అర్ధరాత్రి.. స్వాతంత్య్రం ఎందుకు?

by Disha edit |
అర్ధరాత్రి.. స్వాతంత్య్రం ఎందుకు?
X

బ్రిటిష్ పాలకులు దాదాపు 200 సంవత్సరాలకు పైగా మన దేశాన్ని పాలించి భారతీయులను పీల్చి పిప్పి చేస్తూ, మన సంపదను దోచుకుంటున్న నేపథ్యంలో ఎందరో నాయకులు ఎన్నో పోరాటాలు చేశారు. దేశానికి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను కల్పించాలని తమ ప్రాణాలను అర్పించారు. 1940 నాటికి గాంధీ ఉద్యమం, నేతాజీ ఇండియన్ నేషనల్ ఆర్మీ బ్రిటిష్ పాలకులు, ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపాయి.

ఆర్థికంగా బలహీనపడటంతో..

రెండవ ప్రపంచ యుద్ధం ముగింపులో ఉండగా బ్రిటన్ ఆర్ధికంగా బలహీనపడింది. దీంతో స్వదేశాన్నే పరిపాలించుకొనేందుకే బ్రిటిష్‌లో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అప్పటివరకూ తమ ఆధీనంలో ఉన్న బ్రిటిష్ కాలనీలను వదిలేసింది. ఆ సమయంలో నే 1945 సంవత్సరంలో బ్రిటిష్ కొత్త ప్రభుత్వానికి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో గెలిస్తే ఇంగ్లీష్ కాలనీలతో సహా భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రాన్ని ఇస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. ఆ పార్టీనే ఘనవిజయం సాధించింది. దీంతో భారతదేశానికి 1948 జూన్ 30న సంపూర్ణ స్వేచ్ఛా,స్వాతంత్య్రాలు ఇస్తామంటూ బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కానీ బ్రిటిష్ వైస్రాయ్‌గా వున్న లార్డ్ వెవేల్‌కు మన దేశ జాతీయ నాయకులకు మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో వైస్రాయ్‌గా బ్రిటిష్ ప్రభుత్వం లార్డ్ మౌంట్ బాటెన్‌ను నియమించి ఎన్నో చర్చలు సంప్రదింపులు జరిపింది. ఆ చర్చల్లో నాటి భారత ఉపఖండంలో పాక్ భారత్ విభజన జరగాలంటూ జరిగిన చర్చల్లో నెహ్రూ జిన్నాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. జిన్నా నాయకత్వంలో పాక్‌ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తుండడంతో దేశంలోని పరిస్థితులు శాంతి భద్రతలు చేయి దాటిపోతున్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం ఆర్థికంగా బలహీనపడింది. అంతే కాక దేశంలో మత ఘర్షణలు చెలరేగుతున్న నేపథ్యంలో పరిస్థితులను గమనించిన మౌంట్ బాటెన్ 1948 జూన్ 30 తేదీ నుండి దాదాపు ఒక సంవత్సర కాలాన్ని ముందుకు జరిపి 1947 ఆగష్టు 15న మనదేశానికి స్వాతంత్ర్యం ఇస్తామని ప్రజలకు వాగ్దానం చేసాడు. వాగ్దానం చేసిన మరునాడే జూన్ 4న ఇండియన్ ఇండిపెండెన్స్ బిల్‌పై బ్రిటన్ పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది.

ఆగష్టు 15 నే ఎందుకు?

1947లో ఆగష్టు లేదా సెప్టెంబర్‌లో మనదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలని మొదట అనుకున్నా ఆగష్టు నెలనే నిర్ణయించడానికి కారణం.. రెండవ ప్రపంచ యుద్ధంలో అల్లైడ్ ఫోర్స్ దేశాల( ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్, యునైటెడ్ స్టేట్స్, సోవియట్ యూనియన్, చైనా) జట్టుకు కమాండర్‌గా వున్న లార్డ్ మౌంట్ బాటెన్ ముందు 1945, ఆగష్టు15‌న జపాన్ ఎంపరర్ ‘హిరోహితో’ నాయకత్వంలో జపాన్ ఆర్మీ లొంగిపోయి మోకరిల్లింది. ఇది మౌంట్ బాటెన్‌కు లక్కియస్ట్ డేగా తన జీవితంలోనూ, ప్రపంచ చరిత్రలో నిలిచిపోయిన రోజు అందుకే ఈ తేదీని ఎంపిక చేశారు.

మరి అర్థరాత్రే ఎందుకంటే.. మన దేశ సంప్రదాయం, హిందూ కాలమానం, జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం.. సూర్యోదయంతో రోజు ప్రారంభం అవుతుందని, 15వ తేదీతో మనదేశానికి మేలు జరగదని, శుభపరిణామం కాదని 14వ తేదీ మంచిదని సూచించారు. కానీ ఆంగ్లేయుల క్యాలెండర్ ప్రకారం అర్ధరాత్రి 12గంటలతో రోజు ప్రారంభం అవుతుంది. మద్యే మార్గంగా మంచి రోజైన 14వ తేదీన ముందుగానే నెహ్రూ తన చారిత్రక ప్రసంగం మొదలుపెట్టి సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ముగించటంతో ప్రపంచమంతా నిదురిస్తున్న వేళ ఆగష్టు 15 వ తేదీ ప్రారంభ సమయంలో భారతీయులకు విముక్తి లభించింది. ఆ విధంగా మన దేశానికి అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చింది.

కొల్లు లక్ష్మీ నారాయణ,

పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారుడు,

99898 64764

Next Story

Most Viewed