- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మానవత్వం ఏమైపోతోంది?
మెరిసే రంగు రాళ్లను చూసి మది మురిసినట్టు చుట్టూ మనలను పట్టుకుని వేలాడుతున్న సంబంధ బాంధవ్యాలను

మెరిసే రంగు రాళ్లను చూసి మది మురిసినట్టు చుట్టూ మనలను పట్టుకుని వేలాడుతున్న సంబంధ బాంధవ్యాలను చూసి మనం మురిసిపోతున్నాం అనిపిస్తుంది. ఎందుకంటే, బంధాల నడుమన బాధ్యత కరువైపోతుంది. ఈ రోజు మనతో ప్రేమగా ఉన్న వారు రేపెలా వుంటారో తెలియదు. ఈరోజు నీ వెంట వున్న స్నేహం రేపటి రోజున నీ నిన్ను చూసి ఈర్ష్య ద్వేషాలను కమ్ముకుంటుంది. నీ నవ్వును చూసి ఓర్వలేక అసూయతో తనను తాను హతమార్చుకుంటుంది. నువ్వు బాధల్లో ఉంటే నవ్వుకుంటుంది. నువ్వు నవ్వుతున్నప్పుడు కుళ్ళుకుంటుంది.
అదే సమాజం నువ్వు కింద పడితే చెయ్యందించి పైకి లేవనెత్తలేదు. నువ్వు ఎదుగుతుంటే చూడలేదు. పిలుపులో ఉన్నంత లౌక్యం ఆదరణతో ఏ మాత్రం అగుపించటం లేదు. ప్రస్తుతం బంధాల్లో మానవత్వం ఏమవుతుందనేది ప్రశ్నార్ధకమే! అమ్మ కూతుర్ని చంపేస్తుంది. కొడుకులు తండ్రి ని చంపేస్తున్నారు. అన్న చెల్లిని చంపేస్తాడు. భర్తకు భార్యంటే పగ. భార్య భర్తను చంపేసి భర్త కుటుంబీకులకు పార్సిల్ చేసి పంపిస్తుంది. అన్నదమ్ములకు శత్రుత్వం. అక్క చెల్లెళ్ళ మధ్యన స్వార్థం గూడు కట్టుకుంటుంది. ఏమనుకోవాలి?
పుట్టిన బిడ్డలను వదిలేసిపోతే..
అవసరం ఉన్నప్పుడు ఒకలా అవసరం తీరాక ఒకలా ప్రవర్తిస్తారు మన అనుకున్నవాళ్లే. నటనలో జీవిస్తారనిపిస్తుంది ఒక్కోసారి వారి ప్రవర్తన చూస్తుంటే. మన ఆత్మస్తైర్యమే మనకు బలమవ్వాలి ఈ భువిపై ప్రశాంతంగా బతకాలంటే. ఎందుకంటే, ఏ బంధానికి గ్యారంటీ లేదిప్పుడు నిన్నగాక మొన్న గుంటూరు జిల్లా మంగళగిరి, నిడమర్రులో టిటికో గృహాల వద్ద అప్పుడే పుట్టిన ఆడ బిడ్డను వదిలేసి వెళ్లిపోయింది ఒక తల్లి. బిడ్డను పెంచలేక అనుకోవాలా ! బరువు దించుకుంది అనుకోవాలా ! లేక ఆడపిల్ల పుట్టిందని వదిలెల్లింది అనుకోవాలా! వీడి కుక్కలు కూడా పొత్తిళ్ళలో బిడ్డను నడిరోడ్డుపై విడిచిపెట్టి పోవు కదా..! మానవత్వాన్ని కోల్పోయి ఎందుకింతలా ప్రవర్తిస్తున్నారు.
కూతుళ్లకు రక్షకభటులు తండ్రులు..
నిన్నటి రోజున ఆరేళ్ల పాప అనుకుంటా.. బుద్దిగా కూర్చొని హోమ్ వర్క్ చేసుకుంటుంది. తండ్రి పాప ఎదురుగా ఒక పొట్టి నిక్కరు వేసుకొని కూర్చుని టీవీ చూస్తున్నాడు. సరే కూర్చున్నాడు అంతవరకు బానే వుంది వాడి కాళ్లతో ఆ పాపను పెఠీ పెఠీమని తన్నుతున్నాడు. ఎందుకు తన్నుతున్నావ్ అని ఆ పాప తల్లి అడుగుతుంటే మాట్లాడటం లేదు. కూతుళ్లకు తండ్రి అనేవాడు రక్షకభటుడిలా ఉండాలి. రాక్షసుడిలా ఉండకూడదు.
ప్రేమను పంచండి..
వాగులో వున్న చేపపిల్లకు ఏరేటో తెలియదు, తనున్నదెక్కడో తెలియదు. అలా ఉండొద్దు తల్లిదండ్రులు. మీ పిల్లలను ప్రేమతో పెంచండి. మీ వ్యసనాలకు వారిని బలికానీయకండి. మీ కోర్కెలకు వారిని ఆయుధాలుగా మార్చకండి. కన్నవారుగా వారి బాధ్యత నెరవేర్చండి. భారం అనుకోని వదిలెయ్యడమో, అక్రమ సంతానంగా వారి జీవితాన్ని ముగించెయ్యడమో చెయ్యకండి. పురిటి నెప్పులతో అల్లాడుతున్న తల్లి పొట్టలో నుంచి బయటికొచ్చేటప్పుడు ఉమ్మనీటిలో నుండి ఎంత గొప్పగా బయటి వస్తావో.. చివరి స్నానంలో కూడా అంతే స్వచ్ఛంగా నీలోని మలినం కడగ బడాలి. అంటే నీ బతుకు దినములన్నిటిలో నీ మాట, నీ నడత, నీ ఆలోచన, నీ ప్రవర్తన తోటి వారికి ఆదర్శంగా ఉండాలి. నిన్ను మరొకరు మార్గదర్శకంగా తీసుకొని జీవించాలి. మానవత్వం పరిమళించాలి.
వాసి జ్యోత్స్న
98668 43005






