- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అగ్రవర్ణాలతో.. ఇడుపు కాయితం ఎప్పుడు?
ఇడుపు కాయితం’ సినిమా శీర్షిక వివాదం నేపథ్యంలో తెలంగాణ భాష, సంస్కృతి, ప్రాంతీయ గుర్తింపు, బహుజన సామాజిక న్యాయం, సినిమా రంగంలో ప్రాతినిధ్యం, కుల ఆధిపత్యం వంటి అంశాలను విశ్లేషించిన వ్యాసం.

ఇటీవల ‘ఇడుపు కాయితం’ సినిమా శీర్షిక చుట్టూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలంగాణ భాష, యాస, సంస్కృతిని అవమానించే ప్రయత్నమని కొందరు విమర్శిస్తుంటే, మరికొందరు ఇది సృజనాత్మక స్వేచ్ఛలో భాగమని వాదిస్తున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేస్తూ "సాంస్కృతిక ఆధిపత్యం ఇంకా కొనసాగుతోంది" అనే అభిప్రాయాన్ని తెలంగాణ బహుజన మేధావులు, కవులు, కళాకారులు, రచయితలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ మధ్య తెలంగాణలో ప్రతిష్టించిన బాలసుబ్రమణ్యం, ఎన్టీఆర్ విగ్రహాలపై కూడా ఇదే రకమైన చర్చ జరిగింది. ఇలాంటి భాష, సాంస్కృతిక ప్రతీకలపై విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఒక కీలక ప్రశ్న వినిపిస్తుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ భాష, యాస, సంస్కృతి కోసం జరిగిన పోరాటం వల్ల బహుజన సమాజానికి ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఏ మేరకు సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత లభించింది? మరి ఇప్పుడు కూడా ఆనాటి భావో ద్వేగాలతో వెళ్లడం సరైనదేనా?
సమాన భాగస్వామ్యం ప్రధానాంశం!
సమాజంలో ఏ అంశంలోనైనా ‘ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ’ చాలా ముఖ్యం. ఇప్పుడు జనాభా దామాషా ప్రకారం భూమి, విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం, వనరులపై సమాన హక్కులు, నిర్ణయాధికారం వంటి అంశాలు అత్యవసరమైనవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం "నీళ్లు–నిధులు–నియామకాలు"తో పాటు సాంస్కృతిక ఆత్మగౌ రవాన్ని కూడా ప్రధాన అంశంగా ముందుకు తెచ్చింది. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూమి, సంపద, రాజకీయ, విద్య, ఉద్యోగ అవకాశాల్లో అణగారిన వర్గాల ప్రాతినిధ్యం ఏ మేరకు ఉందనే ప్రశ్న ఇప్పటికీ పలువురుని వేధిస్తుంది. అణచివేత ఆగడం లేదు. ఒక ప్రాంతంలో సామాజిక న్యాయం దృష్టితో చూస్తే కేవలం భాషా గుర్తింపే సరిపోదని సామాజికవేత్తల భావన. ఇది అసలు సమస్య కూడా కాదు. అధికారంలో, వనరుల్లో, అవకాశాల్లో సమాన భాగస్వామ్యం ప్రధానాంశం. ‘ఇడుపు కాయితం’ సినిమా టైటిల్‌పై జరుగుతున్న చర్చలో ప్రజలకు నాదొక ప్రశ్న? అసలు తెలుగు సినిమా పరిశ్రమలో అణగారిన వర్గాలకు వాటా ఉందా?
అణగారిన వర్గాల్లోంచి హీరోలేరీ?
సినిమా రంగాన్ని తరిచి చూసినప్పుడు అందులోని కళ రూపాలన్నీ కూడా సబ్బండ కులాల సాంస్కృతికతతో ముడిపడి ఉన్నాయి. కానీ చిత్రసీమలో వారికి స్థానం లేదు. అత్యధికంగా ఉన్నత కులాల నుంచి హీరోలు, దర్శకులు, నిర్మాతలవు తున్నారు. అణగారిన కులాల్లో నుంచి అక్కడక్కడ కమెడియన్లు, రౌడీలు వంటి చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్టులుగానే తీసుకుంటారు. టాలీవుడ్‌లో ఇప్పటివరకు రెండు, మూడు కులాలే రాణిస్తున్నాయి. ఎందుకగా ఏ కులాలు పాలిస్తారో వారే అన్ని రంగాల్లో ముందుంటారు. అలాంటప్పుడు బహుజనులకు సినిమా భాష, సాంస్కృతిక పోకడలపై చర్చ అవసరమా? ఇప్పటి వరకు అగ్రకులాల నాయకత్వంలో నడిచిన తెలంగాణ ఉద్యమం, వామపక్ష ఉద్యమం, మావోయిస్టు ఉద్యమాలు ఉపరి తలం సమస్యలనే ప్రధాన అంశాలుగా చిత్రీకరించారు. కానీ కులాలకు సంబంధించిన అసలైన సమస్యలు ప్రస్తావించలేదు. అయినా ఆ ఉద్యమాల్లో బహుజనులంతా భాగమై విముక్తికి దూరమయ్యారు.
కులాల వాటాతోనే వివక్షలకు విరుగుడు..
వ్యవస్థాగతంగా వివక్ష కొనసాగుతున్న ఒక ప్రాంతంలో అంతర్గత అసమానతలు, కుల ఆధిపత్యం, వనరుల పంపిణీ, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలు ఆర్డర్ ఆఫ్ ప్రయా రిటీలో ముందు ఉండాలి. భాషా, ప్రాంతం వంటివి బూటకం. అగ్రకులాలు రాజ్యానికి రావడానికి తెరపై తెచ్చిన భావోద్వేగపూరితమైన అంశాలు మాత్రమే. ఆ ఉచ్చులో పడి బహుజన మేధావులు అసలైన సమస్యలను విస్మరిస్తున్నారు. కావున ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో మరోసారి వినిపిస్తున్న భాషా, ప్రాంతం, సంస్కృతి, మార్వాడి ఆధిపత్యం వంటి సమస్యలకు అతీతంగా సామాజిక న్యాయం కోసం పోరాడాలి.
అగ్రవర్ణాలతో ఇడుపు కాయితం చేసుకొని..
ఇప్పటికే కొందరు బహుజన మేధావులు, నాయకులు అగ్రకుల పార్టీలకు వత్తాసు పలుకుతూ, ఓటు దళారులుగా మారి జాతి విముక్తిని మరచిపోతున్నాయి. అందుకే జనాభాలో 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నప్పటికీ తమ రాజ్యాన్ని సాధించుకోలేకపోతున్నారు. కావున ఇప్పుడు శత్రువును పసి గట్టడం, ఏది ప్రధాన అంశమో గుర్తుపట్టడం ముఖ్యం. కావున అగ్రవర్ణాల నీడలో నడుస్తున్న పార్టీలతో, అగ్రకుల నాయకులతో "ఇడుపు కాయితం"(విడాకులు) చేసుకొని స్వశక్తిగా పోరాడినప్పుడే అట్టడుగు వర్గాలకు విముక్తి లభిస్తుంది. భూమి, సంపద, రాజ్యం సంస్కృతిలో వాటా లభిస్తుంది. ఇదే అసలైన సామాజిక న్యాయం. ఈ విషయాన్ని తెలంగాణ బహుజన మేధావులు, కవులు, కళాకారులు, రచయితలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
- సంపతి రమేష్
79895 79428






