హాయిగా బతికేందుకు అవకాశం ఉన్నా బతకలేక..

by Ravi |   (  Updated:2025-07-22 01:00:59  IST  )

మీ ఎమ్మెల్యే ఎవరు అంటే తడుముకునే పిల్లవాడు.. ఫిష్ వెంకట్ తెలుసా? అంటే కళ్లేగరేస్తూ తెలుసని తలూపుతాడు. ఫిష్ వెంకట్

హాయిగా బతికేందుకు అవకాశం ఉన్నా బతకలేక..
X

మీ ఎమ్మెల్యే ఎవరు అంటే తడుముకునే పిల్లవాడు.. ఫిష్ వెంకట్ తెలుసా? అంటే కళ్లేగరేస్తూ తెలుసని తలూపుతాడు. ఫిష్ వెంకట్ సినిమాల్లో చేసేవి చిన్న పాత్రలైనా ముఖంలో ఏ భావం లేకుండా, పొట్టి సూటి డైలాగ్‌తో సీన్ పండిస్తారు. తన గరుకు లోగొంతుతో ఆయన ఏమంటాడా అని ప్రేక్షకులు ఆయన మాటపైనే మనసు పెడతారు. అమాయకంగా ఆయన పేల్చిన పంచ్‌కి నవ్వులు కురుస్తాయి అంతే. వెంటనే మరో డైలాగ్ ఉండదు. సీరియస్‌గా సాగుతున్న దృశ్యాన్ని పెద్దగా బాడీ మూమెంట్ లేకుండానే వెంకట్ తన టైమింగ్ సెన్స్‌తో లోకల్ యాక్సెంట్‌తో రిలాక్స్ చేస్తారు..

ఆయన్ని ఎక్కడ, ఎలా వాడుకోవాలి అనేది సినీ దర్శకులకు పూర్తిగా తెలుసు. అందుకే ఆయన కొన్నేళ్లుగా ప్రతి యాక్షన్ సినిమాల్లో కనబడ్డారు.. విలన్ వెంట ఎందరు జూనియర్ ఆర్టిస్టులు ఉన్నా, వారిలో ఎవరికీ రాని గుర్తింపు వెంకట్‌కు వచ్చింది. అలాంటి ఫిష్ వెంకట్ 53 ఏళ్ల వయసులోనే అనా రోగ్యంతో జులై 18న కన్ను మూశారు. సినీ అభిమానులంతా అయ్యో పాపం అని బాధపడ్డారు.

ఆరోగ్యం పట్ల అశ్రద్ధతో..

హైద్రాబాద్‌లోని ముషీరాబాద్ ప్రాంతంలో మంగలిపల్లి వెంకటేష్ పుట్టారు. చిన్నప్పుడే బడి ఎగ్గొడుతూ సినిమాలకు వెళ్లేవారు. సినిమాల్లో కనబడాలనే కోరిక అప్పుడే పుట్టింది. చదువు స్కూలు దగ్గరే ఆగిపోయింది. ఇంట్లో వృత్తిగా చేపలు అమ్ముతూనే సినిమా స్టూడియోల చుట్టూ తిరిగేవారు. చివరకు 2000లో దాసరి నారాయణరావు 'సమ్మక్క సారక్క' సినిమాలో అవకాశం ఇచ్చారు. అలా మొదలైన సినిమా ప్రస్థానం చాలా కాలం వెనక్కి చూసుకోకుండా సాగింది. చిన్న, పెద్ద సినిమాల్లో దాదాపు అందరూ హీరోలతో, దర్శకులందరి దగ్గరా ఫిష్ వెంకట్ పనిచేశారు. పరిశ్రమలో నటుడిగా గుర్తింపుతో, ప్రేక్షకుల ఆదరణతో ‌ఫిష్ వెంకట్ జీవితం ఎంతోకాలం సజావుగా సాగింది. అయితే కట్టడి లేని దురలవాట్ల వల్ల ఏడాది క్రితం ఆరోగ్యం దెబ్బ తినడంతో ఆయన ఈ మధ్య ఇంట్లోంచి కదలలేని పరిస్థితి ఏర్పడింది. డయాబెటిస్ దాడి చేసింది. మూత్రపిండాలు, కాలేయం దెబ్బ తిన్నాయి. కాళ్ల వాపులతో మంచానికే పరిమితమయ్యారు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ, డబ్బులు కూడబెట్టుకోకపోవడం వల్ల ఆయన నడి వయసులోనే చిక్కుల్లో పడ్డారు. సిగరెట్లు, గుట్కా, పాన్‌లను విపరీతంగా వాడేవాడినని ఆయనే చెప్పుకున్నారు. వాటి వల్ల దెబ్బతిన్న గొంతు మూగపోయి రెండు సర్జరీల తరవాత తిరిగి దారిలోకి వచ్చింది. గుట్కాలను యువత బానిస కావద్దని, దాని వల్ల జీవితం నాశనమౌతుందని, తానే దానికి ఉదాహరణ అని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెంకట్ చెప్పారు. ఆయన జబ్బుపడితే కుటుంబం చేతిలో వైద్యం కోసం సరిపడా డబ్బులు లేని పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది. అలా ఎవరూ కాపాడలేని స్థితిలో ఫిష్ వెంకట్ జీవితం ముగిసింది.

ఆరోగ్యం పట్ల జాగరూకత లేకపోతే..

సినిమాలో కనబడితే చాలు అని ఆఫీసుల చుట్టూ తిరిగే వారెందరో ఉంటారు. మామూలు కుటుంబంలోంచి వచ్చిన వెంకట్‌కు నటుడిగా మంచి అవకాశాలు రావడం విశేషమే. అతని అలవాట్ల వల్ల ఎన్నడూ షూటింగుకు ఆలస్యంగా వెళ్లలేదు. నటించే సమయంలో బుద్దిగా ఉన్నారు. ఇదే డిసిప్లిన్ జీవితం పట్ల కూడా పాటిస్తే బాగుండేది. చేతికి వస్తున్న డబ్బులతో అన్ని అలవాట్లను కొనసాగిస్తూ ఇలాగే బతుకొచ్చు అనుకున్నారు. అదే పాత ఇంట్లో అదే సామాన్య జీవితం గడిపారు. వైద్యం తీసుకోవాలన్న పట్టింపు లేదు. ఇదంతా ఒక రకమైన తేలిక భావన, పరిజ్ఞాన లేమిలా కనబడుతోంది. తెలిసో తెలియకో తన జీవితాన్ని మృత్యు కుహరంలోకి జార్చుకున్న ఫిష్ వెంకట్‌కు సరిదిద్దుకునే అవకాశం చేతికందలేదు. చుట్టూ అందరూ అసహాయులుగా చూస్తుండగానే ఆయన తుది శ్వాస విడిచారు. వందకు పైగా చిత్రాల్లో నటించిన వెంకట్ మరణం పట్ల పరిశ్రమ పెద్దలు, నటులు, దర్శకులు ఎవరు సంతాపం ప్రకటించలేదనే విమర్శలు వస్తున్నాయి. ఆయనకు శ్రద్ధాంజలి ఘటించేందుకు ఎవరు తరలి రాలేదు. కుటుంబ సభ్యులతో పాటు 'గబ్బర్ సింగ్' సినిమా గ్యాంగ్ సహనటులు ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. హాయిగా బతికేందుకు ఎన్ని అవకాశాలు ఉన్నా ఆరోగ్యం పట్ల జాగరూకత లేకపోతే జరిగే నష్టం పూడ్చలేనిది అని ఫిష్ వెంకట్ జీవితం హెచ్చరిస్తోంది. తెర మీద ఎంతో వినోదాన్ని పంచిన వెంకట్ ప్రేక్షకుల జ్ఞాపకాల్లో మాత్రం చెరిగిపోరు.

- బద్రి నర్సన్

94401 28169

Next Story