- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపాధ్యాయులే లక్ష్యంగా మారితే ఎలా?
తెలంగాణాలో విద్యా సంస్కరణల పేరుతో పల్లె ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్‌పై ఉత్పన్నమవుతున్న ఆందోళన, ఉపాధ్యాయుల అనుభవాలు, పబ్లిక్ స్కూల్స్ విధానం ప్రభావం, గ్రామీణ విద్య పరిరక్షణ అవసరంపై విశ్లేషణాత్మక వ్యాసం.

డియర్ సీఎం గారు.. మా అనుభవాలకూ విద్యా సంస్కరణల్లో కాస్త అవకాశం ఇవ్వండి. విద్యపై అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తామని ప్రభుత్వ ఏర్పాటుకు ముందు నుండి మీరు చెప్తూ రావడం, వచ్చీ రాగానే అనేక సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న బదిలీలు, పదోన్నతులు పూర్తి చేయడం, పాఠశాలలకు ఉచిత విద్యుత్, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ పేరిట మౌలిక వసతులు, పారిశుధ్య కార్మికులను మంజూరు చేయడం, రెండో విడత పదోన్నతులివ్వడం, బకాయిలు, డీఏలు, పీఆర్సీల సంగతి ఎలా ఉన్నా మొదటి తారీఖునే జీతాలు ఇవ్వడం ఇలా ఒక పాజిటివ్ వైబ్రేషన్‌తో ఉపాధ్యాయ, విద్యా లోకంలో ఆశలు చిగురించాయి.
ఆగస్టు 3న పదోన్నతులు పొందిన టీచర్లతో స్టేడియంలో సమావేశం ఏర్పాటు చేసి ఇచ్చిన భరోసా, మాట్లాడిన మాటలు మరింత ప్రోత్సాహాన్నిచ్చాయి. విద్యకు మంచి రోజులు రాబోతున్నాయని నాతో సహా ఉపాధ్యాయ సంఘాలు సహా విద్యావేత్తలు అందరూ భావించారు. తమ తమ ప్రతిపాదనలు విద్యా కమిషన్‌కు అందజేశారు.
టీచర్ల వేతన స్కేళ్లు ఎక్కువనా?
క్షేత్రస్థాయి అనుభవాలను కొన్నింటిని అయినా పరిగణలోకి తీసుకుంటారని భావించారు. కానీ తీరా కమిషన్ వెలువరించిన నివేదిక ఉపాధ్యాయులే లక్ష్యంగా సాగుతుందని, విద్యకు ఏకైక దిక్కుగా ఉన్న పల్లె సర్కార్ బడులు ఆచూకీ కోల్పోయే స్థితి, గతి వస్తుందని ఊహించలేదు. నిజాం కాలం నుండి పోరాడి సాధించుకున్న శాస్త్రీయమైన వేతన స్కేళ్లు ఇలా మార్కెట్ ధరలకంటే హెచ్చుగా ఉన్నాయని కమిషన్ సూత్రీకరిస్తుందని అనుకోలేదు. ఆ ప్రతిపాదనను విద్యాలోకం జీర్ణించుకోలేకపోతున్నది.
పల్లెబడులను టార్గెట్ చేయడం న్యాయమా?
ఇక విద్యా విధానం విషయానికొస్తే, సుమారు రెండున్నర దశాబ్దాలపైగా అనుభవం ఉన్న నా లాంటి ఉపాధ్యాయులకు అటు కమిషన్‌తో కానీ, ఇటు మీతో, ప్రభుత్వంతో మాట్లాడే, అనుభవాలను పంచుకునే అవకాశాలు రాలేదు. విద్యను బాగు చేయాలన్న మీ కోరికలకు, ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు, విద్యాహక్కు చట్ట స్ఫూర్తికి లోబడిన గ్రామీణ పాఠశాలల అందుబాటుకు భిన్నంగా కమిషన్ ప్రతిపాదనలు సాగాయి. ఉపాధ్యాయులపై ద్వేషం, అంటరానితనం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. పల్లె బడులు అనాదిగా తల్లి పాత్రనే పోషిస్తున్నాయన్న విషయాన్ని నివేదిక విస్మరించినట్లుగా తోచింది. ప్రైవేటు కార్పొరేట్ పట్ల ఉన్న ఆకర్షణను ఒక బలహీనతగా తీసుకొని ప్రభుత్వం అదే దారిలోకి పోవాలని ప్రయత్నించాలను కోవడం ఆశ్చర్యాన్ని ఇచ్చింది. మాతృభాషను మరీ పరాయి దాన్ని చేయడం, రవాణా ఉంది కాబట్టి అందుబాటు ఉందనడం దారుణమనిపించింది.
పబ్లిక్ స్కూల్ పెడితే మిగతావి మూసేయాలి!
కమిషన్ చేపట్టిన సర్వే మేరకు ఉపాధ్యాయులకు మూడు గంటల సమయం కూడా బోధనకు దొరకడం లేదంటూనే, వారం వారం మధ్యాహ్న భోజనం బిల్లులు చేయాలని, ప్రతిరోజు పర్యవేక్షణ, రుచి చూడాలని మరిన్ని ఒత్తిడి బాధ్యతలను పెంచారు. పబ్లిక్ స్కూళ్లే అన్నిటికీ పరిష్కారం అనడం, నిర్వహణ వ్యయమే సుమారు 36,000 కోట్లు కావాలనడం, అటు ఇంటిగ్రేటెడ్ స్కూల్‌లకు 23,800 కోట్లు అవసరం అనడం, దాంతో అదనంగా ఏడు లక్షల మందికే లబ్ధి చేకూరుతుందని అంచనా వేయడం మనసుకు చాలా కష్టంగా అనిపించింది. గ్రామంలో బడులు, టీచర్లు కేవలం విద్యనే కాక ఒక సామాజిక చైతన్యం చేయడం, ప్రభుత్వ పథకాలను కింది స్థాయికి తీసుకువెళ్లడం, ప్రతి కిలోమీటర్ పరిధిలో ఉంటున్నందున ప్రభుత్వానికి ప్రజలకు నిజమైన వారధిగా పనిచేయడం అనే స్ఫూర్తిని తుంగలో తొక్కేయడం తీవ్ర విచారణకు గురిచేసింది. నిజానికి వారు చెబుతున్నట్లుగా ఈరోజు ఒక మండలంలో ప్రభుత్వ విద్యపై ఆధారపడిన విద్యార్థుల సంఖ్య 1500 నుండి 2000 ఎక్కడా లేదు. అలాంటప్పుడు ఒక పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తే మిగతా పాఠశాలలన్నీ విధిగా మూసేయవలసిందే.
మండల వారీగా అంచనాలు కావాలి!
ఒక కామన్ నిర్ణయం రాష్ట్రమంతటికి సరిపోదు. గ్రామీణ, పాక్షిక పట్టణ, పట్టణ, నగర ప్రాంతాలు ఉంటాయి కనుక ప్రస్తుత ప్రభుత్వ విద్యా విధానానికి ఊతమివ్వాలన్నా, ఊపిరి పోయాలన్నా మండల వారీగా అంచనాలు జరగాలి. ఎన్ని పాఠశాలలు అత్యవసరం. ఎన్ని తాత్కాలికంగా మూసేయవచ్చు అని ఆలోచిస్తే, అత్యంత తక్కువ రవాణాతో బడులని బతికించవచ్చు. విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి సూత్రాన్ని పక్కకు పెట్టి ప్రస్తుత ఉపా ధ్యాయ సంఖ్యనే తరగతికొకరుగా సర్దుబాటు చేయవచ్చు. మూసివేసిన పాఠశాలలను పూర్వ ప్రాథమిక విద్యకు చక్కగా వినియోగించుకోవచ్చు. ఇలాంటి పాఠశాలలను మండలంలో రెండేసి గ్రహించి, కామన్ కిచెన్ ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో బడి వ్యవస్థను బట్టకట్టించవచ్చు.
30 వేల కోట్లు ఆదా..
ఇక బడిబాట నడిచే జూన్ మాసాంతం వరకు ఇతర సర్దుబాట్లు పూర్తి చేసుకుని జూలై ప్రారంభం నుండి విద్యా బోధనకు సంసిద్ధంగా ఉండవచ్చు. ఈ విధానానికి ప్రజలు అంగీకారం తెలిపితే భవిష్యత్తులో పబ్లిక్ స్కూళ్ల వైపుగా అడుగులు వేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం మండలానికి 10 కోట్లు చొప్పున 6,120 కోట్లు సరి పోతాయి లేదా అంతకన్నా తక్కువతో కూడా సరిపుచ్చవచ్చు. అంటే పబ్లిక్ స్కూల్స్ నిర్మాణ వ్యయంలో సుమారు 30 వేల కోట్లు ఆదా అవడంతో పాటుగా నిర్వహణ వ్యయం ఒక పైసా కూడా అదనంగా ఉండదు. ఇది నిజమైన పబ్లిక్ స్కూళ్ల వైపు అడుగులు వేసే ప్రక్రియగా ఉంటుంది.
గురుకులాలను ఇంటెగ్రేట్ చేయడం మంచిదే!
అయితే రకరకాల కులాల గురుకులాలను ఇంటిగ్రేట్ చేయడం ఓ మంచి పరిణామం. దీనిని ఎక్కడైతే సొంత భవనాలు లేవో, అక్కడ మాత్రమే ప్రయోగాత్మకంగా అమలు చేయాలి. కాంప్లెక్స్‌లను రద్దు పరచి మండలానికి ఒక అకాడమిక్, ఒక అడ్మినిస్ట్రేటివ్ విద్యాధికారి ఉండేలా చూడాలి. డివిజన్‌ల వారీగా ఉపవిద్యాధికారులు, రెగ్యులర్ జిల్లా విద్యాధికారులు ఉండాలి. బోధనేతర పనులను, క్లరికల్ అంశాలను నూటికి నూరుపాళ్లు తగ్గించి బోధన వైపుగా, నాణ్యత వైపుగా, టీచర్లకు అధికంగా ఆంగ్ల నైపుణ్యాల శిక్షణ మార్గంలో పనులు ప్రారంభించాలి. అప్పుడే ప్రజా ప్రభుత్వ విద్యా లక్ష్యం నెరవేరుతుంది. లేదంటే పునాదిగా ఉన్న పల్లె సర్కారు బడులు అంతరించిపోతే పల్లెల్లో చైతన్యం అంతరించిపోతుంది.
- దాసరి శ్రీధర్
99122 83222






