- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ బడిని.. ప్రభుత్వ ఉద్యోగులు నమ్మకపోతే ఎలా?
విద్య అనే పదం విద్ అనే సంస్కృత పదం నుండి ఉద్భవించింది. దీనికి అర్థం "జ్ఞానం" అని. విద్య లేకుంటే జ్ఞానం లేదు.

విద్య అనే పదం విద్ అనే సంస్కృత పదం నుండి ఉద్భవించింది. దీనికి అర్థం "జ్ఞానం" అని. విద్య లేకుంటే జ్ఞానం లేదు. జ్ఞానం లేకుంటే నైతికత లేదు. నైతికత లేకుంటే అభివృద్ధి లేదు. కనుక ప్రతి మనిషికి విద్య అవసరం. ఈ విద్య లేకుంటే సమాజంలో ఎలా జీవించాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, గౌరవ మర్యాదలు ఎలా ఇవ్వాలి? ఎలా పొందాలి? అనేది మనకు ఈ విద్య తెలియజేస్తుంది. కావున సమాజాన్ని చైతన్యం చేయాలంటే విద్య నేర్చుకోవడం తప్పనిసరి.
సామాన్య ప్రజలు నమ్మేదెలా?
ఒకప్పుడు మనదేశంలో విద్యను ప్రభుత్వ విద్యా సంస్థల నుండే అభ్యసించేవారు. కానీ ప్రస్తుత తరుణంలో ప్రైవేటు విద్యాసంస్థల్లోనే ఎక్కువగా అభ్యసిస్తున్నారు. ప్రభుత్వ విద్యాలయాలలో చదివే వారి సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతుంది. ఇందుకు ప్రధాన కారణం ప్రస్తుతం పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం. ప్రస్తుతం ప్రభుత్వ అటెండర్ నుండి కలెక్టర్ వరకు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. కావున అందరూ ప్రభుత్వ బడులకు మీ పిల్లలను పంపండి వారు చెప్పి వారి పిల్లలను మాత్రం ప్రైవేటు బడులకు పంపుతున్నారు.. ప్రభుత్వ ఉద్యోగులే వారి పిల్లలను కూడా ప్రభుత్వ బడులకు పంపకుండా ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయిస్తుంటే.. ప్రభుత్వ బడుల్లో చేరండి నాణ్యమైన విద్య చెబుతాం అని అంటే పిల్లల తల్లిదండ్రులు నమ్ముతారా? ఇక ప్రతీ సంవత్సరం ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమంలో భాగంగా మన ఊరి బడిలోనే మన పిల్లలను చేర్పించండి - ప్రైవేట్ పాఠశాలల ఫీజులు భారం తగ్గించుకోండి అనే నినాదంతో ప్రచారం చేస్తూ.. మీ పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చేర్పిస్తే మిమ్మల్ని గ్రామీణ ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందా?
కనుమరుగయ్యే స్థితిలో ప్రభుత్వ బడులు..
ప్రభుత్వ ఉద్యోగులు.. వారి పిల్లలను ప్రభుత్వం నిర్వహించే బడులలో చేర్పించరు కానీ వారికి రావాల్సిన టి.ఏలు, డి.ఏ లు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పీఆర్సీ కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంటారు. ఈ పరిస్థితి మార్చి ప్రభుత్వ బడులకు పూర్వ వైభవం తీసుకురావాలంటే ప్రభుత్వ ఉద్యోగులందరూ తప్పని సరిగా వారి పిల్లలను ప్రభుత్వ బడులకే పంపుతామని సమ్మతించిన వారికే ప్రభుత్వ ఉద్యోగ ఆర్డర్ కాపీ ఇచ్చేలా నిబంధనలు విధించాలి. అలాగే ప్రభుత్వ బడులలో చదివే పిల్లలకే పై తరగతులలో స్కాలర్షిప్‌లు, ఎంట్రన్స్‌లలో ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ అమలు చేసే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి. ఇక ప్రజా ప్రతినిధులు సైతం వారి వారి ప్రసంగాల్లో మేం ప్రభుత్వ బడిలోనే చదివాం అని చెబుతుంటారు కానీ వారి పిల్లలు మాత్రం ప్రైవేటు బడులకు పంపుతుంటారు. ప్రభుత్వ నిర్ణయాలను, చట్టాలను చేసే వాటిలో సభ్యులుగా ఉండి కూడా ప్రభుత్వ బడులను చిన్న చూపు చూస్తే ఎలా? అందుకే రాజకీయ రంగంలో కూడా పోటీదారులుగా ఉండాలంటే వారి పిల్లలు ప్రభుత్వ బడులను చదివిస్తేనే పోటీకి అర్హులు.. అనే నిబంధన పెట్టాలి. లేకపోతే రానున్న రోజుల్లో ప్రభుత్వ బడులు కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వమే పూనుకొని మన దేశంలో "వన్ నేషన్ వన్ ఎలక్షన్" అను విధానం ఎలాగైతే అమలు చేయాలనుకుంటున్నారో అదే విధంగా "వన్ నేషన్ వన్ ఎడ్యుకేషన్" అను విధానం ప్రవేశపెట్టి దేశంలో ఉన్న ప్రజలందరికీ ఒకే రకమైన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి విద్యలో తారతమ్యం లేకుండా అమలు చేయాలి. అప్పుడే ప్రభుత్వ విద్య బలోపేతం అవుతుంది.
-కట్ట ప్రశాంత్ కుమార్
93932 57697






