విద్యార్థి.. టీచర్ రేషియో సవరించాలి!

by Ravi |   (  Updated:2026-07-02 00:30:26  IST  )

ప్రభుత్వ పాఠశాలల్లో హేతుబద్ధీకరణ కంటే అదనపు ఉపాధ్యాయుల నియామకం, ఖాళీల భర్తీ, డీఎస్సీ ద్వారా కొత్త నియామకాలు ఎందుకు అవసరమో, విద్యా హక్కు చట్టం, విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి, ప్రభుత్వ విద్య బలోపేతంపై విశ్లేషణ.

విద్యార్థి.. టీచర్ రేషియో సవరించాలి!
X

విద్యా హక్కు చట్టం–2009 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు అందుబాటులో ఉండాలి. అయితే దీని అర్థం 30 మందికి ఒక ఉపాధ్యాయుడే ఉండాలని కాదు. 30 మంది లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో కూడా అవసరాన్ని బట్టి ఎక్కువ మంది ఉపాధ్యాయులను నియమించవచ్చు. ఉన్నత ప్రాథమిక స్థాయిలో ప్రతి 35 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ వారీగా ఉపాధ్యాయులు ఉండాలని చట్టం పేర్కొంటుంది. మన రాష్ట్ర విషయానికి వస్తే 2015లో జీవో నెం. 11, 17 ప్రకారం, 2021లో జీవో ఎంఎస్ నెం. 25 ఆధారంగా హేతుబద్ధీకరణకు చర్యలు తీసుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు.. ప్రస్తుతం రాష్ట్రంలో 24,224 ప్రభుత్వ పాఠశాలలు, సుమారు 16 లక్షల మంది విద్యార్థులు, 1.06 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. మొత్తం 1.25 లక్షల పోస్టులు మంజూరై ఉండగా దాదాపు 19 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోసారి హేతు బద్ధీకరణ పేరుతో ఖాళీ పోస్టులను మిగులు పోస్టులుగా చూపించే ప్రయత్నం జరుగుతుందనే ఆందోళన నిరుద్యోగుల్లో వ్యక్తమవుతోంది. కానీ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడాలంటే కనీస ప్రమాణాలు కాకుండా అదనపు ఉపాధ్యాయులు అవసరం. 10 మంది లోపు విద్యార్థులు ఉన్న ప్రతి పాఠశాలకు ఇద్దరు, 20 మంది వరకు ముగ్గురు, 30 మందికి పైగా ఉంటే కనీసం నలుగురు ఉపాధ్యాయులను కేటాయించాలి. ఈ విధానం అమలైతే విద్యార్థులకు నాణ్యమైన బోధన అందడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. డీఎస్సీ ద్వారా ఖాళీ పోస్టులు భర్తీ కావడంతో నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. అదనపు ఉపాధ్యాయుల నియామకం, ఖాళీల భర్తీ, పాఠశాలలపై నిరంతర పర్యవేక్షణ వంటి చర్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగి ప్రభుత్వ విద్యా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది.

-రావుల రామ్మోహన్ రెడ్డి

63054 58920

Next Story