2003 డీఎస్సీ టీచర్లకు న్యాయం జరిగేదెన్నడు?

by Ravi |   (  Updated:2026-06-11 00:46:14  IST  )

సీపీఎస్ విధానంతో ఉద్యోగుల భవిష్యత్‌పై నెలకొన్న ఆందోళనలు, ఓపీఎస్ అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు అనుకూలంగా వచ్చిన హైకోర్టు తీర్పు, దానిపై సుప్రీంకోర్టులో దాఖలైన ఎస్ఎల్‌పీ నేపథ్యంలో ఉద్యోగ వర్గాల ఆవేదనపై విశ్లేషణ.

2003 డీఎస్సీ టీచర్లకు న్యాయం జరిగేదెన్నడు?
X

ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. ఉద్యోగ విరమణ తర్వాత వచ్చే పెన్షన్‌కు ఎలాంటి గ్యారంటీ లేక పోవడం, మార్కెట్ ఒడిదుడుకులపై ఆధారపడి కేవలం వందల్లో, వేలల్లో మాత్రమే పెన్షన్ రావడం ఉద్యోగ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

రెండున్నర ఏళ్లు కావస్తున్నా..

ముప్పై, ముప్పై ఐదేళ్ల పాటు సర్వీస్ చేసి వృద్ధాప్యంలో హక్కుగా పొందాల్సిన పెన్షన్ కోసం కార్పొరేట్ కంపెనీల లాభాలపై ఆధారపడాల్సి రావడం అత్యంత విచారకరం. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రేవంత్‌రెడ్డి ప్రచార కార్య క్రమంలో పాల్గొంటూ, అధికారంలోకి రాగానే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, ఓల్డ్ పెన్షన్ స్కీం (ఓపీఎస్)‌ను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో సైతం ఈ హామీని పొందుపరిచారు. కానీ, అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు కావస్తున్నా ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం ఉద్యోగ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.

అమలుకు హామీ.. తెరవెనుక కోర్టు పిటిషన్!

2004 జనవరి 1 నుండి దేశవ్యాప్తంగా సీపీఎస్ విధానాన్ని బలవంతంగా రుద్దినప్పటికీ, కాలక్రమేణా అందులోని లోపాలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక సవరణలు చేసింది. 2020లో జారీ చేసిన 574, 575 మెమోల ప్రకారం 1 జనవరి, 2004 నాటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి, కేవలం సాంకేతిక, పరిపాలనాపరమైన కారణాల వల్ల ఆ తర్వాత నియామక పత్రాలు అందుకున్న వారు పాత పెన్షన్ విధానానికి అర్హులని వివరణ ఇచ్చింది. ఈ ఉత్తర్వుల ఆధారంగా రాష్ట్రంలో 2003 డీఎస్సీ టీచర్లతో పాటు ఇతర అర్హులకు ఓపీఎస్ వర్తింప జేయాలని ఉద్యోగ సంఘాల జేఏసీ పలుమార్లు విజ్ఞప్తి చేసింది. అయినా పాలకులు స్పందించకపోవడంతో, విసిగిపోయిన బాధితులు న్యాయం కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు కేంద్ర ప్రభుత్వ మెమోలను రాష్ట్రంలోనూ తక్షణమే అమలు చేయాలని, ఇందుకు మూడు నెలల గడువు ఇస్తూ ఇటీవల చారిత్రాత్మక తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పుతోనైనా తమకు న్యాయం జరుగు తుందని 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు ఆశగా ఎదురు చూశారు. దానికి తగ్గట్టుగానే, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఈ నెల 5న జరిగిన కీలక సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు కోర్టు ఉత్తర్వుల అమలుపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని, ఎవరికీ అన్యాయం జరగనివ్వమని సీఎం స్వయంగా హామీ ఇచ్చారు. ఈ పరిణామంతో ఉద్యోగ లోకం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. అయితే, ఈ సంతోషం కొన్ని గంటల ముచ్చటగానే మిగిలిపోయింది. ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చిన రోజే తెరవెనుక ఉన్నతాధికారులు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్‌పీ) దాఖలు చేయడం ఉద్యోగ, ఉపాధ్యాయ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి, క్షోభకు గురిచేసింది.

సీఎం గారూ.. జోక్యం చేసుకోండి!

ఈ వివాదం కేవలం సాంకేతిక, చట్టపరమైన అంశం మాత్రమే కాదు, దాదాపు పదిహేనువేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాల జీవన్మరణ సమస్య. దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ మెమోలను గౌరవిస్తూ నష్టపోయిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేశాయి. స్వరాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగ, ఉపాధ్యాయ లోకానికి తెలంగాణ గడ్డపై ఆ న్యాయం జరగకపోవడం ప్రతి ఒక్కరినీ తొలిచివేస్తోంది. ఈ సున్నితమైన వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తక్షణమే జోక్యం చేసుకోవాలి. అధికారులు తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలపై సీఎం సమీక్ష జరపాలి. సుప్రీంకోర్టులో వేసిన ఎస్ఎల్‌పీని తక్షణమే ఉపసంహరించుకునేలా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయాలి. 2004 సెప్టెంబర్ నాటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి నియామక పత్రాలు ఆలస్యంగా అందుకొని నష్టపోయిన 2003 డీఎస్సీ ఉపాధ్యాయులతో పాటు ఉద్యోగులకు తక్షణమే ఓపీఎస్ వర్తింప‌జేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి.

-మానేటి ప్రతాపరెడ్డి,

రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, TRTF

98484 81028

Next Story