ఈ కుల వివక్ష వ్యాఖ్యలు కరెక్ట్ కాదు..

by Ravi |   (  Updated:2025-06-07 01:47:16  IST  )

గురుకులాల్లో చదివే విద్యార్థులతో పనులు చేయించుకుంటాం. వాళ్లు వాడే టాయిలెట్లను వారే కడుక్కుంటే తప్పేంటి?

ఈ కుల వివక్ష వ్యాఖ్యలు కరెక్ట్ కాదు..
X

గురుకులాల్లో చదివే విద్యార్థులతో పనులు చేయించుకుంటాం. వాళ్లు వాడే టాయిలెట్లను వారే కడుక్కుంటే తప్పేంటి? వాళ్లేమీ పోష్ సొసైటీ నుంచి వచ్చిన వాళ్లేమీ కాదు. వాళ్లు కూర్చున్న వెంటనే టేబుల్ మీదికి భోజనం వస్తుందని భావిస్తే కుదరదు.. ఇలా టేబుల్‌పై కొడితే క్లీనింగ్‌కి మనుషులు వస్తారంటే అసలే కుదరదు.. అని రాష్ట్ర ఎస్సీ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయి దుమారం లేపుతున్నాయి.

వెట్టిచాకిరీలోకి నెట్టివేసేలా..

గురుకులాల్లో చదివే పిల్లలు ఆర్థిక స్థోమత తక్కువ ఉన్నవాళ్లే అని ఆమె చులకనగా మాట్లాడటంతో పాటు, ఎవరైనా పిల్లలతో పనులు చేయించుకుంటున్నారని బెదిరిస్తే నా ఆర్డర్ అని చెప్పండి అంటూ అధికారులకు ఆమె హుకుం జారీ చేయడం చూస్తుంటే దళిత విద్యార్థులపై గురుకుల సెక్రటరీకి ఎంత వివక్ష ఉన్నదో అర్ధం అవుతుంది. 40 సంవత్సరాల సోషల్ వెల్ఫేర్ గురుకుల చరిత్రలో ఇంతటి మానవత్వం లేని సెక్రటరీగా ఎవరూ రాలేదు. ఆమె తీరు దళిత విద్యార్థుల ఆత్మగౌరవాన్ని, విద్యా వ్యవస్థ పవిత్రతను దెబ్బతీసేలా ఉండటమే కాదు, లోతైన కుల వివక్షతో కూడినది. ఈ వ్యాఖ్యలు సమాజంలో ఇప్పటికీ ఉన్న కుల ఆధారిత వివక్షను మరింత బలపరిచేలా ఉన్నాయి. దళిత విద్యార్థులను వెట్టిచాకిరీలోకి నెట్టి వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే కుట్రలా కనిపిస్తున్నాయి. ఇదే కాక ఆమె గురుకుల విద్యాలయ సంస్థ (TSWREIS) ఆధ్వర్యంలోని 12 జూనియర్ కాలేజీలను అడ్మిషన్స్‌ సరిగ్గా లేవనే సాకు చూయించి వాటిని ఎత్తివేసి అక్కడ చదువుతున్న ద్వితీయ సంవత్సరం విద్యార్థులను దగ్గరలోని TSWREIS కాలేజీల్లోకి మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం (2025-26) నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించడంతో గురుకులంలో చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

విద్యార్థులు చేరడం లేదనే సాకుతో..

ఆమె వ్యవహారం విద్యార్థుల పట్ల వివక్షతో కాక వారి హక్కులు, గౌరవం వంటి ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించడమే. ఇది దళిత వ్యతిరేక వైఖరికి నిదర్శనం. వెంటనే ఆ అధికారిని తొలగించాలి. పోష్ పిల్లలు కాకపోయినా అందరు పిల్లలూ సమాజం దృష్టిలో, ప్రభుత్వం దృష్టిలో సమానమే అన్న సంకేతాలను ప్రభుత్వం చాటాల్సిన అవసరం ఉంది. గురుకుల పాఠశాలలు వివక్ష కేంద్రాలు కాదని, గురుకుల విద్యార్థులపై ఆమె చేసిన అనాగరిక వ్యాఖ్యలను మానవతావాదులు ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. ఇక ఎస్సీ గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థులు చేరడం లేదనే సాకుతో, వారికి కనీస సౌకర్యాలు కల్పించకుండా, అస్థవ్య స్థమైన ఆలోచనతో గురుకులాల్లోనూ సీట్లు మిగిలే దుస్థితికి తీసుకొచ్చింది. మౌలిక వసతుల సమస్యల కారణంగా విద్యార్థులు ఆ కళాశాలలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. సొంత భవనాలను నిర్మించి వసతులను మెరుగుపర్చాల్సిన ప్రభుత్వం కాలేజీలను మూసివేయాలని నిర్ణయం తీసుకోవడం దళిత విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్యను దూరం చేయడమే అవుతుంది. అందుకే వెంటనే ప్రభుత్వం సాంఘిక సంక్షేమ పాఠశాలలను సక్రమంగా నడపడానికి అవసరమైన నిధులు ఇవ్వాలి.

- వంగూరి వెంకటేష్

పీడీఎస్‌యూ సహాయ కార్యదర్శి.

73966 95586

Next Story