరైన రీతిలో ప్రోత్సాహకాలు అందిస్తే మరింతగా ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయి.

తగ్గుతున్న బడ్జెట్..

ఉపాధి రంగంగా నిలుస్తున్న చేనేతకు రాను రాను బడ్జెట్ కేటాయింపులు తగ్గుతున్నాయి.. 2013-14 జాతీయ బడ్జెట్లో చేనేత రంగానికి 493 కోట్లు కేటాయిస్తే, 2025 -26 బడ్జెట్లో 200 కోట్లు మాత్రమే కేటాయించారు. 2013-14 మొత్తం జాతీయ బడ్జెట్ 14.90 లక్షల కోట్లు కాగా 2026 -27 నాటికి అది 53.47 లక్షల కోట్లకు పెరిగింది. బడ్జెట్ మూడింతలు పెరిగినా చేనేత రంగానికి కనీసం 1479 కోట్లు కేటాయించాలి. కానీ 205 కోట్లు మాత్రమే కేటాయించడానికి హేతుబద్ధత ఏదీ లేదు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండి క్రాఫ్ట్ ప్రకారం చేనేత రంగానికి కనీసం ఒక్కో కార్మికునికి సగటున 1519 రూపాయలు చొప్పున 1070 కోట్లు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. 2025-26 బడ్జెట్లో ఒక్కో కార్మికునికి ఏడాదికి కేవలం 290 రూపాయలు మాత్రమే కేటాయించారంటే చేనేత రంగం పట్ల భారత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహిస్తుందో వేరుగా చెప్పాల్సిన పనిలేదు.. గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో చేనేత కార్మికుని పైన ఏటా 715 కేటాయించేవారు.

చేతి వృత్తుల రంగాలను నిర్లక్ష్యం చేస్తూ..

మొత్తం టెక్స్‌టైల్ బడ్జెట్‌లో సైతం చేనేత రంగాన్ని విస్మరిస్తున్నారు.. 2013 -14లో మొత్తం టెక్స్‌టైల్ బడ్జెట్ 3915 కోట్లు కాగా అందులో 15.7 శాతం 493 కోట్లు కేటాయించగా , 2025 -26 లో 10,000 కోట్ల టెక్స్‌టైల్ బడ్జెట్లో కేవలం 2.0 % అంటే 205 కోట్లకి తగ్గించారు. ఇది చాలా దారుణం. ఒక అంచనా ప్రకారం చేనేత వస్త్ర ఉత్పత్తుల అమ్మకాల మీద కేంద్ర ప్రభుత్వానికి ఏటా 6000 కోట్ల రూపాయలు జీఎస్టీ రూపంలో ఆదాయం లభిస్తుంది. గాంధీయ సోషలిజం, స్వదేశీ, స్వావలంబన నినాదాలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ చేనేత చేతి వృత్తుల రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకవైపు వికసిత భారత్ 2047 అని ప్రచారం చేస్తూ మరోవైపు చిన్న పరిశ్రమలను నిర్లక్ష్యం చేయడం సమంజసమా? అని చేనేత చేతి వృత్తి రంగాల నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

- తడక యాదగిరి

అసిస్టెంట్ ప్రొఫెసర్, ఓయూ

93480 09227

Next Story