ఇది అధర్మ యుద్ధం.. రామాయణంపై ఆదివాసీ దృష్టికోణం

by Ravi |   (  Updated:2025-10-02 01:00:51  IST  )

ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరునికి ఏ మతాన్నైనా పుచ్చుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఇతరులు మతాన్ని కానీ, మత విశ్వాసాలను కానీ కించపరచటం

ఇది అధర్మ యుద్ధం.. రామాయణంపై ఆదివాసీ దృష్టికోణం
X

ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరునికి ఏ మతాన్నైనా పుచ్చుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఇతరులు మతాన్ని కానీ, మత విశ్వాసాలను కానీ కించపరచటం రాజ్యాంగ వ్యతిరేకం. చట్టరీత్యా నేరం కూడా. కానీ ప్రతి ఏటా విజయదశమి రోజున రావణాసురుని వధ నిర్వహించడం ఒక నిరంతర ప్రక్రియగా మారింది. కానీ అది పురాతన ఆదివాసీ తెగల ఆత్మగౌరవానికి ఆటంకంగా మారింది.

తమ దేవుళ్లను తాము కొలుచుకోవడం సరిపోదన్నట్లు ఆదిమ జాతులు దైవం అయిన రావణున్ని వధ చేసి సంబుర‌పడటం ఏ వెర్రిచేష్టలకు నిదర్శనం? ఏ మతతత్వ శక్తుల ఆధిపత్య ధోరణికి నిదర్శనం?

ఎందుకు అపహరించాల్సి వచ్చింది?

తండ్రి మాట కోసం పద్నాలుగేళ్లు అరణ్య వాసానికి వెళ్లాలి రాముడు. అరణ్యం అంటే మళ్లీ దట్టమైన అడవు లు.. అంటే అనివార్యంగా ఆదివాసీలుంటారు. ఇది ఒక భాగం. రాముడు అరణ్యవాసం వచ్చిన తరువాతనే సీతను అపహరించటం, దాంతో రాముడు రావణుడితో యు‌ద్ధం చేయడం, స్త్రీని అపహరించినందుకు రావణుడిని రాక్షసునిగా చూడటం, రాముడు లంకను జయించిన విజయ సంకేతంగా రావణవధ జరగటం మొదలైంది. కానీ రాజ్య పరిపాలన చేసుకునే రావణుడు సీతను ఎందుకు లంకకు తీసుకుపోవాల్సి వచ్చింది అనేది ప్రశ్న.

మనసు పడితే ముక్కు చెవులు కట్..

మధ్య భారతంలోని గోండ్వానాను రాజ్యంగా చేసుకుని పాలించిన రాజు రావణుడు. అరణ్యవాసానికి విచ్చేసిన రాముడు బయట ప్రాంతం నుంచి వచ్చాడు. గిరిజనేతర జాతి కనుక రాముడు కొంత అందంగా కనిపించి మనసు పడుతుంది శూర్పణఖ. దాంతో ఆమె ముక్కు చెవులు కోయమని లక్ష్మణుడిని ఆజ్ఞాపించాడు రాముడు. ఇది తెలిసిన రావణుడు 'నా చెల్లెలి ముక్కు చెవులు కోయటమా' అని ఆగ్రహించి సీతను లంకకు తీసుకెళ్లటం జరుగుతుంది. అది కూడా సీతను తాకకుండా భూమిని పెకిలించి తీసుకెళ్తాడు. పరాయి స్త్రీని తాకకుండా పవిత్రంగా చూడటం గోండ్వాన పాలనలో భాగం.

ముమ్మాటికీ అధర్మ యుద్ధమే!

తదుపరి రాముడు రాజమార్గాన్ని ఎన్నుకోకుండా యుద్ధ మార్గాన్ని ఎన్నుకున్నాడు. గోండ్వానా సైన్యాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం వాలి, సుగ్రీవుల మధ్య విభేదాలు సృష్టించి వాలిని ఎదురుగా చంపలేక దొంగ చాటున చంపి అధర్మ యుద్ధనీతిని ప్రదర్శించాడు రాముడు. విభజించి పాలించి సుగ్రీవ సైన్యాన్ని తన వైపు తిప్పుకున్నాడు. రావణున్ని యుద్ధంలో ఢీకొనలేక మళ్లీ విభీష‌ణుణ్ణి తనకు కోవర్టుగా మార్చుకొని, రావణుని బలహీనతలు తెలుసుకొని నీతి తప్పి యుద్ధం గెలిచాడు రాముడు. ఎదురుగా నిలబడి యుద్ధం చేయడం యుద్ధనీతి. బలహీనతలతో యుద్ధం చేయటం అధర్మ యుద్ధం. నేటి సమాజం అధర్మ యుద్ధాన్నే చరిత్ర పొడవునా ప్రచారం చేస్తోంది.

రావణుడు రేపిస్ట్ అయితే...

రావణుడు రాక్షసుడని, స్త్రీలను అత్యాచారాలు చేసే నికృష్టుడని రావణవధ జరుపుతున్నాయి కొన్ని మతతత్వ శక్తులు, చరిత్ర తెలియనివారు. లంకలో సీత సుమారు 10 సంవత్సరాల కాలం పాటు ఉంది. సీతను రావణుడు ఏమైనా చేసి ఉంటే చాకలి అనుమానానికి అగ్నిప్రవేశం చేసిన సీత పతి వ్రతగా నిలిచేది కాదు. సీతను బలవంతం చేయలేదంటే, రావణుడు నీతి వంతుడు అని అర్థం. సీతను తాకకుండ భూమిని పెకిలించి తీసుకెళ్లిన తీరు చూస్తే రావణుడు ఎలా రాక్షసుడు అవుతాడు.

విజయ దశమి అర్థాన్నే మార్చేశారు..

విజయదశమి నాడు వివిధ రకాల కులాలు, తెగల వారు, ప్రజానీకం జమ్మి చెట్టుకు పూజ చేసి తమ పనిముట్లను, ఆయుధాలను చేయిస్తారు. కానీ, నేడు అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు మతం రంగు పూసుకొని, మతతత్వ శక్తులను ప్రోత్సహించి ప్రతియేటా విజయదశమిని రావణ వధకు సంకేతంగా జరుపుకుంటున్నవి. తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండుగ చివర్లో రావణవధ చేస్తున్నారు. పైగా రావణుడికి 10 తలలున్నాయని, దశకంఠుడని ప్రచారం. అందుకే రాక్షసుడని ముద్ర. రామాయణ కాలంలోనూ, నవీన కాలంలోనూ పది తలలు కలిగిన మనుషులు ఉండడం కల్పితమే కాక మరేమవుతుంది? రామాయణంలో గోండు సమాజం అంతా రాక్షసులుగా చిత్రీకరించబడింది. ఈ ఆధునిక కాలంలో అదే ఆదివాసీ సమాజంలో రాముడిని మళ్లీ దేవుడిగా తీసుకొచ్చారు. గుళ్ల నిర్మాణం చాప కింద నీరులా జరిగిపోయింది.

రాక్షసుడు కాదు.. రావణ బ్రహ్మ

మతతత్వ శక్తులు, ఆదివాసి చరిత్రను వెక్కిరిస్తున్నాయి. మధ్య భారత ఆదివాసీలు మొత్తంగా తాము రావణ సంతతి అని భావించి, తమ సాంస్కృతిక ఉద్యమాన్ని ఉధృతం చేసే రోజు ఆసన్నమైన వేళ.. ఏ మతతత్వ శక్తులూ ఈ ఉద్యమాన్ని ఆపలేవనేది చరిత్ర నిరూపించిన అంశం. అందుకే నేటి సమాజానికి ఆయనే రావణ బ్రహ్మ. రావణ మహారాజ్. ఆదివాసీలకు ఆరాధ్య బ్రహ్మ.

-గుమ్మడి లక్ష్మీనారాయణ,

ఆదివాసీ రచయితల వేదిక,

91822 96576

Next Story