ఫిజికల్ రిగ్గింగ్ నుంచి.. డిజిటల్ రిగ్గింగ్ దశకు

by Ravi |   (  Updated:2025-08-14 01:15:10  IST  )

వారం రోజుల నుండి దేశంలో ‘ఓట్ చోరీ’ విస్తృత ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ ‘ఓట్ల చోరీ’ భారత పార్లమెంటరీ వ్యవస్థలో కొత్త ప్రక్రియ కాదు.

ఫిజికల్ రిగ్గింగ్ నుంచి.. డిజిటల్ రిగ్గింగ్ దశకు
X

వారం రోజుల నుండి దేశంలో ‘ఓట్ చోరీ’ విస్తృత ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ ‘ఓట్ల చోరీ’ భారత పార్లమెంటరీ వ్యవస్థలో కొత్త ప్రక్రియ కాదు. దీనికొక సుదీర్ఘ పరి ణామ చరిత్ర వుంది. 1952 నుండి నేటి వరకు భారత ఎన్నికల పరిణామ చరిత్ర అనేక మార్పులు, మలుపులు, కుదుపులు, సంస్కరణల వంటి రకరకాల క్రియలూ, ప్రక్రియలకూ గురవుతూ కొనసాగుతోంది.

అయితే ఇప్పుడు వాటి ప్రభావాలూ, పర్యవసానాలూ, ఫలితాలలోకి వెళ్లడం లేదు. ఆ ఎన్నికల్లో భాగంగా పుట్టి పెరిగిన రిగ్గింగ్ పరిణామ క్రమం వరకే పరిమితమై స్పందిస్తున్నాను.

మెంటల్ రిగ్గింగ్

సుదీర్ఘ స్వాతంత్రోద్యమ ప్రభావం వల్ల మొదటి దశలో రిగ్గింగ్ అవసరం రాలేదు. అది ప్రధానంగా మానసికంగా ఓట్లు వేసిన దశ. అంటే స్వచ్చందంగా తమకు నచ్చిన పార్టీకి, మెచ్చిన అభ్యర్థికి ఓటర్లు ఓట్లు వేసిన దశ. అది ఎక్కువ కాలం లేదు. ఆ స్వచ్ఛంద దశ దాటిన తర్వాత ఓటర్ల నుండి ‘ఓట్ల చోరీ’ మొదలైంది. అంటే ఇది ప్రలోభాలతో ఓటర్ల మనస్సులను ప్రభావితం చేసి ఓటర్లతోనే ఓట్లు వేయించుకున్న దశ. అంటే ఓటర్ల శరీరాల మీద బల ప్రయోగం చేయకుండా మనస్సులను ఎన్నికల సమయాలలో ధనస్వామ్యం రకరకాల ప్రలోభాలతో ‘చోరీ’ చేసే ప్రక్రియకు పూనుకుంది. మద్యం నుండి డబ్బు వరకు వివిధ ప్రలోభాల రూపాల గూర్చి ఇక్కడ ప్రస్తావన చేయడం లేదు. అది ఎన్నికల చరిత్రలో బాల్య రూప రిగ్గింగే. దానిని ‘మెంటల్ రిగ్గింగ్’ దశ అనవచ్చును.

ఫిజికల్ రిగ్గింగ్

ఆ దశ దాటాక ఫిజికల్ రిగ్గింగ్ దశ ప్రవేశించింది. ఓటర్ల మనస్సుల మీద కాకుండా వారి చేతిలోని ఓట్లను బల ప్రయోగంతో భౌతికంగా ‘చోరీ’ చేసే ప్రక్రియకి పాల్పడడం. నకిలీ ఓట్లు, దొంగ ఓట్లు చివరికి బూత్ క్యాప్చరింగ్ వంటి రూపాల్లో సాగింది. ఫిజికల్ రిగ్గింగ్ బాగా ముదిరి పరాకాష్ట దశకు చేరిన తర్వాత శేషన్ తెరపైకి వచ్చాడు. విచిత్రమైన విషయం ఏమిటంటే, ఫిజికల్ రిగ్గింగ్‌కి వ్యతిరేకంగా శేషన్ చేపట్టిన ఎన్నికల సంస్కరణ ఆచరణలో ప్రధానంగా నాటి కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగా మారింది. మూడో ప్రత్యామ్నాయ ప్రక్రియ కొంతకాలం తెరపై కొన సాగినా, సారంలో రెండు ధ్రువాల రాజకీయ వ్యవస్థకు దారి తీసింది. శేషన్ చేపట్టిన సంస్కరణ అంతిమ పరిశీలనలో ఓ రాజకీయ ధ్రువం బలపడడానికి, మరో రాజకీయ ధ్రువం బలహీనపడటానికి దారి తీసింది. ఇదో వాస్తవం.

శేషన్ సంస్కరణలతో లాభం ఎవరికి?

శేషన్ ఏ పార్టీ వ్యక్తి, ఏ పార్టీకి సహకరించారనేది ప్రశ్న కాదు.. ఆయన పాత్ర నాటి భౌతిక పరిస్థితుల్లో పార్లమెంటరీ వ్యవస్థ యవనికపై ఏ ప్రధాన పార్టీ రాజకీయ వ్యవస్థకు ప్రధాన నష్టం కలిగించి, ఏ పార్టీ రాజకీయ వ్యవస్థ అభి వృద్ధికి ప్రధాన లాభం కలిగించిందనేదే ప్రశ్న. నాడు శేషన్ పోషించిన పాత్ర నాటి దేశ ప్రజల ఆదరణ పొందింది. అదో భౌతిక వాస్తవం. నాటి ప్రజల తీవ్ర అసహ్యనికి గురైన ఫిజికల్ రిగ్గింగ్‌ని దెబ్బ తీయడానికి బాగా ఉప కరించింది. అదొక చేదు నిజం. అది ప్రజల్లో పార్లమెంటరీ చైతన్యాన్ని పెంచింది. ఆచరణలో దేశ రాజకీయ యవనిక మీద ప్రధాన రాజకీయ శక్తిగా బీజేపీ బలపడడానికి ఉపకరించింది. అదే బీజేపీ నేడు డిజిటల్ రిగ్గింగ్‌కి ప్రాతినిధ్యం వహిస్తోంది.

ఎమర్జెన్సీని మించిన నియంతృత్వం

మెంటల్ రిగ్గింగ్ ప్రజల మనస్సులకు తప్ప వారి కళ్లకు కూడా కనిపించేది కాదు. ఫిజికల్ రిగ్గింగ్ ఓటర్ల కళ్లకు నగ్నంగా కనిపించేది. అంతకంటే నూరు రెట్ల ప్రమాదకరం. డిజిటల్ రిగ్గింగ్ కొత్తగా ఉనికిలోకి వచ్చింది. ఇది కనిపించేది కాదు. కేవలం అనిపించేది మాత్రమే. యాభై ఏండ్ల క్రితం ఎమర్జెన్సీ నియంత్రత్వ పాలనా వ్యతిరేక పాత్ర పోషించిన జనసంఘ్ పార్టీ ఎమర్జెన్సీ తర్వాత బీజేపీగా పేరు మార్చుకుంది. ఎమర్జెన్సీ కంటే అనేక రెట్ల నిరంకుశ పాలన నేడు సాగిస్తోంది. బీజేపీ ఫాసిస్టు పాలనను ఎమర్జెన్సీ తెచ్చిన కాంగ్రెస్ నేడు వ్యతిరేకించడం గమనార్హం.

డిజిటల్ రిగ్గింగ్‌తో హస్తం బలి..

నాడు మిగిలిన అన్ని పార్టీల కంటే ఫిజికల్ రిగ్గింగ్‌కి ప్రాధాన్యత ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు డిజిటల్ రిగ్గింగ్‌కి మాదేపూర్ సాక్షిగా తానే స్వయంగా బలైనది. అది దానికి వ్యతిరేకంగా నేటి పోరాటానికి నాయకత్వం వహించే విచిత్ర పరిస్థితి ఏర్పడడం గమనార్హం. నాడు ఫిజికల్ రిగ్గింగ్‌కి వ్యతిరే‌కంగా అతిపెద్ద గొంతుతో బీజేపీ తీవ్రంగా ఖండించింది. అదే బీజేపీ నేడు అంతకంటే నూరు రెట్ల దుర్మార్గపు డిజిటల్ రిగ్గింగ్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్నది. పైగా దీన్ని ఖండించిన రాజకీయ శక్తుల మీద అతి పెద్ద గొంతుతో విరుచుకొని పడుతోంది.

ఫాసిజం నికృష్ట రూపం..

చరిత్ర గమనం చాలా విచిత్రమైంది. అది చిత్ర విచిత్ర మలుపులు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. వాటి పట్ల చారిత్రక దృష్టి కోణంతో పరిశీలన చేయాలి. చరిత్రలో ఫాసిజం సాంప్రదాయ నిరంకుశ, నియంతృత్వ పాలనలకి వ్యతిరేకంగా ప్రజలలో వెల్లువెత్తిన ప్రజాతంత్ర ఆకాంక్షలకు ప్రతినిధిగా నటిస్తూ ఎదిగింది. ఆ తర్వాత పరమ నికృష్ట, క్రూర, పైశాచిక వికృత రూపం తీసుకుంది. ఇది గత చరిత్ర నిరూపించిన సత్యం. ఈ ‘ఓటు చోరీ’ కథ కూడా అందుకోక ప్రబల ఉదాహరణగా నిలుస్తుంది కదా!

-పి ప్రసాద్ (పిపి)

Next Story