2వేల నోటు ఉపసంహరణ ప్రయోజనమేంటి!?

by Disha edit |
2వేల నోటు ఉపసంహరణ ప్రయోజనమేంటి!?
X

టీవల ఆర్బీఐ రూ.2 వేల నోట్లను సర్క్యులేషన్ నుంచి తొలిగిస్తున్నట్లుగా ప్రకటించడం దేశవ్యాప్తంగా చర్చ అయింది. అయితే ఆర్బీఐ ఈ నోట్లను రద్దు చేయడం లేదని కేవలం సర్క్యులేషన్ నుండి తొలగిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది. ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను నిన్నటి నుంచి మార్చుకునే అవకాశాన్ని కలిపించింది. ప్రజలు ఒకసారి గరిష్టంగా పది రూ.2 వేల నోట్లను అంటే 20 వేల రూపాయలను సమీప బ్యాంకుకు గానీ, దేశంలోని 19 ఆర్బీఐ కేంద్రాలలో గానీ ఎక్చేంజీ చేసుకోవచ్చని తెలిపింది.

క్లీన్ నోట్ పాలసీలో భాగంగా..

అయితే ప్రస్తుతం దేశంలో 3.62 లక్షల కోట్ల రెండువేల రూపాయల నోట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ డబ్బుని సర్క్యులేషన్ లో కాకుండా దాచుకునేందుకు వినియోగిస్తున్నారని చాలాకాలంగా విమర్శలు ఎదుర్కొంటుంది కేంద్రం. నిజానికి ఈ నోట్లను రద్దుచేయాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. అయితే కేంద్రం మాత్రం 2019 నుండి ఈ నోట్ల ముద్రను ఆపివేసి ‘క్లీన్ నోట్ పాలసీ’లో భాగంగా ఏదైనా నోటు జీవితకాలం 4 నుండి 5 సంవత్సరాలని అందుకే 2019 లో ముద్రణ ఆపివేసిన నోట్లని చెలామణి నుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయించామని పేర్కొంది. అయితే నోట్లరద్దు సమయంలో రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఆధ్వర్యంలోని కరెన్సీ ముద్రణాలయాలు నిర్విరామంగా పనిచేసినా అంత భారీ స్థాయిలో కరెన్సీని త్వరగా ముద్రించడం కష్టమే. దీంతో రూ.2 వేల నోట్ల ముద్రణను మొదలుపెట్టిన ఆర్బీఐ క్రమంగా ఆ నోట్ల ప్రింటింగ్ తగ్గించింది. 2016 నుండి 2వేల నోట్లను ముద్రిస్తున్న ఆర్బీఐ 2019 నుంచి ఈ నోట్ల ముద్రణను పూర్తిగా నిలిపివేసింది. నిజానికి రిజర్వు బ్యాంకు మహాత్మా గాంధీ సిరీస్ కొత్త నంబరింగ్ సిస్టంతో కూడిన అన్ని డినామినేషన్ కరెన్సీ నోట్లను 2005లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వీటిలోని సెక్యూరిటీ ఫీచర్లు చాలా స్పష్టంగా కనిపించేవి. దీంతో అసలు నోట్లకు నకిలీ నోట్లకు మధ్య ఉన్న తేడాలను సాధారణ ప్రజలు సైతం సులభంగా గుర్తించగలిగేవారు. కానీ, 2016 లో బీజేపీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దుచేసి రూ.2 వేల నోట్లను ప్రవేశపెట్టిన తర్వాత నకిలీ నోట్ల చలామణి ఏకంగా 107 రెట్లు పెరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా 2016లో 2.272 నకిలీ రూ.2 వేల నోట్లు పట్టుబడ్డాయని, 2020లో వీటి సంఖ్య ఏకంగా దాదాపు 2.45 లక్షలకు చేరినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ లో వెల్లడించింది.

రద్దుతో ప్రజలకు దక్కే ఫలాలు!

సాధారణంగా నోట్ల రద్దు వల్ల ఒక్క ప్రభుత్వమే ప్రయోజనం పొందదు. ప్రజలు కూడా దాని ఫలాలు పొందుతారు. 2016లో జరిగిన నోట్ల రద్దు ప్రభావం. దేశంలోని సామాజిక, ఆర్థిక అంశాలను కూడా ప్రభావితం చేసింది. అలాగే సాధారణ, మధ్యతరగతి ప్రజలు కూడా సమస్యలు అనుభవించారు. కానీ ఈ నోట్ల రద్దు ప్రభావం వల్ల నల్ల కుబేరుల నుండి స్వాధీనం చేసుకున్న సొమ్మును ప్రభుత్వం దేశంలో మౌలిక వసతుల ప్రాజెక్టులపై వెచ్చించడం వల్ల పౌరులకు పలు సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. నోట్ల రద్దు వల్ల డబ్బు విషయంలో భారతీయుల ఆలోచనా ధోరణిలో పెనుమార్పులు కూడా సంభవించి, ఇళ్లలో నోట్లను దాచుకుంటూ వచ్చిన ప్రజలు ఇకపై వాటిని బ్యాంకుల్లో దాచుకోవడం మొదలుపెట్టారు. దీని వల్ల బ్యాంకులు క్యాష్ రేషియో ఊపందుకుంది. వడ్డీ ఆదాయ మార్జిన్లు పెరిగాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల పన్నులు కట్టే వారి సంఖ్య కూడా పెరిగింది. దీనివల్ల ప్రభుత్వానికి నిధుల రాబడి పెరిగింది. అభివృద్ధి పనుల కోసం అప్పులు చేయాల్సిన అగత్యం తగ్గి తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మెల్లిమెల్లిగా మెరుగుపడుతుంది. 2016 నోట్ల రద్దు ప్రభావం వల్ల నగదు లావాదేవీలు తగ్గి డిజిటల్ లావాదేవీలు కుడా పెరిగాయి. కార్డుల ద్వారా చెల్లింపులు బాగా పెరగడం వల్ల వినియోగ వస్తువుల ధరలు కూడా కొంత వరకు తగ్గాయి. ఇప్పటి వరకు ఆస్తుల క్రయవిక్రయాలన్నీ నగదు రూపంలో జరుగుతుండేవి. పెద్ద నోట్ల రద్దు వల్ల ఇకపై అవన్నీ తప్పనిసరిగా డిజిటల్ రూపంలో జరగాల్సిన అవసరం ఏర్పడింది. నగదు కొరత వల్ల ప్రజలు ప్రత్యామ్నాయ లావాదేవీలపై దృష్టి సారించారు. పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే ఈ వ్యాలెట్ యాప్స్‌కు డిమాండ్ కుడా పెరిగింది. వాటితోపాటు ఇ-బ్యాంకింగ్ లాంటి ఆన్ లైన్ లావాదేవీలు, ప్లాస్టిక్ మనీ (డెబిట్, క్రెడిట్ కార్డులు) వాడకం ఎక్కువ అయింది. ప్రస్తుతం రద్దు చేసిన ఈ 2 వేల నోట్లతో సాధారణ, మధ్య తరగతి ప్రజలకు పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చునని విశ్లేషకులు అభిప్రాయం, కానీ దీని ప్రభావం ఎంత వరకు ఉంటుందో చూడాలి. నల్ల ధనం నియంత్రణ, నకిలీ నోట్ల నిర్మూలనే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరు హర్షణీయం.

డా. కందగట్ల శ్రవణ్ కుమార్

8639374879

Next Story

Most Viewed