బీసీ రిజర్వేషన్‌పై..ఈ దాటవేత వైఖరి ఎందుకు?

by Ravi |   (  Updated:2025-08-03 01:00:43  IST  )

తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థలు, విద్య, ఉపాధి రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు తెలంగాణ శాసనసభలో

బీసీ రిజర్వేషన్‌పై..ఈ దాటవేత వైఖరి ఎందుకు?
X

తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థలు, విద్య, ఉపాధి రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టి కొన్ని నెలలు కావస్తోంది. కానీ బీసీ బిల్లుకు స్థానిక నేతలు జైకొట్టినా కేంద్రంలోని బీజేపీ మాత్రం మోకాలడ్డుతూ ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీలకు ఉన్న రిజర్వేషన్లను 42% పెంచుతూ ఆమోదించిన బిల్లు చట్ట రూపం దాల్చాలంటే పార్లమెంటులో 2/3 మెజారిటీతో బిల్లుకు ఆమోదం పొందాల్సి ఉంది.

ఏ రాష్ట్రమైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలందరికీ అమలు చేసే రిజర్వేషన్లను కలిపి 50% మించకూడదని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. రిజర్వేషన్లను పెంచితే వాటిని రాజ్యాంగంలోని షెడ్యూల్‌ -9లో చేర్చాల్సి ఉంటుంది.

ఇది చట్టపరంగా నిలబడాలంటే..

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 31(సి) ప్రకారం, ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతున్నట్టు పేర్కొన్నారు. న్యాయ సలహా తీసుకుని రాష్ట్రపతి వాటిపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అవి చట్టపరంగా నిలబడాలంటే మాత్రం బిల్లులను పార్లమెంటు ఉభయ సభలు 2/3 మెజారిటీతో ఆమోదించాలి. నిజానికి బీజేపీ ఎప్పటి నుంచో బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. బిల్లుల అమలును ఆర్డినెన్స్ రూపంలో చేయకుండా బీసీల హక్కులను కాలరాస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఏక గ్రీవంగా ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా ఆలస్యం చేస్తూ బీసీల విద్య, ఉపాధి అవకాశాలపై నిర్లక్ష్యం చేస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీల ఆర్థిక, రాజకీయ సాధికారతను అడ్డుకునే విధంగా వ్యవహరిస్తోంది.

ఇది ఆత్మగౌరవ పోరాటం

రాష్ట్ర కేంద్ర మంత్రులు బీసీల తరఫున మాట్లాడి ఆర్డినెన్స్ తేవాలని ప్రధాని మోడీపై ఒత్తిడి చేయాలి. లేదంటే చరిత్ర హీనులుగా మారే అవకాశం ఉంది. బీసీల డిమాండ్లు విస్మరించిన పక్షంలో గ్రామ స్థాయి నుంచే వ్యతిరేకత ఉప్పొంగనుంది. బీసీలకే ప్రత్యేకంగా క్రిమి లేయర్ విధించడం, బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకపోవడం, కులగణనను పట్టించుకోకపోవడం బీజేపీ బీసీ వ్యతిరేక ధోరణికి నిదర్శనం. దేశంలో బీసీలు మెజారిటీ అయినా వారిని లెక్కించాలన్న డిమాండ్‌పై కేంద్రం ఆలస్యం చేయడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మారింది. ఇది కేవలం రిజర్వేషన్ల కోసం మాత్రమే కాదు. ఇది ఒక సామాజిక న్యాయం కోసం జరుగుతున్న ఆత్మ గౌరవ పోరాటం. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఇంకా వెనకబాటుతనంలోనే కొనసాగుతున్నాయి. అందుకే బీసీ రిజర్వేషన్లు తప్పనిసరి.

నాయకులు తమవంతు ప్రయత్నం చేస్తున్నా..

నిజానికి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపునకు, విద్యా ఉద్యోగాల్లో బీసీల వెనకబాటుతనంపై లోతైన సమకాలీన అధ్యయనం చేయాలని, రాజ్యాంగంలోని నిబంధనలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి స్థానిక సంస్థల వారీగా దామాషా పద్ధతిలో కల్పించాల్సిన రిజర్వేషన్లను ప్రతిపాదించాలని రిటైర్డ్‌ ఐఏఎస్‌ బూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్‌ రిజర్వేషన్లను పెంచడానికి కారణాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి సమర్పించింది. బీసీ బిల్లులపై జాతీయ పార్టీల ఆమోదం కోసం బీసీ నేతలు కూడా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పోరాడుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం రిజర్వేషన్లు 50% మించొద్దని బీజేపీ తెలంగాణ చీఫ్ రాంచందర్ రావు ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీ ఇచ్చిందని ఆయన అనడం సిగ్గుచేటు. ఒక వైపు బీసీ బిల్లుకు బీజేపీ పార్టీ అడ్డుపడుతూ మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు మోపుతోంది.

ఈ నాటకాలను బీసీలు గమనించాలి..

త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ చెబుతోంది. బీజేపీ మాత్రం పట్టించుకోవడం లేదు. కావాలనే బీసీ రిజర్వేషన్ విషయంలో దాటవేత వైఖరిని ప్రదర్శిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మైనారిటీ రిజర్వేషన్లను అడ్డంపెట్టి బీసీలకు అన్యాయం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. త్వరలో బీసీ రిజర్వేషన్‌పై మద్దతు తెలపకపోతే క్షేత్ర స్థాయిలో కమలం పార్టీ ఉనికి కనుమరుగు అవుతుంది. కేంద్రాన్ని ఒప్పించాల్సిన బాధ్యత తెలంగాణ బీజేపీ ఎంపీలపై ఉంది. బీజేపీ దొంగ నాటకాన్ని బీసీలు గమనించాలి. బీసీలకు వెన్నుపోటు పొడుస్తున్న బీజేపీ నాయకులను శిక్షించాల్సిందే!!

- దుండ్ర కుమార స్వామి

99599 1234

Next Story