కాళేశ్వరం విషాదం ఎవరి పాపం?

by Ravi |   (  Updated:2025-08-19 01:16:10  IST  )

ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలు అన్నది దేశ ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, అదే స్ఫూర్తితో దేశంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టారు.

కాళేశ్వరం విషాదం ఎవరి పాపం?
X

ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలు అన్నది దేశ ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, అదే స్ఫూర్తితో దేశంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టారు, బాక్రానంగల్, హీరాకుడ్, ఇడుక్కి, నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్సారెస్పీ, నిజాం సాగర్ వంటి ఎన్నో ప్రాజెక్టులు, కోటా బ్యారేజీ, హరికే బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్‌లు వంటివి. దేశాన్నే ఆధునిక వ్యవసాయ క్షేత్రంగా మార్చడానికి నిర్మించిన చరిత్ర ఆ ప్రభుత్వాలది.

నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జల దోపిడీ జరుగుతోందని తెలంగాణ తెచ్చుకున్నాం. అయితే తెచ్చుకున్న తెలంగాణలో అవగాహనా రాహిత్యంతో, ఏకపక్ష నిర్ణయాల వలన పూడ్చుకోలేని నష్టం జరిగింది. మొదలు పెట్టిన ప్రాజెక్టులను వదిలేసి రీడిజైన్ పేరుతో గత ప్రభుత్వాధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసాయి, దానికి ఉదాహరణే కాళేశ్వరం ప్రాజెక్టు. జూలై మాసాంతంలో జస్టిస్ పీసీ ఘోష్, అంతకుముందు ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టులతో ఇది తేటతెల్లమైంది.

గత పాలకులది క్షమించరాని నేరం

కేసీఆర్ ప్రభుత్వం, తుమ్మిడిహట్టి నుండి దాదాపు 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తక్కువ ఖర్చుతో నిర్మించే అవకాశం ఉండి కూడా దాన్ని వదిలేసి తెలంగాణ ప్రయోజనం కోసమంటూ రీడిజైన్ చేసి మేడిగడ్డ నుండి కాళేశ్వరం మొదలు పెట్టారు. అయితే తాను తీసుకున్న నిర్ణయం టెక్నికల్‌గా తప్పుడు నిర్ణయం అని అనాడు రిటైర్డ్ ఇంజనీర్లు, మొన్న ఎన్డీఏస్ఏ, నిన్న ఘోష్ కమిషన్లు తేల్చారు. పోనీ ప్రాజెక్టు నిర్మాణమైనా.. క్వాలిటీతో కట్టారా అంటే అదీ లేదు.. ఎంతో లోపభూయిష్టంగా ప్రాజెక్టు నిర్మాణం జరిగిందనేది ఈ నివేదికలు తేల్చాయి. కానీ కేవలం ఒక పిల్లర్ మాత్రమే కుంగిందని కేసీఆర్ కుటుంబ సభ్యులు దాన్ని ప్రాపగండ చేయాలనుకుంటున్నారు. అయితే ఎన్డీఏస్ఏ, పీసీ ఘోష్ ఇచ్చిన రిపోర్టులు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి, ప్రజలు ఎన్నటికీ క్షమించలేని నేరం ఇందులో కనిపిస్తుంది.

కమీషన్ల కోసం విపరీత జోక్యం..

2025 ఏప్రిల్ 24న ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టు, జూలై 31న ఘోష్ కమిషన్ కాళేశ్వరంలోని నిర్మాణ లోపాల్ని తేటతెల్లం చేసాయి. వీయరింగ్ కోట్ మెటీరియల్ ఎలా దెబ్బతిన్నది, పిల్లర్లలో ఏర్పడ్డ బారీ క్రాక్స్, అప్రాన్ డామేజీలు 18 నుండి 21 వరకూ పిల్లర్లు దెబ్బతిన్న విధానంతో పాటు డిజైన్ లోపాలు, నిర్మాణ లోపాలు, క్వాలిటీ కంట్రోల్ వైఫల్యం ఇలా ప్రతీ అంశంలో డ్యామ్ భద్రతలపై నాటి సర్కార్ చూసిన నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపింది. అంతేకాకుండా క్రెడిట్ కోసం, కమిషన్లు త్వరగా దక్కించుకోవడం కోసం నాటి ప్రభుత్వ పెద్ద చేసుకున్న విపరీతమైన జోక్యాన్ని ఈ రిపోర్టులు ఎండగట్టాయి. ఇవి కేవలం మేడిగడ్డ బ్యారేజీకే పరిమితం కాలేదని, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ ఇలాంటి వైఫల్యాలే ఉన్నాయని స్పష్టం చేసింది.

డీపీఆర్‌లోనే తీవ్ర నిర్లక్ష్యం

ప్రాజెక్టు నిర్మాణంలో డీపీఆర్‌ది కీలకపాత్ర. ఏడాదికి పైగా పట్టే డీపీఆర్ తయారీని తూతూ మంత్రంలా నాలుగు నెలల్లో చేయడం, ఏ స్టడీని సంపూర్ణంగా చేయకపోవడం, ఇదే పెద్ద తప్పంటే ఇక బ్యారేజీల నిర్మాణ సమయంలో ఇష్టానుసారం మార్పులు చేయడం, ఏకంగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను డీపీఆర్ సూచించిన స్థానంలో కాకుండా 2.2 కిలోమీటర్లు, 5.4 కిలోమీటర్లకు దిగువన నిర్మించడం, 85 బోర్ హోల్స్ టెస్ట్ కావాల్సిన చోట కేవలం 6 బోర్ హోల్స్ టెస్ట్ చేయడం, సీడీవో తనిఖీలకు ఆటంకం కలిగించడం, షీట్ పైల్స్ స్థానంలో సీకేంట్ ఫైల్స్ ఏర్పాటుతో భారీ ఇసుక మేటలు ఏర్పడ్డాయి. కేవలం ప్రచారం కోసం బ్యారేజీల్లో నీళ్లను నిల్వ చేసి అవి మరింత డ్యామేజీ అవడానికి కారకులయ్యారు.

కాళేశ్వరంతోనే పంటలు పండాయా?

ఇన్ని రోజులు కాళేశ్వరం వల్లనే వరి పండుతున్నట్టుగా, అత్యధిక దిగుబడులు వచ్చినట్టుగా తప్పుడు ప్రచారాన్ని చేసుకున్న బీఆర్ఎస్ నేతలు, గత ఏడాదిగా కాళేశ్వరం‌లోని మొదటి బ్యారేజి కుంగి, కూలిపోతుండడంతో బ్యారేజీ గేట్లను పూర్తిగా తెరిచి ఉంచాల్సిన పరిస్థితిని చూస్తున్నాం. మేడిగడ్డ నుండి చుక్కనీరు రాకున్నా.. కేవలం గత కాంగ్రెస్ హయాంలో కట్టిన ఎల్లంపల్లి, మిడ్ మానేరుల నుండే మిగతా రిజర్వాయర్లకు నీళ్లు అందాయనేది స్పష్టంగా కనబడు‌తున్నది. గత సంవత్సరాల కన్నా అత్యధికంగా దాదాపు నూట యాభై లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రావడమే కాకుండా అందులో సన్న వడ్లను పండించారు తెలంగాణ అన్నదాతలు. అంటే ఇన్ని రోజులు కేవలం కాళేశ్వరం వల్లనే పంటలు పండుతున్నాయనేది గోబెల్స్ ప్రచారమని తేటతెల్లం అయింది. బీఆర్ఎస్ నేతలు తప్పును కప్పిపుచ్చుకొని మళ్లీ ప్రజల్లో మనుగడ సాగించాలనే కుయత్నం తప్పా దీంట్లో మరేమీ కనబడడం లేదు.

బ్యారేజీలను రిజర్వాయర్లుగా మారిస్తే..

దేశంలో ఎక్కడైనా బ్యారేజీలు అనేవి రన్ ఆఫ్ రివర్ ప్రాజెక్టులు‌గానే ఉంటాయి. అంటే నదీ ప్రవాహాన్ని నిలపడం కాకుండా, డైవర్ట్ చేసే విధంగా ఉంటాయి. అలా కాకుండా బ్యారేజీలను ఏకంగా రిజర్వాయర్లుగా మార్చే తప్పుడు నిర్ణయంతో ఇసుకపై మేడలు కట్టడం దేశంలో ఇది ఒక్కటే. గత సంవత్సరన్నరలో బ్యారేజీల నుండి చుక్కనీరు తీసుకోకున్నా ఇరవై వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ప్రపంచంలో ఇంత తప్పిదం ఏ దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయవు.. ఇంత తప్పు చేసిన వారికి శిక్షలు వేయకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. తెలంగాణ కాపలా కుక్కలమని చెప్పుకునే తెలంగాణ స్వయం ప్రకటిత మేధావి నిర్వాకం, అహంభావం వలన కాళేశ్వరం అనే ప్రాజెక్టు ముమ్మాటికి శనేశ్వరం (కూలేశ్వరం) అయ్యింది. తెలంగాణ ప్రజలు కన్న కలలకు విషాదం మిగిలింది.

-పున్నా కైలాస్ నేత

జనరల్ సెక్రటరీ, టీపీసీసీ

94921 87210

Next Story