- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రివర్గ విస్తరణలో సోషల్ ఇంజినీరింగ్ వ్యూహం విజయవంతమైందా?
తెలంగాణ స్వరాష్ట్రంలో జరిగిన మొదటి రెండు (2014, 2018) అసెంబ్లీ ఎన్నికల్లో, కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ గెలిచి

తెలంగాణ స్వరాష్ట్రంలో జరిగిన మొదటి రెండు (2014, 2018) అసెంబ్లీ ఎన్నికల్లో, కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ గెలిచి అధికారాన్ని చేపట్టింది. తొమ్మిదిన్నర ఏండ్ల కేసీఆర్ పార్టీ పాలనను చూసిన ప్రజానీకం, 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. దాదాపు 40 ఏండ్ల తర్వాత తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ మొత్తం 119 స్థానాల్లో సగానికి పైగా స్థానాలు గెలిచి, అధికారాన్ని హస్తగతం చేసుకుంది. మొత్తం గెలిచిన సీట్లోల్లో ఓసీలు 34 (53%), బీసీలు 7 (11%), ఎస్సీలు 14 (22%), ఎస్టీలు 9 (14%) ఎమ్మెల్యే స్థానాల్ని సాధించారు.
రాజ్యాంగ నిబంధనల ప్రకారం, 119 స్థానాలున్న శాసన సభలో 15% కంటే ఎక్కువ కాకుండా గరిష్టంగా 18 మంత్రి పదవులు ఉండవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ వర్గాల వారీగా గెలిచిన 64 సీట్ల నిష్పత్తి ఆధారంగా కాకుండా, మంత్రి పదవులను సామాజిక కోణంలో ఆలోచించి, వివిధ సమీకరణాల ఆధారంగా ఆయా సామాజిక వర్గాలకు కేబినెట్‌లో చోటు కల్పించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు నియమితులైన 15 మంది మంత్రుల్లో ఓసీ కేటగిరి నుండి ముఖ్యమంత్రితో పాటు ఆరుగురు మంత్రులు, బీసీ కేటగిరి నుండి ముగ్గురు, ఎస్సీ కేటగిరి నుండి నలుగురు మంత్రులతో పాటు స్పీకర్, ఎస్టీ సామాజిక వర్గం నుండి ఒక మంత్రితో పాటు డిప్యూటీ స్పీకర్ ఉన్నారు.
పెండింగ్‌లో మరో 3 మంత్రి పదవులు..
గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రాన్ని మేమే ఇచ్చినమని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీకీ ప్రజలు మొదటిసారి అధికారాన్ని అప్పజెప్పారు. రేవంత్ రెడ్డి సర్కార్ కొలువుతీరి ఏడాదిన్నర కాలం గడిచింది. ఇక మిగిలింది మూడున్నర ఏండ్లు.. అందులో చివరి ఆరు నెలలు ఎన్నికల హడావుడి, టికెట్ల కేటాయింపు ఇతరత్రా వ్యవహారాలు ఉంటాయి. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర తర్వాత కూడా ఇంకా ఆరు మంత్రి పదవులను భర్తీ చేయాల్సి ఉండగా మూడింటిని భర్తీ చేసి మరో మూడింటిని పెండింగ్‌లో పెట్టారు. ఈ నేపథ్యంలో సామాజిక న్యాయం, సమీకరణాలు, సోషల్ ఇంజినీరింగ్ అనే భావనలు తెరపైకి వచ్చాయి. అయితే కాంగ్రెస్ హైకమాండ్ సోషల్ ఇంజినీరింగ్ వ్యూహం ప్రకారం మంత్రివర్గ విస్తరణ చేపట్టినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు..
వ్యూహాత్మకంగా సోషల్ ఇంజినీరింగ్
అధికారం సాధించాలన్న లక్ష్యంతో సీట్ల కేటాయింపులో సోషల్ ఇంజినీరింగ్‌ను పక్కనపెట్టి, అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని అమలు చేయడం వల్ల గెలిచిన సీనియర్ ఎమ్మెల్యేలు, గతంలో మంత్రులుగా అనుభవం ఉన్న నాయకులు పదవులు ఆశించడం సహజం. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండటం వల్ల, ఈ మంత్రివర్గ విస్తరణ రాబోయే ఎన్నికల్లో పార్టీ భవితవ్యం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కాకుండా ఫలితాల తర్వాత ఈ సోషల్ ఇంజినీరింగ్‌ను వ్యూహాత్మకంగా అమలు చేసింది. ఆశావహులను సముదాయిస్తూ మరో మూడు మంత్రి పదవులను స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత భర్తీ చేయనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో, ఈ పదవులు ఎవరికి దక్కుతాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
మంత్రివర్గ విస్తరణతో సరిపోదు..
మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి జిల్లాల వారీగా అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. రాబోయే రోజుల్లో ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుండి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాల ప్రజలకు సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం అందాలి. కానీ, ఒక వర్గానికి మంత్రివర్గంలో స్థానం కేటాయించినంత మాత్రాన ఆ వర్గానికి సంపూర్ణ సామాజిక, రాజకీయ న్యాయం జరిగినట్టు కాదు. ఇంకా అనేక కులాల వారికి చట్ట సభల్లో రాజకీయ ప్రాతినిధ్యం లేదు. అటువంటి వర్గాలకు ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలు, నామినేటెడ్ పదవుల ద్వారా సముచిత ప్రాధాన్యత ఇవ్వడమన్నది అన్ని రాజకీయ పార్టీల బాధ్యత. సోషల్ ఇంజినీరింగ్ అనే భావనను కేవలం మంత్రివర్గ విస్తరణకు పరిమితం చేస్తే సరిపోదు.. కుల, మత, వర్గాలకు అతీతంగా తెలంగాణ ప్రజానీకానికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు సమగ్రంగా అందినప్పుడే అధికార కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో విశ్వసనీయత పెరిగేది.
పాత, కొత్త నేతల మధ్య సమన్వయం..
రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంత్రి పదవులు దక్కని సీనియర్ నేతలు పార్టీ గెలుపు కోసం పనిచేస్తారా? లేదా అన్న చర్చ జరుగుతోంది. పదేళ్లు ప్రతిపక్షంలో ఉంటూ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారు.. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత పదవుల్ని ఆశించడంలో తప్పేమీ కాదు. ఈ తరుణంలో కొత్త, పాత నాయకుల మధ్య పార్టీ అధిష్టానం సమన్వయాన్ని సాధించి ముందుకు సాగే ప్రయత్నం చేస్తారో లేదో చూడాలి. స్థానిక ఎన్నికల్లో వెలువడే ఫలితాలు ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనకు రిఫరెండం అని అధికార, విపక్షాలు భావిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎవరి పక్షాన నిలుస్తారన్నది కాలమే నిర్ణయిస్తుంది.
డాక్టర్.అశోక్ మంద
99590 46499






