- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యవ్వనాన్ని నలిపేస్తున్న నిరుద్యోగం!
భారతదేశంలో నిరుద్యోగం యువత భవిష్యత్తును ప్రభావితం చేస్తున్న వ్యవస్థాగత సంక్షోభంగా మారింది. ప్రభుత్వ నియామకాల ఆలస్యం, ఉద్యోగ భద్రత లేమి, విద్య-ఉద్యోగ అసమతుల్యత వంటి కారణాలు యువతను తీవ్ర నిరాశలోకి నెట్టుతున్నాయి. పరిష్కార మార్గాలపై విశ్లేషణాత్మక వ్యాసం.

మన దేశంలో నిరుద్యోగం ఇక సాధారణ సామాజిక సమస్య కాదు. అది యవ్వనాన్ని నిశ్శబ్దంగా నలిపివేసే వ్యవస్థాగత సంక్షోభంగా మారింది. చదువు పూర్తయ్యాక ఉద్యోగం దొరుకుతుందనే ఆశతో కుటుంబాల అంచనాలను భుజాలపై మోసుకున్న యువత, నేడు పోటీ పరీక్షల చక్రవ్యూహంలో చిక్కు కుని సంవత్సరాల తరబడి ఎదురు చూపుల్లోనే నిలిచిపోతోంది. ప్రతి ఏడాది లక్షలాది మంది డిగ్రీలు, పీజీలు, ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేస్తున్నా, చేతిలో సర్టిఫికెట్లు ఉన్నా చేతికి పని లేకపోవడం విరోధా భాసంగా మారింది. ప్రతిభ ఉన్న యువత కూడా కాంట్రాక్టులు, అవుట్ సోర్సింగ్, గిగ్ ఎకానమీ పేర్లతో ఉద్యోగ భద్రత లేని తాత్కాలిక పనుల్లో చిక్కుకుని భవిష్యత్తుపై అనిశ్చితితో జీవిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో పరిస్థితి మరింత దారుణం.. ఒక నోటిఫికేషన్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూపు, వచ్చిన నోటిఫికేషన్‌కు లక్షల దరఖాస్తులు, చివరకు కొద్ది మందికే అవకాశం. పరీక్షల వాయిదాలు, రద్దులు, లీకులు యువతలోని నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి.. నిజానికి నిరుద్యోగం ప్రభావం వ్యక్తిగత జీవితాలకు మాత్రమే పరిమితం కాదు.. ఆలస్యమైన వివాహాలు, కుటుంబ విభేదాలు, ఆత్మవిశ్వాస లోపం, నిరాశ, వ్యసనాల పెరుగుదల వంటి ఎన్నో సమస్యలు తెచ్చి సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అందుకే కొందరు దేశం విడిచి వెళ్లడాన్నే మార్గంగా చూస్తున్నారు.. ఇది కేవలం బ్రెయిన్ డ్రెయిన్ కాదు, ఆశల వలస.. దీని పరిష్కారం కోసం ప్రభుత్వం ముందుగా సమస్యను అంగీకరించాలి. పారదర్శక డేటా విడుదల చేయాలి. విద్యను ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుసంధానం చేయాలి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు బలమైన మద్దతు ఇవ్వాలి. ప్రభుత్వ నియామకాల్లో పారదర్శకత, కాలపాలన తప్పనిసరి చేయాలి. యువత తమ హక్కుల కోసం శాంతియుతంగా, సంఘటితంగా నిలబడాలి. నిరు ద్యోగం వ్యక్తిగత వైఫల్యం కాదు. అది వ్యవస్థ వైఫల్యం. యవ్వనానికి ఉద్యోగంతో పాటు గౌరవం, భవిష్యత్తుపై నమ్మకం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది.
- సాయికృష్ణ,
90142 52482






