తెలంగాణ జాతిపిత ఎవరు?

by Ravi |   (  Updated:2026-02-12 01:16:11  IST  )

తెలంగాణ జాతిపిత ఎవరు?’ ఈ ప్రశ్న అడిగే ముందు ఒకసారి ఆగి 1200కి పైగా అమరులను, విశ్వవిద్యా లయ గేట్ల దగ్గర రక్తంతో తడిసిన నేలను, ఊళ్లలో నినాదాల మధ్య కన్నీళ్లు తుడుచుకున్న తల్లులను గుర్తు చేసుకోవాలి.. తెలంగాణ ఒక నాయకుడి కల కాదు.. అది ఒక తరం నిద్రలేని రాత్రులు, త్యాగాలతో నిండిన ఉదయాలు.. ఇంతటి గొప్ప పోరాటాన్ని ఒకరికి వ్యక్తిగతంగా ఆపాదించి ఒకరి పేరు పెట్టి ఈ పోరాటాన్ని ముగించేసి ఉద్యమాల స్ఫూర్తిని చంపేయవద్దు!

తెలంగాణ జాతిపిత ఎవరు?
X

‘తెలంగాణ జాతిపిత ఎవరు?’ ఈ ప్రశ్న అడిగే ముందు ఒకసారి ఆగి 1200కి పైగా అమరులను, విశ్వవిద్యా లయ గేట్ల దగ్గర రక్తంతో తడిసిన నేలను, ఊళ్లలో నినాదాల మధ్య కన్నీళ్లు తుడుచుకున్న తల్లులను గుర్తు చేసుకోవాలి.. తెలంగాణ ఒక నాయకుడి కల కాదు.. అది ఒక తరం నిద్రలేని రాత్రులు, త్యాగాలతో నిండిన ఉదయాలు.. ఇంతటి గొప్ప పోరాటాన్ని ఒకరికి వ్యక్తిగతంగా ఆపాదించి ఒకరి పేరు పెట్టి ఈ పోరాటాన్ని ముగించేసి ఉద్యమాల స్ఫూర్తిని చంపేయవద్దు!

ఈ వ్యాసం ఉద్దేశం ఒక నాయకుడిని కూల్చేందుకు కాదు.. నిలబెట్టేందుకు కాదు. తెలంగాణ చరిత్రను నిలబెట్టేందుకు మాత్రమే.. తెలంగాణ ఎవరి దయతో వచ్చిన రాష్ట్రం కాదు, ఎవరి రాజకీయ ప్రాజెక్టు కాదు, ఇది ప్రజల రక్తంతో, కన్నీళ్లతో, పోరాటంతో వచ్చిన గుర్తింపు.. తెలంగాణ అంటే ఒక సమూహ చైతన్యం, చరిత్రను వాడుకోవచ్చు.. కానీ చరిత్రను స్వంతం చేసుకోలేరు.

తెలంగాణ ఉద్యమం..

తెలంగాణ ఉద్యమం.. 60 దశాబ్దాల పోరాటం, ఈ పోరాటం 1948లోనే ప్రజల గుండెల్లో మొదలైంది. అంతేకానీ 2001లో ఏర్పడిన పార్టీ కథ కాదు.. ఒక కుటుంబం రాజకీయ ప్రాజెక్టు కాదు. 1948–51 విలీ నానంతర ఆర్థిక-సామాజిక దోపిడీ, 1969 మొదటి తెలంగాణ ఉద్యమం, ముల్కీ నిబంధనల ఉల్లంఘనలు, నీళ్లు, నిధులు, నియామకాలపై వివక్షలు, 1990ల తర్వాత నూతన తరం ఉద్యమం, ఈ దీర్ఘ ప్రయాణంలో లక్షల మంది సామాన్య ప్రజలు భాగస్వాములయ్యారు..

స్వీయ గౌరవం కోసం..

ఈ పోరాటానికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమానికి తాత్విక పునాది, తెలంగాణ రాష్ట్ర పోరాటం ‘ఇది ప్రాంతీయ విద్వేషం కాదు.. ఆర్థిక న్యాయం’ అని దేశానికి అర్థమయ్యేలా చెప్పిన మహోన్నత వ్యక్తి. ఏ పదవీ కోరలేదు.. తెలంగాణ అంటే ఆయన పేరు విడదీయలేనిది. ఇక కొండ లక్ష్మణ్ బాపూజీ, తెలంగాణ స్వాభిమానానికి నిలువెత్తు సాక్ష్యం. పార్టీలకతీతంగా ఉద్యమానికి అండగా నిలిచినవాడు. అధికారంతో కాదు త్యాగంతో గుర్తింపు పొందినవాడు. తెలంగాణ ప్రజల గుండెల్లో మోగిన తెలంగాణ స్వరం గద్దర్‌ది, తెలంగాణ ఉద్యమంలో ఆయన మాటలు కాదు.. ఆయన పాటలే ఆయుధాలు, సభలు కాదు.. జనాల గుండెల్లోనే వేదికలు.. 1200పైగా యువకులు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగాల కోసం కాదు, పదవుల కోసం కాదు, వాళ్లు చనిపోయింది స్వీయ గౌరవం కోసం, నీటి కోసం, ఉద్యోగాల కోసం, తెలంగాణ తనదైన పాలన కోసం తమ జీవితాలను త్యాగం చేశారు. వీరి దగ్గర పదవుల ఆశ లేదు, కుటుంబ లాభం లేదు, భద్రత లేదు, ఉన్నది ఒక్కటే తెలంగాణ బతకాలి!

జాతిపిత.. బిరుదా! బాధ్యతా?

జాతిపితకు అర్థం, ఆ భూమి కోసం వ్యక్తిగత లాభం లేకుండా జీవితం అర్పించినవాడు, ప్రజల ఆకాంక్షను తన శ్వాసగా మార్చుకున్నవాడు.. అంతేకానీ కేవలం ‘రాష్ట్రం తెచ్చాడు’ అన్న ఒక్క దానికి జాతిపిత వాక్యం సరిపోదు, ప్రపంచ చరిత్రలో జాతిపిత అనే పదం స్వయం ఘోషిత బిరుదు కాదు.. అది ప్రజలు ఇచ్చే గుర్తింపు, కాలం పరీక్షించి ఇచ్చే తీర్పు, అధికారానంతరం కూడా నిలిచే గౌర వం, జాతిపితకు కనీస ప్రమాణాలు ఉండాలి. ఉద్యమానికి ఆలోచనా దిశ ఇవ్వాలి, ఉద్య మంలో త్యాగం ఉండాలి, ఉద్యమ ఫలితం వచ్చిన తర్వాత స్వార్థం లేకుండా పాలన ఉండాలి, ప్రజల కలలు వ్యక్తిగత సంపదగా మారకూడదు, ఈ నాలుగు ప్రమాణాల్లో కనీసం ఒకటి తడబడినా జాతిపిత అనే మాట అర్థం కోల్పోతుంది.

కేసీఆర్‌ పాత్ర కాదనలేం.. కానీ

ఇక్కడ భావోద్వేగాలు కాదు.. వాస్తవాలు మాట్లాడాలి. కేసీఆర్ 2001లో టీఆర్ఎస్ స్థాపించి, అటకెక్కిన తెలంగాణ వాదాన్ని మళ్లీ ప్రధాన రాజకీయ అజెండాగా మార్చారు. 2009లో ఆయన చేపట్టిన దీక్ష దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రకటన చేసేలా ఒత్తిడి తెచ్చింది. పార్లమెంటులో బిల్లు పాస్ అయ్యే వరకు ఆయన చేసిన రాజకీయ వ్యూహాలను అభినందించాల్సిందే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి రాజకీయంగా క్లైమాక్స్ సృష్టించిన నాయకుడు కేసీఆర్.. ఇది తిరస్కరించలేని నిజం. అయితే రాష్ట్రం ఏర్పడ్డాక, ఉద్యమకారుల ప్రాధాన్యం తగ్గింపు, కుటుంబ పాలన, అధికార కేంద్రీకరణ లాంటి కారణాలు కేసీఆర్‌ను జాతిపితగా నిలబెట్టలేవు.. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ జాతిపిత గురించి మాట్లాడిన మాటలు రాజకీయంగా ఘాటు విమర్శ, ప్రజల్లో ఉన్న కోపానికి ప్రతిధ్వని కావొచ్చు.. అయితే ఆయన కూడా తన పాలన గత ప్రభుత్వం లాగా కాకుండా ఉద్యమ ప్రమాణాలకు లోబడి చేస్తున్నట్లు నిరూపించాలి.

చరిత్రను వాడుకోవచ్చు కానీ..

ప్రజలు ఎవరిని జాతిపితగా భావిస్తున్నారు? అనేదానికి సమాధానం.. తెలంగాణ ఎవరి దయతోనో వచ్చిన రాష్ట్రం కాదు, ఎవరి రాజకీయ ప్రాజెక్టూ కాదు, ఇది ప్రజల రక్తంతో, కన్నీళ్లతో, పోరాటంతో వచ్చిన గుర్తింపు. తెలంగాణకు ఒక నాయకుడు ఉన్నాడు, ఒక పార్టీ ఉంది, కానీ జాతిపిత అనడానికి సరిపడే ప్రమాణాలు మాత్రం ఒక వ్యక్తిలో లేవు.. తెలంగాణ జాతిపిత అంటే, ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచన, కొండ లక్ష్మణ్ బాపూజీ పోరాటం, గద్దర్ గానం, 1200 మంది అమరుల త్యాగం, లక్షల మంది ప్రజల సహనం, ఇది ఒక్క ముఖం కాదు. ఇది ఒక సమూహ చైతన్యం, జాగ్రత్తగా గుర్తుంచుకోండి, చరిత్రను వాడుకోవచ్చు.. కానీ చరిత్రను స్వంతం చేసుకోలేరు.

- డాక్టర్. కేశవులు ఎండీ ( సైకియాట్రీ)

చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం

85010 61659

Next Story